ఢిల్లీ పీఠంపై జయ కన్ను.
Published Thu, Nov 21 2013 1:47 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత డిల్లీ పీఠంపై కన్నేశారు. బుధవారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె తన ప్రసంగాల్లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఢిల్లీ పీఠం కైవసం చేసుకునేందుకు యూపీఏ, ఎన్‌డీఏలు తమ వంతు ప్రయత్నాలు చేస్తుండగా, మూడో కూటమి ఏర్పాటు ద్వారా ఎర్రకోటను ఎగురవేసుకుపోవాలని మరి కొన్ని పార్టీలు యోచిస్తున్నాయి. ఇటీవల డిల్లీలో ఒక సమావేశం నిర్వహించి ఆ దిశగా చర్చలు జరిపాయి. ఈ చర్చల్లో జయ కూడా పాల్గొన్నారు.
యూపీఏకు రాహుల్, ఎన్‌డీఏకు నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థులుగా ఖరారయ్యూరు. మూడో కూటమి అంటూ ఏర్పడితే ప్రధాని పదవి కోసం అనేక మంది కాచుక్కూచున్నారు. వీరిలో జయలలిత కూడా ఒకరని రాష్ట్రంలో ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతోంది. జయ ఇంటి సమీపంలో బారులుతీరిన ఫ్లెక్సీల్లో కాబోయే ప్రధాని జయ అనే నినాదాలున్నాయి. అయితే ఇంతకాలం అభిమానులకే పరిమితమైన ఈ నినాదం తొలిసారిగా జయ నోటి వెంట వచ్చింది. చెన్నైలో బుధవారం ఒకే వేదికపై జరిగిన రాష్ట్ర మంత్రులు కే పళనిసామి, సెందూర్ పాండియన్, షణ్ముగనాథన్, పుదుచ్చేరి ఎమ్మెల్యే కవియరసు కుమారులు, కుమార్తెల వివాహ వేడుకలకు సీఎం జయ హాజరయ్యూరు.
ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి చేసిన సుదీర్ఘ ప్రసంగంలో ఆధ్యాతికత కర్తవ్యబోధను చేశారు. గెలుపు ఓటములు నాణేనికి ఇరుపాశ్వాల వంటివి, ఓటమి తరువాతనే గెలుపు వస్తుందని పేర్కొన్నారు. జీవితంలో సుఖదుఃఖాలు సైతం అంతే సహజమని ధైర్యం చెప్పారు. అబ్రహం లింకన్ అనేక ఓటములు చవిచూసిన తరువాతనే అమెరికా అధ్యక్షులయ్యూరని చరిత్రను గుర్తుచేశారు. వచ్చే ఏడాది జరుగనున్న పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలోని 40 స్థానాల్లో అన్నాడీఏంకే గెలుపు త థ్యమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు సైతం ఇదే దీక్ష, లక్ష్యంతో ముందుకు సాగాలని అన్నారు. రేపటి భారతం మనదే అంటూ ఆమె పేర్కొన్నారు.
జీహెచ్‌లో మరో అమ్మ క్యాంటిన్
చెన్నై ప్రజల విశేషాభిమానం చూరగొన్న అమ్మ క్యాంటిన్ల వరుసలో మరొకటి చేరింది. రాష్ట్రంలోని వారేగాక పొరుగు రాష్ట్రాల ప్రజలతో సైతం కిటకిటలాడే చెన్నై జనరల్ ఆస్పత్రిలో కొత్తగా నిర్మించిన అమ్మ క్యాంటిన్‌ను బుధవారం జయ ప్రారంభించారు. చెన్నై సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 5,100 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ క్యాంటీన్‌లో 300 మంది ఒకే సారి భోజనం చేసేలా వసతి కల్పించారు. వృద్ధులు, వికలాంగులకు అనుకూలంగా ఏర్పాట్లు చేశారు. అత్యంత తక్కువ ధరకే టిఫిన్, భోజనం అందించేలా అమ్మ క్యాంటిన్లను ఈ ఏడాది ఫిబ్రవరి 19న ప్రారంభించారు. నగరంలోని మొత్తం 200 వార్డుల్లో ఈ క్యాంటీన్ల ఏర్పాటు పూర్తయింది. ప్రతి రోజు ఉదయం 7 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ఆహారాన్ని అందిస్తారు. చలికాలంలో దోమలతో పేద ప్రజలు రోగాల బారిన పడకుండా రక్షించుకునేందుకు 5 లక్షల దోమ తెరలను జయ బుధవారం పంపిణీ చేశారు. రూ.1.32 కోట్ల విలువైన తెరలను నగరంలో రోడ్ల కిరువైపులా నివసించే పేదవారికి వాటిని పంచిపెట్టారు.
Advertisement
Advertisement