రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన డీఎండీకేను తమ వైపు తిప్పుకునేందుకు జాతీయపార్టీలు ప్రయత్నాలు ప్రారంభించారుు.
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన డీఎండీకేను తమ వైపు తిప్పుకునేందుకు జాతీయపార్టీలు ప్రయత్నాలు ప్రారంభించారుు. ఇందులో కాంగ్రెస్ ముందంజలో ఉంది. డీఎండీకే అధినేత విజయకాంత్ ధైర్యాన్ని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గతంలో మెచ్చుకున్నారు. పార్టీ యువజన నేత, విజయకాంత్ బావమరిది సుదీష్ ఇది వరకే రాహుల్‌తో, ఏఐసీసీ పెద్దలతో మంతనాలు జరిపారు. ఈ నేపథ్యంలో విజయకాంత్ శనివారం ఢిల్లీకి పయనమయ్యూరు. ఇదిలావుండగా అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్లతో జాతీయపార్టీగా డీఎండీకేకు ఎన్నికల కమిషన్ గుర్తింపు లభించింది.
ఢిల్లీకి పయనం
చెన్నై మీనంబాకం విమానాశ్రయంలో తన సతీమణి ప్రేమలతతో కలసి విజయకాంత్ శనివారం ప్రత్యక్షమయ్యారు. మీడియా ఆయన్ను చుట్టముట్టింది. మీడియా తన వద్దకు రాగానే చిరునవ్వులు చిందిస్తూ అడిగిన ప్రశ్నలకు కెప్టెన్ బదులిచ్చారు. కాంగ్రెస్‌తో పొత్తు ఖరారు చేసుకోవడం లక్ష్యంగానే ఈ పర్యటన సాగనుందా అని మీడియూ ప్రశ్నించింది. తమ పార్టీ సమావేశం నిమిత్తం ఢిల్లీకి వెళుతున్నట్లు కెప్టెన్ సమాధానం దాటవేశారు.
ఢిల్లీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తోందని, ఈ నేపథ్యంలో అక్కడి పార్టీ నేతలతో ఆదివారం సమావేశం ఏర్పాటు చేశామని వివరించారు. మరలా పొత్తుపై ప్రశ్నించగా దాట వేయడం గమనార్హం. కామన్వెల్త్ సమావేశాలపై అసెంబ్లీలో చేసిన తీర్మానం గురించి విలేకరులు ప్రశ్నించారు. యుద్ధం పేరుతో ఈలం తమిళులు దారుణంగా హత్యకు గురవుతున్న సమయంలో వేడుక చూసిన వాళ్లంతా, ఇప్పుడు మొసలి కన్నీళ్లు కార్చడం హాస్యాస్పందంగా ఉందని ఎద్దేవా చేశారు.
రాష్ట్రం మిగులు విద్యుత్‌ను మరికొన్ని రోజుల్లో చూడబోతోందని ముఖ్యమంత్రి జయలలిత చేసిన ప్రసంగానికి స్పందిస్తూ వేచి చూద్దాం...చూస్తేనేగా తెలుస్తుందని ముగించారు. ఇదిలావుండగా విజయకాంత్ ఢిల్లీ పర్యటనపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఆయన ఢిల్లీ పర్యటనలో ఏఐసీసీ పెద్దలను కలిసే అవకాశం ఉందని, పొత్తుకు మార్గం సుగమం కానుందని చెబుతున్నారు.