చెన్నై: బీజేపీ నాయకురాలు, తమిళ సీనియర్ నటి కుష్బూపైన, తమిళనాడు గవర్నర్ టీ.ఎన్.రవిపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు డీఎంకే నేత శివాజీ కృష్ణమూర్తిని ఆ పార్టీ ప్రాధమిక సభ్యత్వం సహా అన్ని పదవుల నుండి ఆయన్ను సస్పెండ్ చేసింది. అనంతరం కొడుంగైయూర్ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.
ఇటీవల జరిగిన ఒక బహిరంగ వేదిక మీద సీఎం స్టాలిన్ సమక్షంలోనే శివాజీ కృష్ణమూర్తి బీజేపీ నేత కుష్బూ గురించి ప్రస్తావిస్తూ.. నేను నిన్ను చెప్పుతో కొట్టగలను.. కానీ అది చెప్పులకు అవమానమని అన్నారు..
ఇక తమిళనాడు గవర్నర్ టీ.ఎన్.రవి ఇటీవల అసెంబ్లీలో అంబేద్కర్ పేరును ఉచ్ఛరించడానికి కూడా సంకోచిస్తున్నారు.. అలాంటప్పుడు ఆయనపై దాడి చేయడం తప్పే లేదని వెంటనే కాశ్మీర్ వెళ్ళండి, అక్కడ టెర్రరిస్టులు మీపై తుపాకులు ఎక్కుపెడతారని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు శివాజీ కృష్ణమూర్తి.
తనపై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలైన కుష్బూ తీవ్రంగా స్పందించారు.. ఆయన నన్నే కాదు మీ నాన్నలాంటి గొప్ప నాయకులను కూడా కించపరుస్తున్నారు అర్ధం కావడం లేదా? అని సీఎం స్టాలిన్ ను ప్రశ్నించారు. ఆడవాళ్ళ గురించి ఏది పెడితే అది మాట్లాడొచ్చన్న వారి ధోరణి చూస్తేనే అర్ధమవుతోంది వారి పెంపకం ఎలాంటిదో. నేను దీన్నంత తేలిగ్గా వదలను, IPC సెక్షన్ 509 కింద కేసు నమోదు చేస్తానన్నారు.
ఆడవాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, క్రమశిక్షణను ఉల్లంఘించి, పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ప్రవర్తించినందుకు శివాజీ కృష్ణమూర్తి ప్రాధమిక పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసింది డీఎంకే పార్టీ. అలాగే ఆయన్ను అన్ని పార్టీ పదవుల నుండి సస్పెండ్ చేసింది.
ఇది కూడా చదవండి: నా లివర్ ఇనుముతో తయారుకాలేదు..
Comments
Please login to add a commentAdd a comment