ఆమెను ఎన్నికల్లో పోటీ చేయిస్తారా?
ఈవీకేఎస్ ఆకర్షణ మంత్రం
ఆశావహులకు కృతజ్ఞత లేఖలు
పార్టీ వర్గాలకు గెలుపు సందేశం
అవకాశం ఇస్తే పోటీకి రెడీ అంటున్న కుష్భు
సాక్షి, చెన్నై: పార్టీలో తనపై ఉన్న వ్యతిరేకతను చెరిపేసేందుకు టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇలంగోవన్ కసరత్తుల్లో పడ్డారు. ఆకర్షణ మంత్రంతో అందరి మన్ననలు అందుకునేందుకు సిద్ధం అయ్యారు. సీట్లను ఆశిస్తున్న ఆశావహులకు కృతజ్ఞతలు తెలుపుతూ లేఖాస్త్రాలు సంధించే పనిలో పడ్డారు. గ్రూపులకు అతీతంగా పార్టీ వర్గాలకు గెలుపు సందేశాన్ని ఇస్తూ, అధిష్టానం పాదాల వద్ద సమర్పణ పిలుపులో పడ్డారు.
తనకు అవకాశం ఇస్తే పోటీకి రెడీ అని అధికార ప్రతినిధి కుష్భు ఎన్నికల కదన రంగంలోకి దిగాలన్న ఆశాభావంతో ఉన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ రాజకీయాలే పార్టీకి గడ్డు పరిస్థితుల్ని సృష్టించాయి. రానున్న ఎన్నికల్లో తమ బలాన్ని చాటుకునేందుకు కాంగ్రెస్ పెద్దలు తీవ్రంగానే కుస్తీలు పడుతున్నారు. తమను డీఎంకే అక్కున చేర్చుకోవడంతో కాంగ్రెస్ ఆనందానికి అవధులు లేవు.
అయితే, గ్రూపు రాజకీయ సెగ మాత్రం తగ్గినట్టు లేదు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇలంగోవన్‌కు వ్యతిరేకంగా అన్ని శక్తులు వ్యవహరిస్తుండడం, ఇది కాస్త కాంగ్రెస్ పార్టీ బలం మీద దెబ్బకు పరిణామాల్ని సృష్టిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్‌ను ఎందుకు అక్కున చేర్చుకున్నామా? అన్న డైలమాలో పడాల్సిన పరిస్థితి డీఎంకేకు ఏర్పడింది. ఇందుకు కారణం కాంగ్రెస్‌లోని గ్రూపులు రోజుకో హెచ్చరికలు చేస్తూ రావడమే. అందర్నీ కలుపుకుని ముందుకు సాగాల్సిన పరిస్థితి ఈవీకేఎస్‌కు ఏర్పడి ఉన్నది. దీంతో ఆకర్షణ మంత్రంతో పార్టీ వర్గాల్ని కలుపుకుని ఒకే వేదిక మీదకు తెచ్చేందుకు ఈవీకేఎస్ కుస్తీలు పట్టే పనిలో పడ్డారు.
ఆకర్షణ మంత్రం
ఎన్నికల్లో పోటీకి సీటు ఆశిస్తూ ఏడు వేల మంది వరకు దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో అన్ని గ్రూపులకు చెందిన నాయకులు, వారి మద్దతుదారులు ఉన్నారు. వీరందర్నీ ఆకర్షించడమే కాకుండా, వీరిని కలుపుకుని ముందుకు సాగేందుకు లేఖాస్త్రాలు సంధించే పనిలో ఈవీకేఎస్ నిమగ్నం అయ్యారు. సీటు ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మొదలయ్యే ఈ లేఖలో పార్టీ గెలుపు లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఐక్యతతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఐక్యతా రాగాల్ని వల్లించి ఉండడం విశేషం. పార్టీ నాయకులు, కార్యకర్తలకు సైతం సందేశాల్ని పంపించే పనిలో ఈవీకేఎస్ నిమగ్నం అయ్యారు. రాష్ర్టంలో అన్నాడీఎంకే పతనం లక్ష్యంగా సాగుతున్న ఎన్నికల సమరంలో ‘గెలుపు’ కోసం ఐక్యతతో ముందుకు సాగుదామని, ఆ విజయాన్ని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పాదాల చెంత సమర్పిద్దామని పిలుపునిస్తున్నారు.
పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న వాళ్లందరికీ న్యాయం జరుగుతుందని, గెలుపు కోసం శ్రమించే ప్రతి ఒక్కరిని పదవులు వరిస్తాయంటూ అందర్నీ కలుపుకునే ముందుకు సాగేందుకు విశ్వ ప్రయత్నంలో మునిగి ఉండడం గమనార్హం. ఇక, అందర్నీ కలుపుకునే పనిలో ఈవీకేఎస్ నిమగ్నం అవుతోంటే, తనకు సీటు ఇస్తే పోటీకి సై అంటూ సినీ నటి, పార్టీ అధికార ప్రతినిధి కుష్భు ముందుకు సాగుతున్నారు.
సీటు ఇస్తే ఓకే
డీఎంకే నుంచి బయటకు వచ్చిన కుష్భును కాంగ్రెస్‌లో అందలం ఎక్కించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆశ ఆమెలో ఉన్నా, దానికి డీఎంకే వర్గాలు తొక్కేశాయి. కాంగ్రెస్‌లో ఆ ఛాన్స్ దక్కుతుందా..? అన్న ఎదురు చూపుల్లో కుష్భు ఉన్నారు. పార్టీ అధికార ప్రతినిధి హోదాలో ప్రత్యేక గ్లామర్‌గా ఉన్న కుష్భు సేవలు కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో అవసరం. ఈ దృష్ట్యా, ఆమెను ఎన్నికల్లో పోటీకి చేయిస్తారా? లేదా, కేవలం ఎన్నికల ప్రచారానికి పరిమితం చేస్తారా? అన్న ప్రశ్న బయలు దేరి ఉన్నది.
దీంతో తన మదిలో ఉన్న కోరికను ముందే పార్టీ అధిష్టానం ముందు ఉంచే పనిలో కుష్భు ఉన్నారు. ఇందుకు తగ్గట్టుగా మీడియాతో ఆమె మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో అధిష్టానం ఆదేశిస్తే, పోటీకి సిద్ధమని వ్యాఖ్యానించారు. తాను ఎన్నికల్లో పోటీ చేయాలంటూ పలువురు దరఖాస్తులు చే సి ఉన్నారని గుర్తు చేశారు.
అయితే, తాను పోటీ చేయాలా..? వద్దా..? అన్న తుది నిర్ణయం అధిష్టానం తీసుకుంటుందని పేర్కొన్నారు. డీఎండీకే అధినేత విజయకాంత్ డీఎంకే కూటమిలోకి రావాలన్న ఆశ తనకు ఉందని, ఆయన వస్తారన్న నమ్మకం కూడా ఉందని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. కార్తీ చిదంబరం వ్యవహారం కేవలం రాజకీయం ఎత్తుగడ మాత్రమేనని, ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అప్రతిష్ట పాలు చేయడానికి పన్నిన కుట్రగా కుష్భు వ్యాఖ్యానించారు.