‘రెండాకుల’ లక్ష్యం
♦ మళ్లీ ఢిల్లీకి అన్నాడీఎంకే రాజకీయం
♦ చిహ్నం కైవసానికి కసరత్తు
♦ మంత్రులు, ఎంపీల బృందం తిష్ట
♦ ఈసీతో భేటీకి కుస్తీ
♦ కేంద్ర మంత్రులతో మంతనాలు
♦ మేల్కొన్న దినకరన్ శిబిరం
♦ తమను సంప్రదించాలని ముందుస్తుగా లేఖ
♦ కోర్టుకు సర్వ సభ్య సమావేశం వ్యవహారం
రెండాకుల చిహ్నం కైవసం లక్ష్యంగా అన్నాడీఎంకే రాజకీయం మంగళవారం ఢిల్లీకి చేరింది. ఓపీఎస్–ఈపీఎస్ నేతృత్వంలో ఎన్నికల కమిషన్ వద్ద సమర్పించి ఉన్న ఫిర్యాదుల్ని వెనక్కు తీసుకునే ప్రయత్నాలు వేగవంతం అయ్యాయి. ఇందుకోసం మంత్రులు, ఎంపీల బృందం దేశ రాజధానిలో తిష్ట వేసింది. న్యాయనిపుణులతో ఓ వైపు, కేంద్ర మంత్రులతో మరో వైపు ఈ బృందం చర్చల్లో మునిగి ఉంది. ఇక, చిహ్నం కైవసం లక్ష్యంగా ఓపీఎస్–ఈపీఎస్ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేస్తూదినకరన్ మేల్కొన్నారు. తమను సంప్రదించకుండా, ఎలాంటి నిర్ణయం తీసుకునేందుకు వీలు లేదని ముందుగానే ఈసీని ఆశ్రయించారు.
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకేలో ఈపీఎస్(సీఎం పళని), ఓ పీఎస్(డిప్యూటీ సీఎం) విలీన పర్వం ముగిసినా, ఉప ప్రధాన కార్యదర్శిగా చెప్పుకుంటున్న దినకరన్ రూపంలో వివాదం రాజుకుంటోంది. దినకరన్ దూకుడు ఈపీఎస్, ఓపీఎస్‌లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. పుదుచ్చేరిలో తిష్టవేసిన దినకరన్ మద్దతు ఎమ్మెల్యేలు రోజుకో హెచ్చరికలు, బెదిరింపులతో ఈపీఎస్‌కు షాక్ ఇచ్చే విధంగా దూసుకెళ్తున్నారు. మంగళవారం మీడియాతో దినకరన్ మద్దతు ఎమ్మెల్యే తంగతమిళ్ సెల్వన్, వెట్రివేల్ మాట్లాడుతూ, అందరి బండారాలు బయటపెట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు.
తమను కట్టడి చేయడం ఎవరితరం కాదు అని, చిన్నమ్మకు వ్యతిరేకంగా వ్యవహరించడం మానుకుంటే మందని హితవు పలికారు. ఎన్నికల కమిషన్ నుంచి ప్రమాణ పత్రాన్ని వెనక్కు తీసుకుంటే, కోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇక, బల పరీక్ష విషయంలో గవర్నర్ స్పందించని దృష్ట్యా, పుదుచ్చేరిలో ఉన్న దినకరన్ మద్దతు ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లి, రాష్ట్రపతిని కలిసేందుకు తగ్గ ప్రయత్నాల్లో పడ్డారు. దినకరన్ శిబిరం నుంచి బెదిరింపుల పర్వం పెరగడంతో, చిన్నమ్మకు చెక్ పెట్టే కార్యాచరణను ఈపీఎస్, ఓపీఎస్ వేగవంతం చేశారు. రెండాకుల చిహ్నం కైవసం చేసుకున్న పక్షంలో దినకరన్ మెడలు వంచినట్టే అని నిర్ధారణకు వచ్చి అందుకు తగ్గ ప్రయత్నాల్ని వేగవంతం చేశారు.
చిహ్నం దక్కించుకోవడమే లక్ష్యం
ఈపీఎస్, ఓపీఎస్ వేర్వేరుగా ఉన్న సమయంలో సమర్పించిన ఫిర్యాదుల మేరకు ఎన్నికల కమిషన్ వద్ద రెండు కేసులు విచారణలో ఉన్నాయి. అందులో ఒకటి రెండాకుల చిహ్నం, మరొకటి ప్రధాన కార్యదర్శి నియామకం వ్యవహారం. ఇందులో రెండాకుల చిహ్నం దక్కించుకున్న పక్షంలో, పార్టీ సర్వ సభ్య సమావేశం ఆధారంగా ప్రధాన కార్యదర్శి ఎవరన్నది తేల్చవచ్చునన్న ప్రస్తుతం ఆ ఇద్దరు నేతలు నిర్ణయానికి వచ్చారు. దీంతో ఎన్నికల కమిషన్ వద్ద సమర్పించిన ప్రమాణ పత్రాలు, ఫిర్యాదుల్ని వెనక్కు తీసుకునేందుకు ఢిల్లీ బాట పట్టారు. పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై సారథ్యంలో మంత్రులు జయకుమార్, తంగమణి, సీవీ షణ్ముగం, ఎంపీ మైత్రేయన్, మాజీ ఎంపీ మనోజ్ పాండియన్ ఉదయం నుంచి ఢిల్లీలో బిజీ అయ్యారు.
న్యాయ నిపుణులతో ఉదయం నుంచి చర్చ సాగింది. తదుపరి కేంద్ర సహాయ మంత్రి నిర్మల సీతారామన్‌తో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. సాయంత్రం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ సాగింది. ఈ భేటీల గురించి తంబిదురై మీడియాతో మాట్లాడుతూ, మర్యాద పూర్వకమేనని సమాధానం ఇచ్చారు. అయితే, నిర్మల సీతారామన్ దర్శకత్వంలోనే రెండాకుల చిహ్నం కైవసం వ్యవహారంలో న్యాయపరంగా చర్చలు సాగుతున్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే, కేంద్ర ఎన్నికల కమిషన్‌ను తొలిరోజు ఈ బృందం కలవలేదు.
‘సర్వ సభ్యం’ సభ్యుల గురి
అన్నాడీఎంకేలో ప్రధాన కార్యదర్శికి మద్దతుగా సభ్యుల్ని సమీకరించే పనిలో చిన్నమ్మ శశికళ కుటుంబం రంగంలోకి దిగడం గమనార్హం. ఓవైపు దినకరన్, మరో వైపు చిన్నమ్మ సోదరుడు దివాకరన్ ఎమ్మెల్యేలను లాగేందుకు ప్రయత్నాల్లో ఉంటే, ఇతర కుటుంబ సభ్యులు సర్వ సభ్య సమావేశ సభ్యుల్ని తమవైపునకు తిప్పుకునే ప్రయత్నాలను వేగవంతం చేసినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఈ పరిస్థితుల్లో ఇన్నాళ్లు దినకరన్‌కు వెన్నంటి ఉన్న మాజీ మంత్రి దళవాయి సుందరం ఈపీఎస్‌తో భేటీకి నిర్ణయించడం ఆ శిబిరంలో కలవరాన్ని రేపుతోంది. అదే సమయంలో దినకరన్‌కు మున్ముందు ముచ్చెమటలు పట్టిస్తామని నగరాభివృద్ధి శాఖ మంత్రి ఎస్‌పీ వేలుమణి స్పందిస్తే, చిన్నమ్మ శశికళను ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించబోమని మరో మంత్రి వెల్లమండి నటరాజన్ స్పందించడం ఆలోచించ దగ్గ విషయం.
మేల్కొన్న దినకరన్
ఈపీఎస్–ఓపీఎస్ బృందం ఢిల్లీకి చేరడంతో ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ మేల్కొన్నారు. ఆగమేఘాలపై పార్టీ కర్ణాటక విభాగం నేత పుహలేందిని ఢిల్లీకి పంపించారు. ఓపీఎస్, ఈపీఎస్‌ల విలీన వ్యవహారాలను ప్రస్తావిస్తూనే, అన్నాడీఎంకే వ్యవహారాల్లో తన ప్రమేయం ఉందని, చిన్నమ్మ శశికళ, తన పేరిట ఇప్పటికే ఈసీకి అనేక వినతిపత్రాలు, ప్రమాణ పత్రాలు సమర్పించారని వివరిస్తూ ఓ లేఖను పుహలేంది ఎన్నికల కమిషన్‌కు సమర్పించారు. దినకరన్‌ను సంప్రదించకుండా, రెండాకుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకునేందుకు వీలు లేదని సూచించారు. ప్రమాణ పత్రాలను వెనక్కు తీసుకునే విధంగా ఏదేని ప్రయత్నాలు సాగినా, అందుకు తగ్గ వివరణ దినకరన్ నుంచి తీసుకోవాల్సి ఉందని, చర్చించకుండా, ఎలాంటి ఆమోదాలు తెలిపేందుకు వీలు లేదని అందులో స్పష్టంచేశారు. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి విదేశాలకు వెళ్లడంతో, ఆయన రాకకోసం ఓపీఎస్–ఈపీఎస్ ఎదురు చూడాల్సిన పరిస్థితి.
కోర్టుకు ‘సర్వ సభ్యం’
అన్నాడీఎంకే సర్వ సభ్యసమావేశం వ్యవహారం కోర్టుకు చేరింది. ఆదిత్యన్ రాంకుమార్ అనే వ్యక్తి మంగళవారం మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంలో పిటిషన్ వేశారు. అన్నాడీఎంకేలో సాగుతున్న పరిణామాలను గుర్తుచేస్తూ, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని ఆ పిటిషన్‌లో వివరించారు. ప్రస్తుతం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎవరన్న వివాదం బయలుదేరి ఉందని, ఇందుకోసం సర్వసభ్య సమావేశం జరగబోతోందని వివరించారు. ఈ సమావేశాన్ని రిటైర్డ్ న్యాయమూర్తి సమక్షంలో జరిపేలా కోర్టు నిర్ణయం తీసుకుంటే, శాంతిభద్రతలకు విఘాతం కల్గకుండా ఉంటుందని పేర్కొన్నారు. అన్నాడీఎంకేలో ఉన్న శిబిరాలను ఒక చోట చేర్చి, రిటైర్డ్ న్యాయమూర్తి సమక్షంలో ప్రధాన కార్యదర్శి ఎన్నిక జరిగే విధంగా> ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు శశిథరన్, స్వామినాథన్ నేతృత్వంలోని బెంచ్ పరిశీలించింది. ఈ పిటిషన్ విచారణకు స్వీకరిస్తూ సంబంధిత శిబిరాలను ప్రతి వాదులుగా చేర్చాలని ఆదేశిస్తూ తదుపరి పిటిషన్ వాయిదా వేశారు.