ఎన్డీఏలోకి జయలలిత?
3న ప్రధానితో భేటీ కానున్న తమిళనాడు సీఎం
న్యూఢిల్లీ/చెన్నై: కేంద్రంలోని బీజేపీ సర్కారులో తమిళనాడు సీఎం జయలలిత నేతృత్వంలోని అన్నా డీఎంకే కూడా చేరబోతోందంటూ సాగుతున్న ఊహాగానాల మధ్య.. జూన్ 3న ప్రధాని నరేంద్ర మోడీతో జయలలిత భేటీ కానున్నారు. శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్సను మోడీ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించడాన్ని నిరసిస్తూ జయలలిత ఆ కార్యక్రమానికి గైర్హాజరైన సంగతి తెలిసిందే.
అయితే రాష్ట్ర అభివృద్ధి కోసం పలు అంశాలపై చర్చించేందుకుగాను మోడీతో ఢిల్లీలోని ఆయన నివాసంలో జయలలిత మంగళవారం సమావేశం కానున్నారని శుక్రవారం రాష్ట్రప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మోడీ ప్రధాని పదవిని చేపట్టిన తర్వాత ఆయనతో జయలలిత అధికారికంగా భేటీ కానుండటం ఇదే తొలిసారి. తమిళనాడుకు సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న వివిధ అంశాలపై విజ్ఞప్తులతో ఆమె ప్రధానికి వినతిపత్రాన్ని సమర్పించనున్నారని తెలిపాయి.
కాగా, తమిళనాడులోని 39 లోక్‌సభ సీట్లలో 37 సీట్లను అన్నా డీఎంకేనే సొంతం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వంలో చేరే అంశంపై జయలలితతో బీజేపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బీజేపీకి రాజ్యసభలో మెజార్టీ లేకపోవడం, ఆ సభలో 10 మంది సభ్యులు అన్నా డీఎంకేకు ఉండటంతో జయ పార్టీకి ప్రాధాన్యం ఏర్పడింది.