స్టాలిన్‌తో ఎలాంటి విబేధాలు లేవు
సాక్షి, చెన్నై: డీఎంకే అభ్యర్థులకు మద్దతుగా నటి ఖుష్బు ప్రచారానికి సిద్ధం అయ్యారు. ఏప్రిల్ ఐదో తేదీ నుంచి నిర్విరామంగా 17 రోజుల పాటు ఆమె ప్రచారం సాగ నుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం ఆమె ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్నికల ప్రచారం కోసం తాను సిద్ధం అయ్యానని, అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టే విధంగా తన ప్రచార ప్రసంగాలు ఉంటాయని వివరించారు. అయితే, ప్రచారంలో ఎక్కడా డీఎండీకే అధినేత విజయకాంత్, సమత్తువ మక్కల్ కట్చి నేత శరత్‌కుమార్‌ను విమర్శించనని ప్రకటించారు.
పార్టీ ముఖ్యం: తాను డీఎంకేలో కార్యకర్తను, నాయకురాలిని కావున తనకు పార్టీ ముఖ్యం అని స్పష్టం చేశారు. డీఎంకేకు అనుకూలంగానే తాను వ్యవహరిస్తుంటానని పేర్కొన్నారు. వదంతులను పట్టించుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. పుకార్లు పుట్టించే వాళ్లు పుట్టిస్తూనే ఉంటారని, వాటి గురించి ఆలోచించడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని వ్యంగ్యాస్త్రం సంధించారు. పార్టీ వర్గాలతో ఎలాంటి అభిప్రాయ బేధాలు తనకు లేదని స్పష్టం చేశారు. స్టాలిన్‌తో అసలు ఎలాంటి విబేధాలు లేవు అని, అంతా మీడియా సృష్టేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వేళ పార్టీలో తనకు ఇబ్బందులు కలిగి ఉంటే, ఎప్పుడో పార్టీని వీడేదాన్ని అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
పిల్లల కోసం : తన ఇద్దరు పిల్లల కోసం సినిమాలకు దూరంగా ఉన్నానని, వారితో ఎక్కువ సమయం గడపాలన్నదే తన అభిమతంగా పేర్కొన్నారు. పార్టీ కార్యక్రమాలు లేనప్పుడు పిల్లలతో సరదాగా గడుపుతానని, అంత మాత్రాన పార్టీకి దూరంగా ఉన్నట్టు కాదన్నారు. పార్టీ కోసం కష్టపడేందుకు తాను సిద్ధం అని, తాను సరైన అభ్యర్థి కాదు కాబట్టే, తనకు ఎన్నికల్లో సీటు ఇవ్వలేదని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
తన సేవల్ని ప్రచారానికి పార్టీ ఉపయోగించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఎన్నికల్లో డీఎంకే ప్రగతిని, అన్నాడీఎంకే వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రసంగాలు చేయనున్నానని వివరించారు. డీఎంకే చేసిందేమిటో, అన్నాడీఎంకే చేసిందేమిటో ప్రజలకు వివరించడమే కాదు, ఎవరైనా చర్చకు వచ్చినా తేల్చుకునేందుకు తాను సిద్ధం అని సవాల్ చేశారు.
వ్యక్తిగత విమర్శలు చేయను: ప్రచారంలో ఎవరి మీదా వ్యక్తిగత విమర్శలను తాను చేయనని స్పష్టం చేశారు. వ్యక్తిగత విమర్శలకు డీఎంకే దూరం అన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రధానంగా డీఎండీకే అధినేత విజయకాంత్, సమత్తువమక్కల్ కట్చినేత శరత్‌కుమార్ రాజకీయ పార్టీలకు అధినాయకులైనా, డీఎంకేకు ప్రత్యర్థులుగా ఉన్నా, వారిని మాత్రం విమర్శించనని స్పష్టం చేశారు. సినీ కుటుంబం నుంచి వచ్చిన వాళ్లతో తనకు ఎలాంటి వ్యక్తిగత విబేధాలు లేవు అని, తామంతా ఒకే కుటుంబం అని, అందువల్లే వారిని మాత్రం విమర్శించనని పేర్కొన్నారు.
నటి నగ్మా తన కన్నా సీనియర్ అని, ఆమెను ముద్దాడే విధంగా వ్యవహరించిన నాయకుడి చెంప పగలగొట్టి ఉండాలని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఆ స్థానంలో తాను ఉండి ఉంటే, ఆ వ్యక్తి చెంప పగిలి ఉండేదన్నారు. ఇలాంటి పరిస్థితి తమకు ఇంత వరకు ఎదురు కాలేదని, ఎదురు కాదు కూడా అని ధీమా వ్యక్తం చేశారు. డీఎంకేలో మహిళకు భద్రత, రక్షణ ఉందని చివరి ప్రశ్నకు సమాధానం ఇచ్చి ముగించారు.