'ఏఐసీసీ అడిగితేనే సమాధానమిస్తా'
చెన్నై: పీసీసీ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు జవాబిచ్చేందుకు కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం నిరాకరించారు. తనను వివరణ అడిగే అధికారం ఏఐసీసీ క్రమశిక్షణ సంఘానికి మాత్రమే ఉందని పేర్కొన్నారు. తాను ఏఐసీసీ సభ్యుడినని, తనపై క్రమశిక్షణ చర్య తీసుకునే అధికారం ఏఐసీసీకి మాత్రమే ఉందన్నారు. ఏఐసీసీ అడిగితేనే సమాధానమిస్తానని చెప్పారు.
మాజీ ముఖ్యమంత్రి కామరాజనాడార్‌ను, పార్టీ వ్యవహారాలను విమర్శించినందుకు ఆయనకు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్ ఈనెల 23న సంజాయిషీ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. నోటీసుకు వారం రోజుల్లోగా వివరణ ఇవ్వకుంటే పార్టీ నుంచి బహిష్కరిస్తామని ఇళంగోవన్ స్పష్టం చేశారు.