డీపీఏ కూటమికి మద్దతుగా ప్రచారం చేసేందుకు డీఎంకే అధినేత ఎం కరుణానిధి గారాల పట్టి కనిమొళి, మహిళానేత, సినీ నటి ఖుష్బూ రెడీ అయ్యారు. ఏప్రిల్ మొదటి వారంలో ఖుష్బూ, ఐదో తేదీ నుంచి కనిమొళి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఓపెన్ టాప్ వాహనాలు వీరి కోసం సిద్ధం అవుతున్నారుు. సీఎం జయలిలత వాగ్దాటిని ఢీ కొట్టేందుకు ఈ ఇద్దరు మహిళలు సిద్ధమయ్యారు.
సాక్షి, చెన్నై: వీసీకే, ఎంఎంకే, ఐయూఎంఎల్, పీటీలతో కలసి డీఎంకే నేతృత్వంలో డెమాక్రటిక్ ప్రోగ్రెసివ్ అలయన్(డీపీఏ) ఆవిర్భవించిన విషయం తెలిసిందే. పదుచ్చేరితో పాటుగా రాష్ర్టంలోని 40 స్థానాల బరిలో ఈ కూటమి అభ్యర్థులు ఉన్నారు. వీరికి మద్దతుగా ప్రచార బాటలో డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ నిమగ్నమయ్యారు. తాను సైతం అంటూ పార్టీ అధినేత ఎం కరుణానిధి ప్రచారానికి సిద్ధం అయ్యారు. అన్నాడీఎంకే అధినేత్రి సీఎం జయలలిత ఒంటి చేత్తో తమ అభ్యర్థులను గెలిపించుకోవడం లక్ష్యంగా ఉరకలు తీస్తుంటే, ఆమె వాగ్దాటిని ఎదుర్కొనే విధంగా మహిళా నాయకుల్ని ప్రచార కదన రంగంలోకి దించేందుకు డీఎంకే సిద్ధం అయింది.
కని, ఖుష్బూ రెడీ
జయలలిత తమ మీద విమర్శల వర్షం కురిపిస్తుండటంతో దాన్ని తమ వాగ్దాటితో తిప్పికొట్టే విధంగా ప్రచారంలోకి ఎంపీ కనిమొళి, నటి ఖుష్బూలు రంగంలోకి దిగనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థులకు మద్దతుగా సినీ గ్లామర్ ఖుష్బూను రంగంలోకి దించిన విషయం తెలిసిందే. వాక్ చాతుర్యంతో, చక్కటి ప్రసంగంతో ఓటర్లను ఆమె ఆకర్షించారు. తాజాగా జరగనున్న ఎన్నికల్లో ఆమె సేవల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగించుకునేందుకు డీఎంకే నిర్ణయించింది.
ఇది వరకు వేదికలపై నుంచి ప్రసంగాలు ఇచ్చిన కనిమొళి, ఈ పర్యాయం రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ టాప్ వాహనంలో పర్యటించేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రధానంగా జయలలిత ప్రసంగాల్ని టార్గెట్ చేసి, ఆమె వ్యాఖల్ని దీటుగా ఎదుర్కొనే రీతిలో ఈ ఇద్దరు మహిళు తర్ఫీదు పొందుతున్నారని సమాచారం. కనిమొళికి చక్కటి ప్రసంగాన్ని ఇవ్వగల సత్తా ఉంది. ఖుష్బూ అనర్గళంగా ప్రసంగించగలరు. అయితే, కొన్ని అంశాల్ని ఎత్తి చూపాల్సిన సమయంలో స్క్రిప్ట్ తప్పని సరి.
పర్యటన వివరాలు
కనిమొళి పర్యటన వివరాలు సిద్ధం చేసే పనిలో అన్నా అరివాళయం వర్గాలు ఉన్నాయి. ఆమె ఏప్రిల్ 5 తేదీ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. స్టాలిన్ కన్యాకుమారి నుంచి రాష్ర్ట వ్యాప్తంగా పర్యటిస్తూ వస్తున్న దృష్ట్యా, చెన్నై నుంచి ఆమె ప్రచారం ఆరంభించే రీతిలో పర్యటన వివరాల్ని సిద్ధం చేస్తున్నారు. లేని పక్షంలో కనిమొళి మద్దతుదారులు అత్యధికంగా ఉండే కడలూరు, చిదంబరం నియోజకవర్గాల నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టే అవకాశాలు ఉన్నాయని అరివాలయం వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే, ఖుష్బూ పర్యటన వివరాలు సైతం సిద్ధం చేస్తున్నారు.
ఏప్రిల్ మొదటి వారం నుంచి పార్టీకి సేవలను అందించేందుకు ఖుష్బూ సిద్ధం అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈమె పర్యటన సాగనుంది. వీరు రోడ్ షోలలో కూడా పాల్గొని ప్రచారం చేయనున్నారు. ప్రధాన కూడళ్లల్లో ప్రసంగాలు, అభ్యర్థులను ఓటర్లకు పరిచయం చేసే కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వీరి ప్రచారం కోసం అన్ని వసతులతో కూడిన రెండు ఓపెన్ టాప్ వాహనాలు సిద్ధం అవుతున్నాయి.
జయను ఎదుర్కోవడానికే..
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సుడిగాలి ప్రచారానికి అనూహ్యస్పందన రావడంతోనే ఈ ఇద్దరినీ రంగంలోకి దించేందుకు కరుణానిధి నిర్ణయించినట్టు అరివాళయం వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో పంచముఖ సమరం నెలకొనడంతో ఓట్లు చీలడం ఖాయం. ఈ దృష్ట్యా, తమ అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా ప్రచారం బరిలోకి అందరినీ దించే పనిలో కరుణానిధి ఉన్నారు.
మేమూ రెఢీ!
Published Thu, Mar 20 2014 3:39 AM | Last Updated on Sat, Sep 2 2017 4:55 AM
Advertisement
Advertisement