న్యూఢిల్లీ: 2011లో కొందరు చైనీయులకు వీసాల జారీకి సంబంధించిన మనీలాండరింగ్ ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆయన వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేశారు. ఈడీ అధికారులు ఈ నెల 12, 16వ తేదీల్లో కూడా కార్తీకి సమన్లు పంపారు. అయితే, అవసరమైన పత్రాల సేకరణకు సమయం కావాలంటూ ఆయన విచారణకు హాజరుకాలేదు. పంజాబ్‌లో ఏర్పాటవుతున్న ఒక విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనుల కాంట్రాక్టును చైనా కంపెనీ తీసుకుంది.
ఈ కంపెనీ గడువులోగా పనులను పూర్తి చేయలేదు. దీంతో, 263 మంది చైనా సిబ్బందికి దేశంలో ఉండేందుకు అవసరమైన వీసాలను మళ్లీ మంజూరు చేయాల్సిన అవసరం ఏర్పడింది. వీసాల మంజూరు కోసం 2011లో కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంకు రూ.50 లక్షలు ముట్టినట్లు సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ప్రశ్నించేందుకే ఈడీ అధికారులు కార్తీకి నోటీసులు పంపారు. అయితే, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరంను వేధించే చర్యల్లో భాగంగానే తనపై కక్షగట్టారని కార్తీ ఆరోపిస్తున్నారు. ఒక్క చైనీయుడి వీసా మంజూరుకు కూడా తాను ఎన్నడూ సాయపడలేదన్నారు. కార్తీ చిదంబరంపై ఐఎన్‌ఎక్స్ మీడియా, ఎయిర్‌సెల్–మ్యాక్సిస్ కేసుల్లో మనీలాండరింగ్ ఆరోపణల కింద ఇప్పటికే ఈడీ దర్యాప్తు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment