ఢిల్లీకి పందేరం
ఢిల్లీకి పందేరం
Published Thu, Mar 31 2016 2:12 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
ఈవీకేఎస్ పరుగు
రాహుల్‌తో భేటీ
నేడు తుది నిర్ణయానికి అవకాశం
సాక్షి, చెన్నై: డీఎంకేతో కాంగ్రెస్ సీట్ల పందేరం ఢిల్లీకి చేరింది. ఏఐసీసీ పిలుపుతో ఢిల్లీకి టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ పరుగులు తీశారు. రాహుల్ గాంధితో భేటీ అయ్యారు. గురువారం సీట్ల పందేరం కొలిక్కి రావడంతో పాటుగా తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.డీఎంకేతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధమైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ పార్టీ ఎన్నికల ఇన్‌చార్జ్ గులాం నబి ఆజాద్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ ముకుల్ వాస్నిక్ రెండు సార్లు డీఎంకే అధినేత ఎం కరుణానిధితో భేటీ అయ్యారు.
అయితే, సీట్ల పందేరం మాత్రం కొలిక్కి రాలేదు. గత ఎన్నికల్లో తమకు కేటాయించిన 63 సీట్లే మళ్లీ అప్పగించాలన్న డిమాండ్‌న డీఎంకే ముందు ఉంచారు. అయితే, గతంలో వాసన్ కాంగ్రెస్‌లో ఉండడం, ప్రస్తుతం ఆయన వేరు కుంపటితో ఎన్నికల్ని ఎదుర్కొంటుండడం, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగ్గిన ఓట్ల శాతాన్ని పరిగణలోకి తీసుకుని 25 సీట్లను మాత్రం ఇవ్వడానికి డిఎంకే నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. డిఎంకే తక్కువ సీట్లు ఇవ్వడానికి నిర్ణయించడంతో రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో అసంతృప్తి బయలు దేరింది.
అదే సమయంలో కాంగ్రెస్ బయటకు వెళ్తే, డీఎంకేలోకి వాసన్ నేతృత్వంలోని తమిళ మానిల కాంగ్రెస్‌ను ఆహ్వానించేందుకు తగ్గ కసరత్తుల్లో డీఎంకే ఉండడంతో ఆచీతూచీ అడుగులు వేసే పనిలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు. పలు మార్లు తమిళనాడు కాంగ్రెస్(టీఎన్‌సీసీ) అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ నేతృత్వంలోని సీట్ల పందేరం కమిటీ సమాలోచించినా, సీట్ల సంఖ్య మాత్రం పెరగలేదని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ నుంచి వచ్చిన పిలుపుతో ఈవీకేఎస్ ఇళంగోవన్ పరుగులు తీశారు.
రాహుల్‌తో సమాలోచన: ఢిల్లీ చేరుకున్న ఈవీకేఎస్ ఇళంగోవన్ బుధవారం ఉదయం తొలుత రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్‌చార్జ్ గులాం నబి ఆజాద్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ ముకుల్ వాస్నిక్‌లతో సమావేశమయ్యారు. డీఎంకే దళపతి స్టాలిన్ నేతృత్వంలోని సీట్ల పందేరం కమిటి తమ ముందు ఉంచిన సూచనలు, నియోజకవర్గాల వివరాలను వారి దృష్టికి ఈవీకేఎస్ తీసుకెళ్లారు. తదుపరి ఈ ముగ్గురు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమాలోచనలో పడ్డారు. ఇక తుది నిర్ణయంగా అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అనంతరం సీట్ల పందేరాన్ని కొలిక్కి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. తాజా సమాచారాలతో 30 నుంచి 33 సీట్లను ఇవ్వడానికి డీఎంకే నిర్ణయించినట్టు టీఎన్‌సీసీ వర్గాలు పేర్కొంటున్నాయి.
దీనికి మరో నాలుగైదు సీట్లు కలిపి ఇవ్వాలని పట్టుబట్టి, తదుపరి మెట్టు దిగి, డీఎంకే ఇచ్చిన దాంతో సర్దుకునేందుకు తగ్గ కార్యాచరణతో ఆజాద్, వాస్నిక్, ఈవీకేఎస్ గురువారం చెన్నైకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆ వర్గాలు చెబుతున్నాయి. తమకు మద్దతు ఇచ్చే వాళ్లందరికి ఒకటి రెండు, ఐదు సీట్ల వరకు సర్దుబాటు చేసి తక్షణం ఒప్పంద పత్రాలను అందిస్తున్న డీఎంకే అధినేత కరుణానిధి, దళపతి స్టాలిన్ కాంగ్రెస్ విషయంలో మాత్రం నాన్చుడు ధోరణి అనుసరిస్తుండడం గమనార్హం. అయితే, ఈ నాన్చుడు తమ వైపు లేదని, కాంగ్రెస్ వైపు ఉందంటూ డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఇళంగోవన్ వ్యాఖ్యానించారు. వాళ్లు ఏ నిర్ణయం తీసుకోవాలన్న ఢిల్లీ పెద్దలతో సంప్రదించాల్సి ఉన్న దృష్ట్యా, జాప్యం తప్పదని పేర్కొన్నారు.
Advertisement
Advertisement