Vijaya Kant
-
అసెంబ్లీ సమరం మరికొన్ని గంటల్లో...
సాక్షి, చెన్నై: అసెంబ్లీ సమరం మరికొన్ని గంటల్లో ఆరంభం కానుంది. ఇందు కోసం అన్ని రాజకీయ పక్షాలు సిద్ధమయ్యూరుు. ఫిబ్రవరిలో రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికలు అడ్డు రావడంతో శాఖల వారీగా నిధుల కేటాయింపులు, సమీక్షలు జరగలేదు. ఎన్నికలు ముగిసిన దృష్ట్యా, ప్రస్తుతం సమీక్షలు, కేటాయింపులపై చర్చకు ప్రభుత్వం సిద్ధం అయింది. గురువారం నుంచి అసెంబ్లీలో శాఖల వారీగా నిధుల కేటాయింపుపై చర్చ, ప్రశ్నోత్తరాలు, ప్రత్యేక ప్రకటనల పర్వం సాగనుంది. ఇందు కోసం అసెంబ్లీ ఆవరణలో సర్వం సిద్ధం చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో ఆంక్షలు విధించారు. సచివాలయం మార్గంలో భద్రతను పెంచారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఢీ కొట్టేందుకు ప్రతి పక్షాలు రెడీ అయ్యాయి. లండన్ వెళ్లిన డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ చెన్నైకు వచ్చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఢీ కొట్టే విధంగా అస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. ప్రధానంగా తమిళ జాలర్లపై దాడులు, కచ్చదీవుల వ్యవహారం, బహుళ అంతస్తు కుప్పకూలిన అంశాన్ని అస్త్రంగా చేసుకుని ప్రభుత్వాన్ని డీఎంకే వర్గాలు నిలదీసే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా మౌళివాకం ఘటనను తమకు అనుకూలంగా మలుచుకుని, సీబీఐ విచారణకు పట్టు బట్టే విధంగా తమ గళాన్ని అసెంబ్లీలో విన్పించేందుకు డీఎంకే సిద్ధం అయింది. ఇక, డీఎండీకే అధినేత విజయకాంత్ ఆస్పత్రిలో చేరిన దృష్ట్యా, ఈసారి అసెంబ్లీలో ఆయన అడుగు పెట్టేది అనుమానమే. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడంతో పాటుగా, డీఎంకే తరహాలో వాకౌట్ల పర్వానికి శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నాయి. మొత్తంమీద ఈ సమావేశాలు వాడి వేడిగాను సాగనున్నారుు. శాఖల వారీగా చర్చలో మంత్రుల ప్రసంగాలకు ప్రాధాన్యత అధికంగా ఉండడం మాత్రం ఖాయం. -
స్టాలిన్‌తో ఎలాంటి విబేధాలు లేవు
సాక్షి, చెన్నై: డీఎంకే అభ్యర్థులకు మద్దతుగా నటి ఖుష్బు ప్రచారానికి సిద్ధం అయ్యారు. ఏప్రిల్ ఐదో తేదీ నుంచి నిర్విరామంగా 17 రోజుల పాటు ఆమె ప్రచారం సాగ నుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం ఆమె ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్నికల ప్రచారం కోసం తాను సిద్ధం అయ్యానని, అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టే విధంగా తన ప్రచార ప్రసంగాలు ఉంటాయని వివరించారు. అయితే, ప్రచారంలో ఎక్కడా డీఎండీకే అధినేత విజయకాంత్, సమత్తువ మక్కల్ కట్చి నేత శరత్‌కుమార్‌ను విమర్శించనని ప్రకటించారు. పార్టీ ముఖ్యం: తాను డీఎంకేలో కార్యకర్తను, నాయకురాలిని కావున తనకు పార్టీ ముఖ్యం అని స్పష్టం చేశారు. డీఎంకేకు అనుకూలంగానే తాను వ్యవహరిస్తుంటానని పేర్కొన్నారు. వదంతులను పట్టించుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. పుకార్లు పుట్టించే వాళ్లు పుట్టిస్తూనే ఉంటారని, వాటి గురించి ఆలోచించడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని వ్యంగ్యాస్త్రం సంధించారు. పార్టీ వర్గాలతో ఎలాంటి అభిప్రాయ బేధాలు తనకు లేదని స్పష్టం చేశారు. స్టాలిన్‌తో అసలు ఎలాంటి విబేధాలు లేవు అని, అంతా మీడియా సృష్టేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వేళ పార్టీలో తనకు ఇబ్బందులు కలిగి ఉంటే, ఎప్పుడో పార్టీని వీడేదాన్ని అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. పిల్లల కోసం : తన ఇద్దరు పిల్లల కోసం సినిమాలకు దూరంగా ఉన్నానని, వారితో ఎక్కువ సమయం గడపాలన్నదే తన అభిమతంగా పేర్కొన్నారు. పార్టీ కార్యక్రమాలు లేనప్పుడు పిల్లలతో సరదాగా గడుపుతానని, అంత మాత్రాన పార్టీకి దూరంగా ఉన్నట్టు కాదన్నారు. పార్టీ కోసం కష్టపడేందుకు తాను సిద్ధం అని, తాను సరైన అభ్యర్థి కాదు కాబట్టే, తనకు ఎన్నికల్లో సీటు ఇవ్వలేదని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తన సేవల్ని ప్రచారానికి పార్టీ ఉపయోగించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఎన్నికల్లో డీఎంకే ప్రగతిని, అన్నాడీఎంకే వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రసంగాలు చేయనున్నానని వివరించారు. డీఎంకే చేసిందేమిటో, అన్నాడీఎంకే చేసిందేమిటో ప్రజలకు వివరించడమే కాదు, ఎవరైనా చర్చకు వచ్చినా తేల్చుకునేందుకు తాను సిద్ధం అని సవాల్ చేశారు. వ్యక్తిగత విమర్శలు చేయను: ప్రచారంలో ఎవరి మీదా వ్యక్తిగత విమర్శలను తాను చేయనని స్పష్టం చేశారు. వ్యక్తిగత విమర్శలకు డీఎంకే దూరం అన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రధానంగా డీఎండీకే అధినేత విజయకాంత్, సమత్తువమక్కల్ కట్చినేత శరత్‌కుమార్ రాజకీయ పార్టీలకు అధినాయకులైనా, డీఎంకేకు ప్రత్యర్థులుగా ఉన్నా, వారిని మాత్రం విమర్శించనని స్పష్టం చేశారు. సినీ కుటుంబం నుంచి వచ్చిన వాళ్లతో తనకు ఎలాంటి వ్యక్తిగత విబేధాలు లేవు అని, తామంతా ఒకే కుటుంబం అని, అందువల్లే వారిని మాత్రం విమర్శించనని పేర్కొన్నారు. నటి నగ్మా తన కన్నా సీనియర్ అని, ఆమెను ముద్దాడే విధంగా వ్యవహరించిన నాయకుడి చెంప పగలగొట్టి ఉండాలని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఆ స్థానంలో తాను ఉండి ఉంటే, ఆ వ్యక్తి చెంప పగిలి ఉండేదన్నారు. ఇలాంటి పరిస్థితి తమకు ఇంత వరకు ఎదురు కాలేదని, ఎదురు కాదు కూడా అని ధీమా వ్యక్తం చేశారు. డీఎంకేలో మహిళకు భద్రత, రక్షణ ఉందని చివరి ప్రశ్నకు సమాధానం ఇచ్చి ముగించారు. -
ఢిల్లీకి ‘కెప్టెన్’
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన డీఎండీకేను తమ వైపు తిప్పుకునేందుకు జాతీయపార్టీలు ప్రయత్నాలు ప్రారంభించారుు. ఇందులో కాంగ్రెస్ ముందంజలో ఉంది. డీఎండీకే అధినేత విజయకాంత్ ధైర్యాన్ని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గతంలో మెచ్చుకున్నారు. పార్టీ యువజన నేత, విజయకాంత్ బావమరిది సుదీష్ ఇది వరకే రాహుల్‌తో, ఏఐసీసీ పెద్దలతో మంతనాలు జరిపారు. ఈ నేపథ్యంలో విజయకాంత్ శనివారం ఢిల్లీకి పయనమయ్యూరు. ఇదిలావుండగా అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్లతో జాతీయపార్టీగా డీఎండీకేకు ఎన్నికల కమిషన్ గుర్తింపు లభించింది. ఢిల్లీకి పయనం చెన్నై మీనంబాకం విమానాశ్రయంలో తన సతీమణి ప్రేమలతతో కలసి విజయకాంత్ శనివారం ప్రత్యక్షమయ్యారు. మీడియా ఆయన్ను చుట్టముట్టింది. మీడియా తన వద్దకు రాగానే చిరునవ్వులు చిందిస్తూ అడిగిన ప్రశ్నలకు కెప్టెన్ బదులిచ్చారు. కాంగ్రెస్‌తో పొత్తు ఖరారు చేసుకోవడం లక్ష్యంగానే ఈ పర్యటన సాగనుందా అని మీడియూ ప్రశ్నించింది. తమ పార్టీ సమావేశం నిమిత్తం ఢిల్లీకి వెళుతున్నట్లు కెప్టెన్ సమాధానం దాటవేశారు. ఢిల్లీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తోందని, ఈ నేపథ్యంలో అక్కడి పార్టీ నేతలతో ఆదివారం సమావేశం ఏర్పాటు చేశామని వివరించారు. మరలా పొత్తుపై ప్రశ్నించగా దాట వేయడం గమనార్హం. కామన్వెల్త్ సమావేశాలపై అసెంబ్లీలో చేసిన తీర్మానం గురించి విలేకరులు ప్రశ్నించారు. యుద్ధం పేరుతో ఈలం తమిళులు దారుణంగా హత్యకు గురవుతున్న సమయంలో వేడుక చూసిన వాళ్లంతా, ఇప్పుడు మొసలి కన్నీళ్లు కార్చడం హాస్యాస్పందంగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రం మిగులు విద్యుత్‌ను మరికొన్ని రోజుల్లో చూడబోతోందని ముఖ్యమంత్రి జయలలిత చేసిన ప్రసంగానికి స్పందిస్తూ వేచి చూద్దాం...చూస్తేనేగా తెలుస్తుందని ముగించారు. ఇదిలావుండగా విజయకాంత్ ఢిల్లీ పర్యటనపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఆయన ఢిల్లీ పర్యటనలో ఏఐసీసీ పెద్దలను కలిసే అవకాశం ఉందని, పొత్తుకు మార్గం సుగమం కానుందని చెబుతున్నారు.