rail fare hike
-
తక్షణమే వెనక్కి తీసుకోవాలి
న్యూఢిల్లీ: రైలు చార్జీల పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అర్వింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఈ విషయమై బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ గ్యాస్ ధరల పెంపు యోచనను పునరాలోచించాలని కోరారు. అధికారంలోకి రాగానే ధరలను తగ్గిస్తామంటూ నరేంద్ర మోడీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని, అవినీతిని నిర్మూలిస్తామని అన్నారని, అయితే గడచిన నెల రోజుల వ్యవధిలో నిత్యావసరాల ధరలు పెరిగాయని, ఇది ప్రజలను తీవ్ర ఆగ్రహానికి లోనుచేస్తోందని ఆయన విమర్శించారు. అవినీతిని నిర్మూలించడం పక్కనబెట్టి ధరల పెంపు దిశగా అడుగులు వేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. అవినీతిని నిర్మూలించకపోతే ధరల తగ్గింపు ఎంతమాత్రం సాధ్యం కాదన్నారు. రైలు చార్జీలను పెంచడానికి బదులు ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అవినీతి నిర్మూలనకు విధిగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ప్రభుత్వం ధరల పెంపును సమర్థించుకుంటోందంటూ విమర్శిం చారు. రైలు చార్జీల పెంపును కనీసం ఆరు నెల లపాటు వాయిదా వేస్తే బాగుంటుందని ఆయన హితవు పలికారు. గ్యాస్ ధరల పెంపు వల్ల అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ సంస్థ లబ్ధి పొందుతుం దని, అంతేకాకుండా ఇందువల్ల ప్రజలపై మరింత భారం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఇలా మాట తప్పడమేమిటని ఆయన ప్రశ్నించారు. తక్షణమే పెంచిన రైలు చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కోర్టులు అడిగితే తప్ప ఖాళీ చేయను తన నూతన నివాసంపై తలెత్తిన వివాదం గురించి తెలియదని ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. న్యాయపరమైన అంశాలన్నీ ఓ కొలిక్కి వచ్చేదాకా మారే ప్రసక్తే లేదన్నారు. ‘ యజమానిని (నరేన్జైన్ ) కలిసి ఇంటికి కిరాయికి తీసుకున్నా. వారి మధ్య తలెత్తిన వివాదాన్ని నరేన్జైన్ సోదరులిరువురూ పరిష్కరించుకుంటారు. ఆ ఇంట్లో ఉండొద్దని కోర్టు అంటే తప్ప ఖాళీ చేయను’ అని అన్నారు. ఇదిలాఉంచితే అద్దె ఇంటి వివాదమై ఢిల్లీ హైకోర్టులో బుధవారం వీరేంద్ర జైన్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు. -
చార్జీలకు వ్యతిరేకంగా రైల్‌రోకో
న్యూఢిల్లీ: పెంచిన రైలు చార్జీలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) ఆధ్వర్యంలో మంగళవారం రైల్ రోకో నిర్వహించారు. డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ నాయకత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు నైరుతి ఢిల్లీలోని పాలం రైల్వే స్టేషన్లో కొద్దిసేపు రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. పెంచిన రైలు చార్జీలను వెంటనే ఉపసంహరించాలని ఢిల్లీ కాంగ్రెస్ ప్రతినిధి ముఖేశ్ శర్మ డిమాండ్ చేశారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు రైల్వే మంత్రి సదానంద గౌడ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పెరిగిన రైల్వే చార్జీలు బుధవారం నుంచి అమలులోకి రానున్నాయి. -
మోడీ సర్కారుపై శివసేన ఫైర్
ముంబై: రైల్వే చార్జీల పెంపుపై విపక్షాల దాడులు ఎదుర్కొంటున్న ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం తాజాగా స్వపక్షం నుంచి విమర్శల బారిన పడింది. ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న శివసేన...రైల్వే చార్జీల పెంపును తప్పుబట్టింది. చార్జీల పెంపుతో సామాన్యుడిపై మోయలేని భారం పడిందని విమర్శించింది. రైల్వే మంత్రి సదానంద గౌడ మొదటిసారే భారీగా చార్జీలు పెంచారని శివసేన పత్రిక 'సామ్నా' సంపాదకీయంలో పేర్కొంది. అధిక ద్రవ్యోల్బణం నుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వం కాపాడుతుందని ప్రజలు భావించారని, రైల్వే చార్జీల పెంపుతో ఈ నమ్మకం వమ్మయ్యే ప్రమాదముందని అభిప్రాయపడింది. -
ఈ ఉత్తర్వులు యూపీఏ ప్రభుత్వం ఇచ్చినవే!
