టికెట్టు రెట్టింపు | Jayalalitha Demands Roll Back in Rail Fare Hike | Sakshi
Sakshi News home page

టికెట్టు రెట్టింపు

Published Sat, Jun 21 2014 11:47 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

Jayalalitha Demands Roll Back in Rail Fare Hike

 సాక్షి, చెన్నై :  రాజధాని నగరం చెన్నై నుంచి నిత్యం దక్షిణాది జిల్లాలకు, పక్క రాష్ట్రాలు ఆంధ్రా, కర్ణాటకలకు పెద్ద ఎత్తున జనం రాకపోకలు సాగిస్తుంటారు. కోయంబేడు నుంచి ప్రభుత్వ బస్సులు ఓ వైపు, పక్కనే ఉన్న ఆమ్నీ బస్టాండ్ నుంచి ప్రైవేటు బస్సులు మరో వైపు ఉరకలు తీస్తూ ఉంటాయి. వీటిల్లో చార్జీలు ఆయా బస్సుల స్థాయికి,   వసతులకు తగ్గట్టుగానే ఉంటారుు.  దక్షిణాదిలోని సేలం, ఈరోడ్, కోయంబత్తూరు, తిరుచ్చి, మదురై, దిండుగల్, తిరునల్వేలి, కన్యాకుమారి, రామనాథపురం, తూత్తుకుడి జిల్లాలకు ప్రతి రోజూ రైలు సేవలు సాగుతున్నాయి. చార్జీల వడ్డన : రైళ్ల సేవల మీద ఆధారపడిన పేద, మధ్య తరగతి వర్గాల నెత్తిన చార్జీలను వడ్డించారు. దీంతో వారు గగ్గో లు పెడుతున్నారు. యూపీఏ బాటలోనే ఎన్డీఏ కూడా పయనిస్తున్నట్టు విమర్శిస్తున్నారు. పేద, మధ్య తరగతి వర్గాల్ని దృష్టి లో ఉంచుకుని చార్జీలను పునఃసమీక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. దక్షిణాది జిల్లాలకు వెళ్లే అత్యధిక రైళ్లల్లో స్లీపర్ క్లాస్‌లను ఉపయోగించే వాళ్లే ఉన్నారని, ఇప్పుడు చార్జీలు పెంచడం భారంగానే ఉంటుందని ఓ ప్రయాణికుడు వాపోయాడు.
 
 నేతల వ్యతిరేకత : చార్జీల వడ్డనను అన్ని రాజకీయ పక్షాలు వ్యతిరేకించాయి.చార్జీల పెంపును ఉప సంహరించుకోవాలంటూ సీఎం జయలలిత, ప్రధాని నరేంద్ర మోడీకి లేఖాస్త్రం సంధించారు.  డీఎంకే అధినేత ఎం కరుణానిధి చార్జీల పెంపును విమర్శించారు. అధికారంలోకి వచ్చీ రాగానే, ప్రజల నడ్డి విరిచే భారాన్ని మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. డీఎండీకే అధినేత విజయకాంత్, ఎండీఎంకే అధినేత వైగో, పీఎంకే అధినేత రాందాసులు చార్జీల పెంపును వ్యతిరేకించారు. పునః పరిశీలన చేయాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞాన దేశికన్, కేంద్ర మాజీ మంత్రి జికే వాసన్‌లు తమప్రకటనలో కేంద్రం తీరును తప్పుబట్టారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి టీ పాండియన్, ఎస్‌ఎంకే నేత శరత్‌కుమార్, వీసీకే నేత తిరుమావళవన్ తమ ప్రకటనల్లో యూపీఏ బాటలోనే ఎన్డీఏ పయనిస్తున్నదన్న విషయం ఈ వడ్డనతో స్పష్టం అవుతోందని విమర్శించారు.
 
 ఈఎంయూ చార్జీలు : చెన్నైలో లక్షలాది మందికి ప్రయాణమార్గంగా ఉన్న ఎలక్ట్రిక్ రైళ్ల చార్జీలు పెరగనున్నాయి. బీచ్ - తాంబరం - చెంగల్పట్టు, బీచ్ - సెంట్రల్ - తిరువళ్లూరు- అరక్కోణం- తిరుత్తణి, సెంట్రల్ - గుమ్మిడి పూండి - సూళూరు పేట మార్గాల్లో నిత్యం ఈ రైళ్లు సేవలు అందిస్తున్నాయి.   ఇవీ చార్జీలు : పెరిగిన చార్జీలతో ఇది వరకు చెన్నై నుంచి దక్షిణాది జిల్లా గుండా వెళ్లే రైళ్లలో ఉన్న చార్జీల కంటే అధికంగా రూ.40 మేరకు పెరిగాయి. స్లీపర్ క్లాసులో ఈ మేరకు పెరిగిన పక్షంలో, ఇక ఫస్ట్ , సెకండ్, థర్డ్ ఏసీల్లో సరాసరిగా  దూరాన్ని బట్టి వంద నుంచి రూ.మూడు వందలకు వరకు పెరగనున్నాయి. చెన్నై నుంచి దక్షిణాది జిల్లాలకు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే రైళ్లల్లో స్లీపర్ క్లాస్ చార్జీల వివరాలు పై పట్టికలో పేర్కొన్న విధంగా వసూలు చేయనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement