
జయకు టాటా!
- వామ పక్షాల నిర్ణయం
- ఒంటరిగా బరిలోకి
అన్నాడీఎంకే కూటమికి సీపీఎం, సీపీఐలు టాటా చెప్పాయి. తమకు కనీస మర్యాద ఇవ్వలేదని, సీట్ల పంపకాల్లో తమను నిర్లక్ష్యం చేశారని వామ పక్ష నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. వామపక్షాలు కలసి కట్టుగా రాష్ట్రంలో ఎన్నికలను ఎదుర్కోనున్నాయని గురువారం వారు ప్రకటించారు.
సాక్షి, చెన్నై : అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలసి సీపీఎం, సీపీఐలు పయనించాయి. అన్నాడీఎంకే సంపూర్ణ మెజారిటీతో అధికార పగ్గాలు చేపట్టినా, తాము మాత్రం ఆ కూటమిలోనే ఉన్నామని వామపక్షాలు చాటుకుంటూ వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను అన్నాడీఎంకే పక్కన పెట్టినా, ఎన్నికల కూటమిలోనే ఉన్నట్టు ప్రకటించుకున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలసి కూటమిగా ఎదుర్కొనున్నామని ప్రకటిస్తూ వచ్చిన సీపీఎం, సీపీఐ నేతలకు చివరకు మిగిలింది భంగపాటే. సీపీఎం, సీపీఐల జాతీయ నేతలు పోమెస్ గార్డెన్ మెట్లు ఎక్కి కూటమిని ఖరారు చేసుకు వెళ్లారు. అయితే, సీట్ల పందేరంలో పొత్తు బెడిసి కొట్టింది. వామపక్షాలు తలా నాలుగేసి సీట్లకు పట్టుబట్టడంతో అన్నాడీఎంకే నిరాకిస్తూ వచ్చింది. పలు దఫాలుగా సీట్ల చర్చలు సాగాయి.
చివరకు తలా రెండు సీట్లు దక్కుతాయని భావించిన వామపక్ష నేతలకు మిగిలింది నిరాశే. చెరో సీటుతో సర్దుకోవాలంటూ అన్నాడీఎంకే అధిష్టానం సూచించడంతో ఖంగు తిన్నారు. అదే సమయంలో కూటమిలోని ఆ రెండు పార్టీలకు తెలియకుండానే 40 స్థానాల బరిలో అభ్యర్థులను జయలలిత ప్రకటించారు. సీట్ల పంపకాలు కొలిక్కి వస్తే తమ అభ్యర్థులను వెనక్కు తీసుకుంటామని చెప్పారు.