చెన్నై: ముఖ్యమంత్రి జయలలితను అవమానించడాన్ని ఖండిస్తూ సోమవారం నగరంలోని శ్రీలంక దౌత్య కార్యాలయం ముందు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు, దర్శక నిర్మాతలు పరిశ్రమకు చెందిన వారంతా ఆందోళన చేపట్టారు. తమిళుల మనోభావాలకు భంగం కలిగేలా ప్రవర్తిస్తూ ముఖ్యమంత్రిని కించపరిచే చర్యలకు పాల్పడుతున్న శ్రీలంక ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న శ్రీలంక దౌత్యకార్యాలయం తమిళనాడులో అవసరం లేదని చిత్రపరిశ్రమ డిమాండ్ చేసింది. వెంటనే ఆ దౌత్య కార్యాలయాన్ని వెంటనే తొలగించాలని కోరుతూ ఆ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టింది..
ముఖ్యమంత్రి జయలలిత తమిళ మత్స్యకారులపై శ్రీలంక ప్రభుత్వం చేస్తున్న దాడులను అడ్డుకోవాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి పలుమార్లు లేఖలు రాశారు. దీన్ని అవహేళన చేసే విధంగా శ్రీలంక ప్రభుత్వ సైనిక వెబ్‌సైట్ కార్టూన్లు పొందుపరిచారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ కార్టూన్లు తొలగించే విధంగా చర్యలు తీసుకుంది. ఇందుకు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే ప్రభుత్వం క్షమాపణలు కూడా చెప్పింది. అయినా తమిళ సంఘాల ఆగ్రహం చల్లారలేదు. ఈ నేపథ్యంలో తమిళ చిత్ర పరిశ్రమ కూడా ఆందోళనకు దిగింది. ఈ సందర్భంగా తమిళనాడు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్, కార్యదర్శి ఆర్‌కె సెల్వమణి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.