ఓర్పు అవసరం
చెన్నై, సాక్షి ప్రతినిధి: సమస్యల పరిష్కారంలో కొంత ఓర్పు వహించడం అందరికీ అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ హితవు పలికారు. దీర్ఘకాలిక సమస్యలు వెంటనే పరిష్కారం కావని, కొంత సమయం పడుతుందని నచ్చజెప్పారు. శ్రీలంకలో ప్రధాని రెండు రోజుల పర్యటన సందర్భంగా తమిళ దేశీయ కూట్టమైప్పు పార్లమెంటు సభ్యులు శుక్రవారం రాత్రి నరేంద్రమోదీని కలుసుకున్నారు. శ్రీలంకలోని తమిళుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించాలంటే తూర్పు, ఈశాన్య ప్రాంతాలను ఏకం చేయడం ఒక్కటే మార్గమని ప్రధానికి వివరించారు. ఈ పనిచేయనిదే సమస్యకు పరిష్కారం దొరకదని స్పష్టం చేశారు. ఇందుకు భారత్-శ్రీలంక మధ్య జరిగే ఒప్పందాలు దోహదపడాలని అన్నారు. గత అధ్యక్షుడు రాజపక్సే మోకాలొడ్డిన కారణంగా తీవ్రనష్టం జరిగిందని పార్లమెంటు సభ్యులు సురేష్ ప్రేమచందన్ ఆరోపించారు.
తమిళ దేశీయ కూట్టమైప్పు పార్లమెంటు సభ్యులు చెప్పిన విషయాలను ఆకళింపు చేసుకున్న అనంతరం మోదీ మాట్లాడారు. శ్రీలంకలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది, వారికి కొంత సమయం ఇవ్వడం అవసరమని అన్నారు. శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన సానుకూలంగా స్పందిస్తున్నారని, ఇంకా చర్చలు జరపాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే తమిళుల సమస్యల పరిష్కారం విషయంలో భారత్ ఎప్పుడు సానుకూలంగా, అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. శ్రీలంక యుద్ధం సమయంలో కనపడకుండా పోయిన తమిళుల ఆచూకీ తెలపాల్సిందిగా కోరుతూ మోదీ దృష్టికి తీసుకెళ్లేందుకు ర్యాలీ నిర్వహించారు. కొవ్వొత్తులు, తప్పిపోయిన వారి ఫొటోలను చేతబూని వందలాది మంది ర్యాలీలో పాల్గొన్నారు.