వామ్మో జంప్!
సాక్షి, చెన్నై : స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ లక్ష్యంగా అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత వ్యూహ రచనల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటి నుంచి పార్టీ వర్గాలు ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లే పనిలో పడ్డారు. అలాగే, ఆయా జిల్లాల్లో ఇతర పార్టీల్లో స్థానికంగా ఉన్న ముఖ్య నాయకుల్ని తమ వైపుకు తిప్పుకునే విధంగా కార్యాచరణ సిద్ధం చేశారు.ఈ బాధ్యతల్ని ఆయా జిల్లాల్లోని మంత్రులు, ముఖ్య ఎమ్మెల్యేలకు అప్పగించారు. దీంతో స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ప్రతినిధులుగా ఉన్నవాళ్లు, స్థానికంగా పట్టు, బలం కల్గిన ఇతర పార్టీలకు చెందిన వారిని తమ వైపుకు తిప్పుకోడంలో మంత్రులు, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సఫలీకృతులు అవుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఒకే రోజు 31 వేల 234 మంది అమ్మ గూటికి చేరడం గమనార్హం.
వామ్మో జంప్ : డీఎంకే, కాంగ్రెస్, డీఎండీకే, సీపీఎం, వీసీకే, ఎండీఎంకే, బీజేపీ, ఐజేకే తదితర పార్టీలకు చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు, వారి మద్దతుదారులు, ముఖ్య నాయకులు, పలువురు జిల్లాల నేతలు గురువారం రాయ పేటకు ఉత్సాహంతో ఉరకలు తీశారు. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, విల్లుపురం, కృష్ణగిరి, తిరుప్పూర్, కోయంబత్తూరు, అరియలూరు, తంజావూరు, మదురై, తేని, శివగంగై, కరూర్, రామనాథపురం, తిరునల్వేలి నుంచి తరలి వచ్చిన వారితో రాయపేటలోని అన్నాడీఎంకే కార్యాలయ పరిసరాలు కిక్కిరిశాయి. అక్కడి కల్యాణ మండపం వేదికగా జరిగిన కార్యక్రమంలో వీరంతా అమ్మ జయలలిత సమక్షంలో అన్నాడీఎంకే గొడుగు నీడకు చేరారు.
ఈ కార్యక్రమం నిమిత్తం పోయెస్ గార్డెన్ నుంచి రాయపేటకు బయలు దేరిన జయలలితకు దారి పొడవున అన్నాడీఎంకే వర్గాలు బ్రహ్మరథం పట్టాయి. 2500 మంది మహిళలతోపాటుగా 31,234 మంది అన్నాడీఎంకేలోకి చేరడంతో అమ్మ జయలలిత ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్య ప్రతినిధులు, నాయకులకు స్వయంగా తన చేతుల మీదుగా పార్టీ సభ్యత్వ గుర్తింపు కార్డులను అందజేశారు. విల్లుపురం జిల్లా అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఇర కుమర గురు పర్యవేక్షణలో ఆ జిల్లాకు చెందిన ఆరు వేలు, మంత్రి ఎస్‌పి వేలుమణి పర్యవేక్షణలో కోయంత్తూరు జిల్లా నుంచి ఐదు వేలు, మరో మంత్రి విజయభాస్కర్ పర్యవేక్షణలో కరూర్‌కు చెందిన మరో ఐదు వేలు మంది అత్యధికంగా అన్నాడీఎంకేలో చేరిన వారిలో ఉన్నారు.
‘మహా’ గెలుపు లక్ష్యం: వివిధ పార్టీల నుంచి కొత్తగా అన్నాడీఎంకేలో చేరిన వారిని ఉద్దేశించి అమ్మ జయలలిత ప్రసంగించారు. ముందుగా అందరికీ మనస్పూర్తిగా ఆహ్వానం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక్కడికి వచ్చిన వారందరీ జీవితాల్లో ఇక వసంతమేనని వ్యాఖ్యానించారు. మరెన్నో గెలుపుల్ని ఇక్కడున్న వారందరూ చూడ బోతున్నారని పేర్కొంటూ, స్థానిక సమరంలో మహా గెలుపు లక్ష్యంగా ఉత్సాహంగా ముందుకు సాగుదామని పిలుపు నిచ్చారు.
రాష్ట్ర ప్రజలకు అన్నీ అందాలన్న లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తున్న తనకు అండగా ప్రతి ఒక్కరూ నిలవాలని, పథకాలన్నీ ప్రజల దరి చేర్చడమే ధ్యేయంగా శ్రమించాలని సూచించారు. అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ, వారికి తగిన గుర్తింపు ఇస్తూ ముందుకు సాగుతున్న పార్టీ రాష్ట్రంలో ఒక్క అన్నాడీఎంకే మాత్రమే అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. అందరికీ మంచి రోజులు వచ్చినట్టేనని, ఇదే ఉత్సాహంతో స్థానిక సమరంలో దూసుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.