-
ఏ పక్షంలో ఉంటే ఆ పాట పాడడం మామూలైంది!
-
టికెట్టు రెట్టింపు
సాక్షి, చెన్నై : రాజధాని నగరం చెన్నై నుంచి నిత్యం దక్షిణాది జిల్లాలకు, పక్క రాష్ట్రాలు ఆంధ్రా, కర్ణాటకలకు పెద్ద ఎత్తున జనం రాకపోకలు సాగిస్తుంటారు. కోయంబేడు నుంచి ప్రభుత్వ బస్సులు ఓ వైపు, పక్కనే ఉన్న ఆమ్నీ బస్టాండ్ నుంచి ప్రైవేటు బస్సులు మరో వైపు ఉరకలు తీస్తూ ఉంటాయి. వీటిల్లో చార్జీలు ఆయా బస్సుల స్థాయికి, వసతులకు తగ్గట్టుగానే ఉంటారుు. దక్షిణాదిలోని సేలం, ఈరోడ్, కోయంబత్తూరు, తిరుచ్చి, మదురై, దిండుగల్, తిరునల్వేలి, కన్యాకుమారి, రామనాథపురం, తూత్తుకుడి జిల్లాలకు ప్రతి రోజూ రైలు సేవలు సాగుతున్నాయి. చార్జీల వడ్డన : రైళ్ల సేవల మీద ఆధారపడిన పేద, మధ్య తరగతి వర్గాల నెత్తిన చార్జీలను వడ్డించారు. దీంతో వారు గగ్గో లు పెడుతున్నారు. యూపీఏ బాటలోనే ఎన్డీఏ కూడా పయనిస్తున్నట్టు విమర్శిస్తున్నారు. పేద, మధ్య తరగతి వర్గాల్ని దృష్టి లో ఉంచుకుని చార్జీలను పునఃసమీక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. దక్షిణాది జిల్లాలకు వెళ్లే అత్యధిక రైళ్లల్లో స్లీపర్ క్లాస్‌లను ఉపయోగించే వాళ్లే ఉన్నారని, ఇప్పుడు చార్జీలు పెంచడం భారంగానే ఉంటుందని ఓ ప్రయాణికుడు వాపోయాడు. నేతల వ్యతిరేకత : చార్జీల వడ్డనను అన్ని రాజకీయ పక్షాలు వ్యతిరేకించాయి.చార్జీల పెంపును ఉప సంహరించుకోవాలంటూ సీఎం జయలలిత, ప్రధాని నరేంద్ర మోడీకి లేఖాస్త్రం సంధించారు. డీఎంకే అధినేత ఎం కరుణానిధి చార్జీల పెంపును విమర్శించారు. అధికారంలోకి వచ్చీ రాగానే, ప్రజల నడ్డి విరిచే భారాన్ని మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. డీఎండీకే అధినేత విజయకాంత్, ఎండీఎంకే అధినేత వైగో, పీఎంకే అధినేత రాందాసులు చార్జీల పెంపును వ్యతిరేకించారు. పునః పరిశీలన చేయాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞాన దేశికన్, కేంద్ర మాజీ మంత్రి జికే వాసన్లు తమప్రకటనలో కేంద్రం తీరును తప్పుబట్టారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి టీ పాండియన్, ఎస్ఎంకే నేత శరత్‌కుమార్, వీసీకే నేత తిరుమావళవన్ తమ ప్రకటనల్లో యూపీఏ బాటలోనే ఎన్డీఏ పయనిస్తున్నదన్న విషయం ఈ వడ్డనతో స్పష్టం అవుతోందని విమర్శించారు. ఈఎంయూ చార్జీలు : చెన్నైలో లక్షలాది మందికి ప్రయాణమార్గంగా ఉన్న ఎలక్ట్రిక్ రైళ్ల చార్జీలు పెరగనున్నాయి. బీచ్ - తాంబరం - చెంగల్పట్టు, బీచ్ - సెంట్రల్ - తిరువళ్లూరు- అరక్కోణం- తిరుత్తణి, సెంట్రల్ - గుమ్మిడి పూండి - సూళూరు పేట మార్గాల్లో నిత్యం ఈ రైళ్లు సేవలు అందిస్తున్నాయి. ఇవీ చార్జీలు : పెరిగిన చార్జీలతో ఇది వరకు చెన్నై నుంచి దక్షిణాది జిల్లా గుండా వెళ్లే రైళ్లలో ఉన్న చార్జీల కంటే అధికంగా రూ.40 మేరకు పెరిగాయి. స్లీపర్ క్లాసులో ఈ మేరకు పెరిగిన పక్షంలో, ఇక ఫస్ట్ , సెకండ్, థర్డ్ ఏసీల్లో సరాసరిగా దూరాన్ని బట్టి వంద నుంచి రూ.మూడు వందలకు వరకు పెరగనున్నాయి. చెన్నై నుంచి దక్షిణాది జిల్లాలకు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే రైళ్లల్లో స్లీపర్ క్లాస్ చార్జీల వివరాలు పై పట్టికలో పేర్కొన్న విధంగా వసూలు చేయనున్నారు. -
