చెన్నె: జైలు శిక్ష అనుభవించి వచ్చిన శశికళ అన్నాడీఎంకే పార్టీ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే ఆ పార్టీ తనదేనని.. పార్టీ గుర్తుపై ఇప్పటికే కేసు వేసిన విషయం తెలిసిందే. జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి అన్నాడీఎంకే గుర్తు రెండాకులు వినియోగిస్తోంది. తాజాగా బుధవారం జయలలిత జయంతి సందర్భంగా శశికళ తనను తాను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ప్రకటించుకుంది. ఈ మేరకు అదే హోదాతో ప్రకటన విడుదల కావడం విశేషం.
కాగా తమిళనాడులో బుధవారం జయలలిత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలందరి అమ్మగా పేరుపొందిన జయలలితను అన్ని పార్టీల నాయకులు స్మరించుకున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలంతా జయలలితకు ఘన నివాళులర్పించారు. అయితే పోయెస్ గార్డెన్‌లో శశికళ తన స్నేహితురాలు జయలలితకు ఘన నివాళులర్పించింది. టీటీవీ దినకరన్‌తో పాటు తన అనుచరులు, మద్దతుదారులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నాడీఎంకే పార్టీ తనదేనని శశికళ మరోసారి పునరుద్ఘాటించారు. అమ్మ అభిమానులంతా ఏకం కావాలని శశికళ పిలుపునిచ్చారు. త్వరలోనే అందరినీ కలుసుకుంటానని ప్రకటించారు. తమకు ప్రధాన శత్రువు డీఎంకే అని తెలిపారు.
ఈ క్రమంలోనే శశికళ నివాసానికి సినీ ప్రముఖులు వరుస కట్టారు. దర్శకుడు భారతీరాజా, నటులు రాధికా శరత్‌కుమార్ వచ్చారు. ఈ సందర్భంగా శశికళను కలిసి కొద్దిసేపు మాట్లాడారు. వారు శశికళను కలవడం తమిళనాడులో ఆసక్తికరంగా మారింది. అయితే సమావేశంలో రాజకీయంగా మాట్లాడినట్టు వార్తలు వస్తున్నా.. దీనిపై వారు స్పష్టత ఇచ్చారు. శశికళ అనారోగ్యానికి గురవడం.. జైలు నుంచి రావడంతో ఆమెను పరామర్శించేందుకే వచ్చామని రాధికా శరత్‌కుమార్ తెలిపారు. ఆమె యోగక్షేమాలు తెలుసుకునేందుకే వచ్చినట్లు వివరణ ఇచ్చారు. అయితే రాధికా శరత్ కుమార్ సమత్తువ మక్కల్ కట్చి (ఎస్‌ఎంకే) పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment