జైపూర్: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. జైపూర్‌లో 'పరివర్తన యాత్ర' ప్రారంభోత్సవంలో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా తీవ్ర స్థాయిలో స్పందించారు.
త్వరలో రాజస్థాన్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దుంగార్పూర్ వేదికగా 'పరివర్తన యాత్ర'ను ప్రారంభించిన కేంద్ర మంత్రి అమిత్ షా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టే అర్ధమవుతుంది ఇండియా కూటమి హిందూత్వాన్ని వ్యతిరేకమని.. ఇది ఒకరకంగా హిందూత్వ వారసత్వంపై దాడి చేయడమేనని.. స్టాలిన్ తనయుడు చేసిన వ్యాఖ్యలు ఇండియా కూటమి ఓటు బ్యాంక్ రాజకీయాలకు, బుజ్జగింపు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. డీఎంకే నాయకుడి కుమారుడు.. కాంగ్రెస్ నేత కుమారుడు మారణహోమానికి పిలుపునిస్తున్నారని అన్నారు.
ఈ సందర్బంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా గతంలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలను చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఆనాడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ రాడికల్ హిందూ సంస్థలు లష్కర్-ఏ-తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల కంటే ప్రమాదమని అన్నారు. మీ హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా ఇది హిందూ ఉగ్రవాదమని అన్నారు. కానీ ఈనాడు సనాతన ధర్మం ప్రజల మనుసును గెలుచుకుందని మళ్ళీ మోదీ అధికారంలోకి వస్తే సనాతన పరిపాలన వస్తుందని వారు ఆశాభావంతో ఉన్నారని అన్నారు.
అయోధ్యలో రామ మందిరం నిర్మించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఏళ్ళు అడ్డుకుందని.. మా హయాంలోనే రామ మందిరం నిర్మాణ పనులు మొదలయ్యాయని జనవరికల్లా మందిర నిర్మాణం పూర్తవుతుందని దాన్ని అడ్డుకోవడం కాంగ్రెస్ వల్ల కాదని అన్నారు. ఇక ఈరోజు ప్రారంభమైన 'పరివర్తన యాత్ర' 19 రోజుల పాటు 2500 కి.మీ కొనసాగుతుందని.. మొత్తం 52 నియోజకవర్గాల్లో 152 చిన్న సభలు.. 54 భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నామని.. అవినీతిలో పీకల్లోతు కూరుకుపోయిన అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని అన్నారు.
అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ మాట్లాడుతూ ఉదయనిధి వ్యాఖ్యలను సమర్ధించడమే కాదు సనాతన ధర్మం మతం పేరిట ప్రాంతం పేరిట ప్రజలను వేరు చేసే సిద్ధాంతమని అన్నారు. ఉదయనిధి స్టాలిన్ కూడా అమిత్ షా వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ నేను చెప్పిందాంట్లో తప్పేమీ లేదని.. ఒక్క మాట కూడా వెనక్కి తీసుకోబోవడం లేదని స్పష్టం చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించడమంటే మానవత్వాన్ని, సమానత్వాన్ని కాపాడటమేనని అన్నారు. సనాతన ధర్మం వలన అణగారిన వర్గాల తరపునే నేను ఆ మాటలన్నానని తెలిపారు.
మాజీ మంత్రి పి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం కూడా ఉదయ నిధి స్టాలిన్ వ్యాఖ్యలను సమర్ధిస్తూ.. కులం దేశానికి శాపమని అన్నారు. చెన్నైలో రైటర్ల సదస్సులో మాట్లాడుతూ స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చారు. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించలేమని నిర్మూలించడం ఒక్కటే మార్గమని అన్నారు.
ఇది కూడా చదవండి: జమిలీ ఎన్నికలపై స్పందించిన రాహుల్.. ఏమన్నారంటే?
Comments
Please login to add a commentAdd a comment