చల్లారని జ్వాల
ముఖ్యమంత్రి జయలలితను అవమానిస్తూ శ్రీలంక ఆర్మీ వెబ్ సైట్లో కార్టూన్లు రగిల్చిన చిచ్చు రాష్ట్రంలో చల్లారడం లేదు. ఆదివారం అన్నాడీఎంకే న్యాయవాద విభాగం నేతృత్వంలో నిరసనలు రాజుకున్నాయి. ఆ కార్టూన్లు వేసిన వారిని ఉరి తీయాల్సిందేనని నిరసన కారులు పట్టుబట్టారు. డీజీపీ రామానుజంకు వినతి పత్రం సమర్పించారు.
సాక్షి, చెన్నై : జాలర్లపై దాడులు జరిగినప్పుడల్లా ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం జయలలిత లేఖాస్త్రాలు సంధించడంపై ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని శ్రీలంక ఆర్మీ వెబ్ సైట్లో వ్యంగ్యాస్త్రాలు, కార్టూన్లు పొందు పరచడం వెలుగులోకి వచ్చింది. ఇది రాష్ట్రంలోని తమిళాభిమానులు, రాజకీయ పక్షాలు, అధికార పక్షం వర్గాల్లో ఆగ్రహాన్ని రగిల్చింది. శ్రీలంక క్షమాపణలు చెప్పినా ఈ ఆగ్రహం మాత్రం చల్లారడం లేదు. రోజుకో రూపంలో నిరసనలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి.న్యాయవాదుల నిరసన: అన్నాడీఎంకే న్యాయవాద విభాగం నేతృత్వంలో ఆదివారం నిరసనలు చేపట్టారు. నల్ల జెండాలను చేత బట్టిన ఆ విభాగాల నాయకులు తమ తమ ప్రాంతాల్లో శ్రీలంకకు వ్యతిరేకంగా నినాదాల్ని హోరెత్తించారు.
ఆ కార్టూన్లు వేసిన వారిని, వ్యంగ్యాస్త్రాలు సంధించిన వారిని ఉరి తీయాల్సిందేనని నినదించారు. చెన్నైలో ఆ విభాగం రాష్ట్ర కార్యదర్శి, ఎంపీ నవనీత కృష్ణన్ నేతృత్వంలో ఉదయం లైట్ హౌస్ వద్ద న్యాయవాదులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. శ్రీలంకకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నవనీత కృష్ణన్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత తమిళ ప్రజల సంక్షేమం, జాలర్లకు రక్షణ లక్ష్యంగా ముందుకెళుతున్నారని వివరించారు. ఆమె చేస్తున్న సేవలను వ్యంగ్యాస్త్రాలతో విమర్శించడం శోచనీయమన్నారు.
ఆమె సేవలను, ఆమె ధైర్యాన్ని, సంచలనాన్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తుంటే, శ్రీలంక అధికారులు ఇలాంటి విమర్శలతో తమ అక్కసును వెళ్లగక్కారని మండి పడ్డారు. దీనికి బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని, వారికి ఉరి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. అనంతరం ఇదే డిమాండ్‌తో డీజీపీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ డీజీపీ రామానుజంకు వినతి పత్రం సమర్పించారు. ఈ నిరసన కార్యక్రమంలో అన్నాడీఎంకే న్యాయవాద విభాగం నేతలు ఇన్భదురై, ఎం జయ, అరివలగన్, శిశ శంకర్, ముత్తురామన్, గోపినాథ్, మెట్రో రవి పాల్గొన్నారు.