చెన్నై, సాక్షి ప్రతినిధి : లోక్‌సభ ఎన్నికల్లో రికార్డుల పరంపరకు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కొత్త భాష్యం చెప్పారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్‌ను మించిపోయే ఫలితాలను రాబట్టుకుని కొత్త రికార్డు నెలకొల్పారు. తమిళ ప్రజలు ఎంజీ రామచంద్రన్‌ను పురట్చీతలైవర్ (విప్లవనాయకుడు) అని ముద్దుగా పిలుచుకుంటారు. ఆయన రాజకీయ వారసురాలిగా పార్టీ పగ్గాలు చేపట్టిన జయలలితకు పురట్చితలైవి (విప్లవనాయకి) అనే పేరుపెట్టేశారు. ఎంజీఆర్ మరణం తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన ఆయన భార్య జానకి రామచంద్రన్ కొద్దికాలంలోనే పార్టీని జయ చేతుల్లో పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. 1982 ఎంజీఆర్ హయాంలోనే అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకున్న జయ క్రియాశీలకంగా దూసుకెళ్లారు.
ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు అనేక ఎన్నికలు వచ్చినప్పటికీ ఏ ఒక్కదాన్ని ఒంటరిగా ఎదుర్కోలేదు. పలు పార్టీల కూటమితో నెట్టుకొచ్చారు. అయితే తాజా ఎన్నికల్లో జయలలిత ఒంటరిపోరుకు సిద్ధమై 39 స్థానాల్లో 37 గెలుచుకోవడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యచకితులను చేసింది. పైగా రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో 44శాతం ఓట్లు అన్నాడీఎంకేకు ప డటం మరో రికార్డుగా మారింది.అన్నాడీఎంకేకు 1,74,87,733 ఓట్లు పోలయ్యూయి. డీఎంకే 92,56,923 ఓట్లతో 26.7 శాతం దక్కించుకుంది. అంటే డీఎంకే కంటే అన్నాడీఎంకే 17 శాతం అధికంగా సాధించింది. 1962లో కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరుతో 31 స్థానాల్లో గెలుపొంది 45.26 శాతం ఓట్లు సాధించగా, ఆ తరువాత తాజా ఎన్నికల్లో అన్నాడీఎంకే మాత్రమే ఒంటరిగా 44 శాతం ఓట్లను పొంది 50 ఏళ్ల రికార్డుకు చేరువైంది. 20 ఏళ్ల తరువాత వేలూరులో పాగా వేయగలిగింది.
తలైవర్‌ను మించిన తలైవి
Published Sat, May 17 2014 11:59 PM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement