శ్రేణులపై ‘అమ్మ’ సీరియస్!
Published Wed, Apr 9 2014 12:07 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితకు కోపం వచ్చింది. పార్టీ శ్రేణుల తీరుపై తీవ్ర ఆగ్రహానికిలోనయ్యూరు. ఇంటెలిజెన్స్ సమాచారంతో ఓట్ల వేట తీవ్ర తరం చేయడానికి చర్యలు చేపట్టారు. సీనియర్ మంత్రులతో కూడిన ఎన్నికల పర్యవేక్షణ కమిటీ నియోజకవర్గబాట పట్టింది. ఎమ్మెల్యేలు, నాయకులకు క్లాస్ పీకే పనిలో ఆ కమిటీ నిమగ్నమైంది.
సాక్షి, చెన్నై:లోక్‌సభ ఎన్నికల్లో దక్కించుకునే సీట్ల ఆధారంగా కేంద్రంలో చక్రం తిప్పడం లక్ష్యంగా సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత వ్యూహ రచనల్లో ఉన్నారు. ప్రధానంగా పుదుచ్చేరితో పాటుగా రాష్ట్రంలో 40 స్థానాల్ని కైవశం చేసుకుంటే, పీఎం సీటుపై తమ ఆధిక్యం చూపవచ్చన్న ఆశాభావంతో ఉన్నారు. ఇందు కోసం ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొని సత్తాను చాటుకునే పనిలో నిమగ్నం అయ్యారు. సుడి గాలి పర్యటనతో రాష్ట్రంలో ఆమె ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. తాము సైతం అంటూ అన్నాడీఎంకే గెలుపుకోసం సినీ నటులు ప్రచారంలో దూసుకెళ్తోన్నారు. మంత్రులుసైతం ప్రచారంలో ఉన్నా, స్థానికంగా ఉన్న నాయకుల నుంచి మాత్రం స్పందన కరువు అయింది.
ఇంటెలిజెన్స్ ఆరా : రాష్ట్రంలో అన్నాడీఎంకే అందరి కన్నా ముందుగా ప్రచారంలో దిగింది. అయితే, తాజాగా అన్ని ప్రతి పక్షాల నేతలు ప్రచారంలో దూసుకెళ్తోన్నారు. దీంతో ప్రచారం వేడెక్కింది. ప్రతి పక్షాలు ఓటర్లను ఆకర్షించడంలో వేగం పుంజుకోవడంతో అన్నాడీఎంకే ప్రచారం మందగించినట్టు ఇంటెలిజెన్స్ విచారణలో తేలింది. ఇందుకు ప్రధాన కారణం స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన ప్రతినిధులు, స్థానికంగా ఉండే నాయకుల నిర్లక్ష్యంగా నిర్ధారించారు. ఓటర్లను ఆకర్షించాలంటే పార్టీ అభ్యర్థులు తమను పట్టించుకోవడం లేదంటూ స్థానిక సంస్థల ప్రతినిధులు చేతులెత్తేశారు.
ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీల్లోని రెండో స్థాయి నేతలు అదే బాట పట్టినట్టు జయలలిత దృష్టికి చేరింది. దీంతో కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు పిలుపునిస్తూ, రెండు రోజుల క్రితం ఆమె లేఖాస్త్రం సంధించారు. అయితే, ఆ లేఖకు స్థానిక సంస్థల ప్రతినిధుల నుంచి స్పందన లేకపోవడంతో, కౌన్సిలర్లు, పంచాయతీల అధ్యక్షులతోపాటుగా మండల, డివిజన్, నగర స్థాయి నాయకుల తీరుపై, జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులు, పార్టీ ఎన్నికల పర్యవేక్షులపై మండి పడినట్లు తెలిసింది.
పరుగో పరుగు: అధినేత్రి నుంచి పిలుపు వచ్చిందో లేదో రాష్ట్రంలో సీనియర్లుగా ఉన్న ముగ్గురు మంత్రులు ఓ పన్నీరు సెల్వం, కేపి మునుస్వామి, నత్తం విశ్వనాథన్ ఉరకలు పరుగులు తీసినట్టు తెలిసింది. జయలలిత ఆదేశాలతో ఈ ముగ్గురు మంత్రుల బృందం నియోజకవర్గాల బాట పట్టింది. అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ స్థానిక సంస్థల ప్రతినిధుల్ని బుజ్జగించే పనిలో పడ్డారు.
జయలలిత ఆదేశాల్ని వారి దృష్టికి తీసుకెళ్లే పనిలో నిమగ్నం అయ్యారు. ఏఏ డివిజన్లలో ఓట్ల శాతం తగ్గుతాయో అక్కడంతా మూకుమ్మడిగా పార్టీలో ప్రక్షాళనలు ఉంటాయన్న హెచ్చరికలు చేస్తూ వస్తున్నారు. స్థానిక సంస్థలకు ప్రతినిధులుగా ఉన్న వాళ్లను సైతం వదలి పెట్టకుండా తీవ్రంగా మందలించే పనిలో ఉన్నారు. సీనియర్ మంత్రి వైద్య లింగంను తంజావూరులోనే ఉండాలని ఆదేశించారు. టీ ఆర్ బాలును ఓడించడం లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డాలని సూచించారు. దక్షిణ, ఉత్తర, మధ్య చెన్నైలలోని నాయకులతో మంతనాలు జరిపిన మంత్రుల కమిటీ, ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌన్సిలర్లు ప్రచారాలకు దూరంగా ఉండడంతో, ఎన్నికల అనంతరం భరతం పట్టాల్సి ఉంటుందని తీవ్రంగా మందలించారు. కష్టపడి పనిచేసే వాళ్లను పార్టీ అధిష్టానం గుర్తిస్తుందని, అన్నీ పార్టీ అధిష్టానానికి తెలుసునని, కష్ట పడ్డ వాళ్లకు మంచి భవిష్యత్తు ఉంటుందని, తప్పించుకుని తిరిగే వాళ్లకు ఉద్వాసన తప్పదని హెచ్చరించడం గమనార్హం.
Advertisement