సంకటంలో ఇళంగోవన్
ఏఐసీసీకి ఫిర్యాదుల వెల్లువ
ఉద్వాసనకు డిమాండ్
ఢిల్లీకి పరుగు
అరెస్టుకు రంగం సిద్ధం
సాక్షి, చెన్నై : తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్‌కు సంకట పరిస్థితులు ఎదురు అవుతున్నాయి. సీఎం జయలలితపై ఆయన చేసిన వ్యాఖ్యలు, రాష్ట్రంలో ఆయనకు వ్యతిరేకంగా సాగుతున్న రచ్చ ఏఐసీసీ దృష్టికి చేరింది. తనపై ఫిర్యాదులు వెల్లువెత్తిన సమాచారంతో వివరణ ఇచ్చుకునేందుకు దేశ రాజధానికి రాష్ట్ర అధ్యక్షుడు పరుగులు తీశారు. కాగా, అధ్యక్షులు వారు హద్దులు దాటారంటూ కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు, ఏఐసీసీ సభ్యుడు కార్తీ చిదంబరం వ్యాఖ్యానించడం ఈవీకేఎస్ మద్దతు దారుల్లో ఆగ్రహాన్ని రేపుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ - సీఎం జయలలితలను ఉద్దేశించి టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ నోరు జారడం వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే.
బహిరంగ క్షమాపణకు డిమాండ్ చేస్తూ అన్నాడీఎంకే వర్గాలు నిరసనలు కొనసాగిస్తూ వస్తున్నాయి. ఓ వైపు నిరసనలో మరో వైపు కోర్టులో కేసుల నమోదుకు పిటిషన్ల మోత మోగుతున్నాయి. ఈవీకేఎస్‌కు అండగా ఉన్నారన్న ఒక్క కారణంగా ఆ పార్టీ అధికార ప్రతినిధి కుష్భుకు వ్యతిరేకంగా సైతం నిరసనలు, పిటిషన్ల మోత మోగుతూ వస్తున్నాయి. శనివారం కూడా రాష్ర్టంలో పలు చోట్ల నిరసనలు హోరెత్తాయి. ఈ పరిస్థితుల్లో కామరాజర్ ట్రస్ట్‌లో అవినీతి జరిగిందంటూ వలర్మతి అనే మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు రాష్ట్ర కాంగ్రెస్‌లోని ఈవీకేఎస్ వ్యతిరేకులకు ఆయుధంగా మారినట్టుంది. రాష్ర్టంలో ఈవీకేఎస్ చేసిన అనుచిత వ్యాఖ్యలు, ఆయనకు వ్యతిరేకంగా సాగుతున్న నిరసనలు, ట్రస్టులో అవినీతి బండారాన్ని కొందరు నాయకులు ఢిల్లీకి చేరవేసినట్టుంది.
ఫిర్యాదుల వెల్లువ : రాష్ర్టంలో కాంగ్రెస్ నేతలు పేరుకే ఐక్యత అన్న నినాదాన్ని వాడుతున్నా, లోలోపల గ్రూపు రాజకీయాల్ని సాగిస్తూనే ఉన్నారు. ఈవీకేఎస్ నియామకం నాటి నుంచి ఆయనకు వ్యతిరేకంగా కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంతో పాటుగా పలువురు మాజీ అధ్యక్షులు గ్రూపులు వ్యవహరిస్తూనే వస్తున్నాయి. తాజాగా, ఈవీకేఎస్‌కు వ్యతిరేకంగా అధిష్టానంకు ఫిర్యాదులు చేయడానికి లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డట్టున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరువును బజారుకీడ్చే రీతిలో ఈవీకేఎస్ వ్యవహరించి ఉన్నారని, పరిస్థితి ఇలాగే కొనసాగిన పక్షంలో మరింత సంకట పరిస్థితులు పార్టీకి తప్పదన్న సంకేతాన్ని ఆయన వ్యతిరేకులు ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి నోటి దురుసు కారణంగా పార్టీకి చెడ్డ పేరు తలెత్తి ఉన్న దన్న సమాచారంతో ఏఐసీసీ తదుపరి కార్యచరణకు సిద్ధమైనట్టుంది. ప్రధానంగా ఈవీకేఎస్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని ఆయన వ్యతిరేకులు అధిష్టానం వద్ద డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.
ఢిల్లీకి పరుగు : అవకాశం దొరికింది కదా..? అని తన వ్యతిరేకులు ఏకమై పదవీ ఎసురు పెట్టే పనిలో పడటంతో ఈవీకేఎస్ మేల్కొన్నారు. రాత్రికి రాత్రే ఢిల్లీకి చెక్కేశారు. ఏఐసీసీ అధినేత్రి సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలను కలుసుకుని తన వివరణ ఇచ్చుకునే పనిలో పడ్డారు. ఆయన ఇచ్చే వివరణకు ఏ మేరకు అధిష్టానం ఏకీభవిస్తుందోనన్న ఎదురు చూపుల్లో ఈవీకేఎస్ మద్దతు దారులు ఉన్నారు. ఆదివారం కూడా తమ నేత ఢిల్లీలోనే ఉంటారని ఈవీకేఎస్ మద్దతు దారులు ఒకరు పేర్కొనడం గమనార్హం. సెక్షన్ల గుబులు : ఓ వైపు తన పదవిని కాపాడుకునేందుకు ఢిల్లీకి వెళ్లినా, పోలీసుల అరెస్టు నుంచి ఈవీకేఎస్ తప్పించుకుంటారా..? అన్న ఉత్కంఠ నెలకొని ఉంది. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు సోమవారానికి వాయిదా వేయడంతో అరెస్టు నుంచి తప్పించుకునేందుకే ఆదివారం కూడా ఢిల్లీలో తిష్ట వేయడానికి ఈవీకేఎస్ నిర్ణయించిన ఉన్నారని ఆయన వ్యతిరేకులు వ్యాఖ్యానిస్తున్నారు.
వలర్మతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈవీకేఎస్‌పై ఏడు రకాల సెక్షన్లతో కేసుల్ని చెన్నై పోలీసులు నమోదు చేసి ఉన్నారు. 323,506(1), 354,509,406,420 తదితర సెక్షన్ల నమోదైన దృష్ట్యా, అరెస్టైన పక్షంలో బెయిల్ లభించడం కష్టమేనని పేర్కొంటున్నారు. ఇక, ఈవీకేఎస్‌ను సోమవారం లోపు అరెస్టు చేయడానికి చెన్నై పోలీసులు ఉవ్విళ్లూరుతో ఢిల్లీకి ప్రత్యేక బృందాన్ని పంపినట్టు సమాచారం. తాజా పరిస్థితులన్నీ ఈవీకేఎస్‌కు సంకటంగా మారుతున్నాయి. ఈ సమయంలో చిదంబరం తనయుడు, కార్తీ చిదంబరం ఈవీకేఎస్ హద్దులు దాటారని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ విమర్శలు, ఆరోపణలకు ఒక హద్దు అంటూ ఉంటుందని, అయితే, సీఎం జయలలితపై చేసిన వ్యాఖ్యల్లో ఈవీకేఎస్ హద్దులు దాటి నోరు జారారంటూ మీడియాతో కార్తీ పేర్కొనడం ఈవీకేఎస్ మద్దతు దారుల్ని జీర్ణించుకోలేకుండా చేస్తున్నది. ఈ పరిణామాలు మున్ముందు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయోనన్నది వేచి చూడాల్సిందే.