రైలు చార్జీల పెంపు విపక్షాల నిరసన
సాక్షి, న్యూఢిల్లీ:రైలు చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ విపక్షాలు శనివారం నగరంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. విద్యుత్ కోతలు, నీటి సరఫరా సమస్యలకు నిరసనగా గతకొద్ది రోజులుగా నగరంలో ప్రదర్శనలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు శనివారం జనక్‌పురిలో రైలు చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రభు త్వ దిష్టిబొమ్మను దహనం చేయడమే కాకుండా బారికేడ్లు ఛేదించుకుని ముందుకెళ్లేందుకు యత్ని ంచిన కాంగ్రెస్ కార్యకర్తలను నియంత్రించడం కోసం పోలీసులు వారిపై నీటి ఫిరంగులను ప్రయోగించారు. ఈ సందర్భంగా డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ లవ్లీ మాట్లాడుతూ ధరలను నియంత్రిస్తామంటూ అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందన్నారు. బడ్జెట్ సమావేశాలు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నాయని, ఇంతలోనే రైలు చార్జీలను ఎలా పెంచుతారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ప్రజలు మంచి రోజుల గురించి మాట్లాడేవారని, అయితే ఇప్పుడు చేదు మందుల గురించి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తానన్నారని, అయితే అలా చేసే సూచనలు కనిపించడం లేదని లవ్లీ అన్నారు. మోడీ ప్రభుత్వం ఇలాంటి చర్యలనే తీసుకున్నట్లయితే ప్రజలు శిక్షిస్తారని ఆయన ెహ చ్చరించారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమవుతోందన్నారు. ప్రజలకు భారంగా మారిన రైలు చార్జీల పెంపును వెనక్కి తీసుకోవాలని లవ్లీ డిమాండ్ చేశారు. సరుకు రవాణా చార్జీలను 6.5 శాతం పెంచడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుందన్నారు. చార్జీల పెంపును ప్రభుత్వం ఉపసంహరించనట్లయితే రైల్‌రోకో కార్యక్రమం చేపడతామని ఆయన హెచ్చరించారు. యూపీఏ సర్కారు బడ్జెట్ సమావేశాలకు ముందు రైలు చార్జీలను పెంచినపుడు దానిని విమర్శిస్తూ ట్వీట్ చేసిన నరేంద్ర మోడీ... ఇప్పుడు బడ్జెట్ సమావేశాలకు ముందు రైలు చార్జీలను ఎలా పెంచారని అజయ్ మాకెన్ ప్రశ్నించారు. ఇదిలాఉంచితే రైలు చార్జీల పెంపును నిరసిస్తూ ఎన్ఎస్యూఐ కార్యకర్తలు రైల్ భవన్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. సీపీఎం ఢిల్లీ విభాగం కూడా రైలు చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ రైల్ భవన్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఎన్నికలకు ముందు ధరల పెంపును విమర్శించి, ధరలు నియంత్రిస్తామని చెప్పడంద్వారా ప్రజల మద్దతు చూరగొని ఎన్డీయే అధికారంలోకి వచ్చిందని, అయితే ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం కూడా ధరలను పెంచుతోందని సీపీఎం ఢిల్లీ శాఖ సభ్యుడు అనురాగ్‌శర్మ ఆరోపించారు. కాగా సీపీఎం, ఎన్ఎస్యూఐ నిరసనప్రదర్శనల కారణంగా శనివారం ఉదయం మధ్య ఢిల్లీలో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు.