సాక్షి, చెన్నై : వేద నిలయాన్ని స్మారక మందిరంగా మారుస్తూ తీసుకొచ్చిన ప్రత్యేక చట్టాన్ని దివంగత సీఎం జయలలిత మేన కోడలు దీప తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ ఇంటిని కబ్జాచేయడమే కాదు, అందులో ఉన్న వస్తువుల్ని కొల్లగొట్టేందుకు అన్నాడీఎంకే పాలకులు సిద్ధమయ్యారని ఆరోపించారు. పోయెస్‌గార్డెన్‌లోని దివంగత సీఎం జయలలితకు చెందిన వేదనిలయాన్ని స్మారక మందిరంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పనులకు గాను సీఎం నేతృత్వంలో ఓ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. గవర్నర్ ఆమోదంతో ఈ చట్టాన్ని అమలు చేయడానికి సిద్ధమయ్యారు.
ఆగమేఘాలపై చట్టం ఏంటి?
ఈ పరిస్థితుల్లో జయలలిత మేన కోడలు దీప ఆదివారం ఆడియో రూపంలో స్పందించారు. జయలలితతో తనది రక్త సంబంధం అన్న విషయాన్ని ఈ పాలకులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఆమెకు తాను మేన కోడలు అని, మేనత్త మరణంతో తాను రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితి వచ్చిందని గుర్తు చేశారు. అయితే, రాజకీయ కుట్రలు, వెన్నంటి ఉన్న వారి రూపంలో అందులో నుంచి బయటకు రాక తప్పలేదన్నారు. ప్రస్తుతం కరోనా తాండవం రాష్ట్రంలో మరీ ఎక్కువగా ఉందని గుర్తు చేస్తూ, ఈ సమయంలో ఆగమేఘాల మీద తన మేనత్త ఇంటిని కబ్జా చేయడానికి చట్టం తీసుకు రావాల్సిన అవసరం ఈ పాలకులకు ఎందుకు వచ్చినట్టు అని ప్రశ్నించారు.
కేవలం వేద నిలయాన్ని కబ్జా చేయడం, అక్కడున్న అన్ని రకాల వస్తువుల్ని అపహరించడం, కొల్లగొట్టడం లక్ష్యంగా ఈ పాలకుల చర్యలు ఉన్నాయని ఆరోపించారు. జయలలిత ఆస్తులకు ఎవరైనా వారసులు అని నిరూపించుకుని రానివ్వండి తదుపరి చూసుకుందామని న్యాయ మంత్రి సీవీ షణ్ముగం ఓ వ్యాఖ్య చేశారని గుర్తు చేశారు. రక్త సంబంధీకులు వారసులు కాలేరా అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన మేనత్త మరణం గురించిన వివరాల్ని నిగ్గు తేల్చలేని పరిస్థితుల్లో ఈ పాలకులు ఉన్నారని ధ్వజమెత్తారు. చనిపోయిన తన మేనత్తను మళ్లీ తీసుకు రాగలరా అని ప్రశ్నిస్తూ, వేదనిలయం తమ పూర్వీకుల సొత్తు అని దాని జోలికి వెళ్లడం మంచిది కాదని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment