మరిన్ని సంస్కరణలే మందు
మరిన్ని సంస్కరణలే మందు
Published Wed, Aug 28 2013 1:26 AM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM
న్యూఢిల్లీ: రూపాయి విలువ అడ్డూ అదుపూలేకుండా పడిపోయి.. ఇప్పుడు 66 స్థాయి దిగువకు సైతం కుప్పకూలడంతో ప్రభుత్వం దిక్కుతోచని పరిస్థితుల్లో చిక్కుకుంది. ఆర్థిక వ్యవస్థ దీనావస్థపై అన్నివైపుల నుంచి విమర్శలు పోటెత్తడంతో... మరిన్ని సంస్కరణలను ప్రవేశపెట్టడం ఒక్కటే దీనికి పరిష్కారమార్గమని ఆర్థిక మంత్రి చిదంబరం పేర్కొన్నారు. బొగ్గు, ఇనుప ఖనిజం రంగాల్లో నెలకొన్న అనిశ్చితి, స్తబ్దత తొలగితేనే వృద్ధికి ఊతం లభిస్తుందని తేల్చిచెప్పారు. మంగళవారం లోక్‌సభలో దేశ ఆర్థిక పరిస్థితిపై జరిగిన చర్చకు సమాధానంగా ఆయన మాట్లాడారు.
ప్రభుత్వం అనుసరిస్తున్న అధ్వాన, చెత్త విధానాలవల్లే ఆర్థిక వ్యవస్థ మంటగలుస్తోందని, యూపీఏ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దింపేస్తేకానీ పరిస్థితులు మెరుగుపడవంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. కాగా, మందగమనంలోఉన్న ఆర్థిక వ్యవస్థను మళ్లీ 8 శాతం వృద్ధికి మళ్లించాలంటే తయారీ రంగం, ఎగుమతులకు చేయూతవంటి 10 ప్రధాన చర్యలను చిదంబరం ప్రస్తావించారు. ‘మనకు ఇప్పుడు తక్కువ నియంత్రణలు, మరిన్ని సంస్కరణల ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆర్థిక వ్యవస్థను మరింత సరళీకరించి, విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిస్తేనే గడ్డుపరిస్థితుల నుంచి గట్టెక్కగలం’ అని పేర్కొన్నారు.
కరెన్సీ మహా పతనంపై...
దేశీ కరెన్సీ విలువ ఉండాల్సిన దానికంటే మరీ తక్కువగా(అండర్‌వేల్యూడ్) ఉందని ఆర్థిక మంత్రి చిదంబరం వ్యాఖ్యానించారు. ‘వాస్తవ విలువకంటే ప్రస్తుతం రూపాయి మరీ ఘోరంగా పతనమైంది. అయితే, ఇన్వెస్టర్లలో సెంటిమెంట్‌ను మెరుగుపరిచేందుకు, అదేవిధంగా రూపాయి బలోపేతానికి సంబంధించి ప్రభుత్వం అవసరమైన చర్యలన్నీ తీసుకుంటుందని హామీఇస్తున్నా. అయితే, కొంత ఓపికతో ముందుకెళ్లాల్సి ఉంటుంది. ముందుగా ఆర్థిక వ్యవస్థ మూలాలను మరింత పటిష్టంచేసేవిధంగా విస్తృతస్థాయిలో చర్యలపై దృష్టిపెడుతున్నాం.
తగినస్థాయికి రూపాయి తిరిగికోలుకుంటుందనే విశ్వాసం ఉంది’ అని రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా చిదంబరం వివరణ ఇచ్చారు. అంతకుముందు విలేకరులతో మాట్లాడుతూ... వర్థమాన దేశాలన్నీ ప్రస్తుతం ఇదేవిధమైన కరెన్సీ పతన, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నాయన్నారు. సోమవారం డాలరుతో రూపాయి మారకం విలువ కొత్త చరిత్రాత్మక కనిష్టం వద్ద(66.24)కు జారిపోవడం... సెన్సెక్స్ 600 పాయింట్లు కుప్పకూలిన నేపథ్యంలో చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, విదేశీ నిధుల సమీకరణకు సావరీన్ బాండ్‌ల జారీ వంటి అంశాలపై అడిగిన ప్రశ్నలకు... అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నామని, సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోనున్నట్లు చెప్పారు.
ఉద్దీపనలు కూడా ముంచాయ్...
2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడం కోసం అప్పట్లో ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలు కూడా తాజా సమస్యలకు కారణమని చెప్పారు. ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్-మూలధన పెట్టుబడులు మినహా దేశంలోకి వచ్చే, బయటికిపోయే విదేశీ మారకం నిధుల మధ్య వ్యత్యాసం)లు ఎగబాకేందుకు ఆజ్యంపోశాయన్నారు. ఆహార భద్రత చట్టాన్ని, ఇతర సబ్సిడీలన్నింటినీ అమలు చేసిన తర్వాత కూడా ఈ ఏడాది ద్రవ్యలోటును జీడీపీతో పోలిస్తే 4.8 శాతానికి కట్టడి చేయగలమన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ ఏడాది బడ్జెట్‌లో మొత్తం ఆహార సబ్సిడీ కేటాయింపులు రూ.90 వేల కోట్లు కాగా, ఆహార భద్రత చట్టం అమలుకు రూ.10 వేల కోట్లను వెచ్చించనున్నట్లు వెల్లడించారు.
70 బిలియన్ డాలర్లకు క్యాడ్ కట్టడి...
పెట్టుబడులు, తయారీ రంగం పుంజుకుంటే ఆర్థిక వ్యవస్థకు గడ్డుపరిస్థితులు తొలగుతాయని. క్యాడ్‌కూ కళ్లెం పడుతుందని చిదంబరం వివరించారు. ప్రస్తుత 2013-14 ఏడాదిలో క్యాడ్‌ను జీడీపీతో పోలిస్తే 3.7 శాతానికి(70 బిలియన్ డాలర్లు) కట్టడి చేయగలమన్న విశ్వాసం వ్యక్తం చేశారు. గతేడాది క్యాడ్ చరిత్రాత్మక గరిష్టానికి(4.8%-88.2 బిలియన్ డాలర్లు) ఎగబాకడం తెలిసిందే. ఇక ఆర్‌బీఐ విషయానికొస్తే.. కేంద్ర బ్యాంకులేవైనా సరే వృద్ధికి, ఉద్యోగకల్పనకు పోత్సాహం ఇచ్చేవిధంగా విధాన నిర్ణయాలను తీసుకోవాలని మరోసారి నొక్కివక్కానించారు.
రూ. 1.83 లక్షల కోట్ల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
పెట్టుబడులకు ఊతమిచ్చే దిశగా దాదాపు రూ. 1.83 లక్షల కోట్ల విలువ చేసే ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చిదంబరం తెలిపారు. పెట్టుబడుల క్యాబినెట్ కమిటీ (సీసీఐ) తాజా భేటీలో ఈ మేరకు ఆమోదముద్ర వేసినట్లు వివరించారు. క్లియరెన్స్ లభించిన ప్రాజెక్టుల్లో 18 విద్యుత్ ప్రాజెక్టులు.. అదే సంఖ్యలో రోడ్, రైల్వే, పెట్రోలియం ప్రాజెక్టులు ఉన్నట్లు విలేకరులకు చిదంబరం చెప్పారు. ఒడిశాలో జీఎంఆర్‌కి చెందిన 1,400 మెగావాట్ల కమలాంగా, ల్యాంకో నిర్మిస్తున్న బదాంధ్ పవర్ ప్లాంట్లతో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు బొగ్గు సరఫరాకు అడ్డంకులు తొలగినట్లేనని వివరించారు. వచ్చే నెల 6లోగా ఆయా సంస్థలు కోల్ ఇండియాతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని మంత్రి తెలిపారు. ఇక హైదరాబాద్‌లో ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ ప్రాజెక్టు, జార్ఖండ్‌లో ఎస్సార్ పవర్ ప్రాజెక్టు మొదలైన వాటికి కూడా ఆటంకాలు తొలగినట్లేనని ఆయన చెప్పారు.
Advertisement
Advertisement