ఉప్పు కొను.... 'అమ్మా' అను
ఉప్పు తిన్న విశ్వాసం చాలా గట్టిదంటారు. 'మీ ఉప్పు తిన్నాను. ఇక మీ వాడిని' అని అనడం చాలా పాత మాట. తమిళ నాడు ముఖ్యమంత్రి ఉప్పు తినిపించి మరీ ఓటర్ల విశ్వాసం పొందాలనుకుంటున్నారు. అందుకే ఆమె బుధవారం నుంచి తమిళనాట ప్రజలకు చవక ధరకు ఉప్పును అందించబోతున్నారు. ఈ ఉప్పుకు 'అమ్మ ఉప్పు' అని పేరు పెట్టారామె.
ఇప్పటికే అమ్మ ఫుడ్ అయిదు రూపాయలకే ఫుల్ మీల్ ను ప్రజలకు అందిస్తోంది. అమ్మ జలం బాటిల్డ్ వాటర్ రూపంలో పది రూపాయలకే దొరుకుతోంది. ఇప్పుడు వీటికి అమ్మ ఉప్పు జత కలిసింది. తమిళ నాడు సాల్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ డబుల్ ఫోర్టిఫైడ్, రిఫైన్డ్ ఫ్రీ ఫ్టో అయోడైజ్డ్, లో సోడియం అన్న మూడు వెరైటీల్లో దొరుకుతుంది. తమిళ నాట ముఖ్యమంత్రి జయలలితను అమ్మ అంటారు. కాబట్టి ఈ ఉప్పు ప్యాకెట్ ఎవరు కొనుక్కుంటే వారి వంటింటి దాకా జయలలిత ప్రవేశించినట్టే. ఓటర్లు ఆమెను ఒక సారి తలచుకున్నట్టే. ఇలా ఈ ఉప్పు ప్యాకెట్ తో కార్పొరేషన్ కు స్వామికార్యం, అధికార అన్నా డీఎంకెకి స్వకార్యం సిద్ధిస్తున్నాయి.