ద్రోహులను తరిమేద్దాం
ఒక్క చాన్స్ ఇవ్వండి రాష్ట్రం కాదు,
దేశ స్వరూపాన్ని మార్చేస్తా
ఎన్నికల ప్రచారంలో జయలలిత
ఒక్క చాన్స్ ఇవ్వండి
రాష్ట్రం కాదు, దేశ స్వరూపాన్ని మార్చేస్తా
ఎన్నికల ప్రచారంలో జయలలిత
సాక్షి, చెన్నై:
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో అన్నాడీఎంకే దూసుకె ళుతోంది. అందరి కన్నా ముందుగా అభ్యర్థులను ప్రకటించిన జయలలిత, వారికి మద్దతుగా ఓట్ల వేటలో పడ్డారు. తొలి విడతగా నెల రోజుల పాటు రాష్ట్రంలోని 13 నియోజకవర్గాల్లో పర్యటించేందుకు నిర్ణయించారు. ఆ మేరకు కాంచీపురం జిల్లా వేదికగా తన ఎన్నికల ప్రచారానికి ఆమె శ్రీకారం చుట్టారు.
శ్రీకారం: మధ్యాహ్నం పొయేస్ గార్డెన్ నుంచి కాంచీపురానికి బయలుదేరిన జయలలితను అన్నాడీఎంకే మహిళా విభాగం నేతలు పూర్ణ కుంభాలను చేత బట్టి సాగనంపారు. అడయార్‌లోని ఐఎన్‌ఎస్ కేంద్ర హెలిపాడ్‌కు చేరుకున్న జయలలితకు అన్నాడీఎంకే నాయకులు మధుసూదనన్, బన్రూటి రామచంద్రన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షీలా బాలకృష్ణన్, డీజీపీ రామానుజం స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఎన్నికల ప్రచారానికి జయలలిత బయలు దేరారు. కాంచీపురం నత్తం పేటలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు జయలలిత చేరుకోగానే, మంత్రులు పన్నీరు సెల్వం, చిన్నయ్య, ఎంపీ మైత్రేయన్, ఎమ్మెల్యేలు వాలాజాబాద్ గణేషన్, సోమ సుందరం, కాంచీపురం అభ్యర్థి మరగదం కుమర వేల్ స్వాగతించారు. సాంస్కృతిక సంబరాల నడుమ ముఖ్యమంత్రి జయలలితకు అడుగడుగున అభిమానులు నీరాజనాలు పలికారు.
తొక్కేద్దాం: తేరడిలో అశేష జనవాహని నడుమ తమ అభ్యర్థిని మరగదంను పరిచయం చేస్తూ ఎన్నికల ప్రచారానికి జయలలిత శ్రీకారం చుట్టారు. తన ప్రసంగంలో యూపీఏ సర్కారు, రాష్ట్రంలోని డీఎంకేను టార్గెట్ చేసి విరుచుకు పడ్డారు. కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టడం లక్ష్యంగా తన ప్రసంగాన్ని కొనసాగించారు. కావేరి, ఈలం తమిళులు, జాలర్లపై దాడుల వ్యవహారంలో యూపీఏ సర్కారు తమిళులకు తీవ్ర ద్రోహం చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ హక్కులను హరించడంతో పాటుగా నిధులు, కిరోసిన్, విద్యుత్ కేటారుుంపుల్లో కోతలు విధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని యూపీఏకు ఇన్నాళ్లు వత్తాసు పలుకుతూ వచ్చి, తాజాగా కొత్త నాటకాన్ని రచిస్తున్న డీఎంకేకు పుట్టగతులు లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. తమిళ ద్రోహుల్ని ఓటు అనే ఆయుధం ద్వారా అణగదొక్కేయాలని విజ్ఞప్తి చేశారు.
కడపు కొట్టారు: రాష్ట్రంలోని అన్నదాతల కడుపు మాడ్చేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నించిందని మండి పడ్డారు. తాము తీసుకున్న నిర్ణయాలు, హఠాత్ చర్యలతో అన్నదాత కొంత మేరకు ఊరట పొందగలిగాడని వివరించారు. అన్ని రకాలుగా తమిళులను సర్వనాశనం చేయడం లక్ష్యంగా కంకణం కట్టుకున్న కాంగ్రెస్‌ను తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఆదర్శం: రాష్ట్ర పోలీసు యంత్రాంగం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖను నిర్వీర్యం చేయడంతో అరాచక శక్తులు దేశంలో పేట్రేగుతున్నాయని వివరించారు. భారత్‌ను పక్కదేశాల కుట్రలు కుతంత్రాల నుంచి రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశాన్ని రక్షించుకోవాలంటే, అన్నాడీఎంకే నేతృత్వంలోని బలమైన కూటమి కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టాల్సి ఉందని సూచించారు. ప్రపంచ దేశాలు భారత్‌ను, తమిళనాడును ఆదర్శంగా తీసుకునే రీతిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా హిత సేవలకు తాము సిద్ధం అని, అదే సమయంలో ఓటు అనే ఆయుధంతో అందుకు తగ్గ అధికారాలను తమకు అప్పగిస్తారా? అంటూ ఓటర్లను ప్రశ్నిస్తూ, వారి నుంచి సమాధానం రాబట్టారు.
అవినీతి పరులకు శిక్ష: కేంద్రంలో అధికార మార్పు జరిగిన తక్షణం కాంగ్రెస్ హయూంలో జరిగిన అవినీతి కుంభకోణాలన్నింటినీ వెలికి తీసి, న్యాయ స్థానాల ద్వారా బాధ్యులను శిక్షించి తీరుతామని ప్రకటించారు. విదేశాల్లో మగ్గుతున్న నల్లధనాన్ని దేశానికి తెప్పించడంతో పాటుగా రానున్న కాలంలో విదేశీ సంస్థలతో కాకుండా, ఆయా దేశ ప్రభుత్వాలతో కలసి ఒప్పందాలు కుదుర్చుకునే ఏర్పాట్లు చేస్తామన్నారు. దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ర్టంగా తమిళనాడును తొలి జాబితాలోకి చేరుస్తామని, అన్ని పథకాలు ఫలాలు ఇక్కడి ప్రజలకు అందేలా చేస్తానని, తమిళాన్ని జాతీయ అధికార భాషగా ప్రకటించడంతో పాటుగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో వాదనలు తమిళంలోనే సాగే రీతిలో చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయాల్ని మార్పు చేసి, ఏడాదిపాటు ధర స్థిరంగా ఉండే రీతిలో చర్యలు తీసుకుంటానన్నారు. ఆదాయ పన్న పరిమితి ఐదు లక్షలకు పెంచుతానని హామీలు గుప్పించారు. దేశ చరిత్రలో తమిళనాడుకు ప్రత్యేక గుర్తింపు దక్కే రీతిలో ఒక్క అవకాశం ఇవ్వాలని, ఓటు అనే ఆయుధాన్ని సద్వినియోగం చేసుకుని కాంగ్రెస్, డీఎంకేలను తరిమి కొట్టడంతో పాటుగా తమ అభ్యర్థుల్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.