విజ్ఞప్తులు
Published Sun, Dec 29 2013 4:58 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
చెన్నై, సాక్షి ప్రతినిధి:రాష్ట్ర వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల వేడి పార్టీలకు చలికాలంలో సైతం సెగలు పుట్టిస్తోంది. ఎత్తులు, పై ఎత్తులు, కుమ్మక్కులతో పార్టీ నేతలు తలమునకలై ఉండగా అమ్మ అభిమాన నేతలు ఆమె కోసం 1175 విజ్ఞప్తులు సమర్పించుకున్నారు. పార్టీపై పొంగిపొరలిన అభిమానం పుణ్యమా అని రూ.11.34 కోట్లు అన్నాడీఎంకే సొంతమైంది. కేంద్రంలో అధికారమే లక్ష్యంగా, ప్రధాని పీఠమే ధ్యేయంగా అన్నాడీఎంకే అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని 39, పుదుచ్చేరిలోని ఒకటి మొత్తం 40 లోక్‌సభ స్థానాల్లో గెలుపొందడం ద్వారా అమ్మను ప్రధానిని చేయాలని పార్టీ నేతలు ఇటీవలే ప్రతిన పూనారు. అనేక పార్టీలు సాగిస్తున్న మూడో ఫ్రంట్ ప్రయత్నాలు సఫలీకృతమై ఏ పార్టీకి ఎక్కువ స్థానాలు దక్కితే ఆ పార్టీ నేతే ప్రధాని అయ్యే అవకాశం ఉంటుందనే భావన తో ఉన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలకు చెందిన నేతలు ప్రధాని పీఠం ఎక్కారని, ఈ సారి తమిళనాడు వంతు వచ్చిందని ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో జయ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయదలుచుకున్న వారు తాము కోరుకుంటున్న నియోజకవర్గాన్ని పేర్కొంటూ విజ్ఞప్తులు సమర్పించాలని అన్నాడీఎంకే ప్రకటించింది. ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు విజ్ఞప్తులకు గడువు విధించింది.
ఇందుకు అనుగుణంగా పార్టీ నేతలు, కార్యకర్తలు తమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటూ పోటీలు పడి అమ్మ పేరున పార్టీ కార్యాలయంలో విజ్ఞప్తులు సమర్పించుకున్నారు. ఒక్కో విజ్ఞప్తితోపాటూ రూ.25వేలు రుసుము చెల్లించాల్సి ఉంది. మొత్తం 4,537 విజ్ఞప్తులు అందగా వీటిల్లో అమ్మకోసం 1,175 విజ్ఞప్తులు అందాయి. తమిళనాడులోని 1,171, పుదుచ్చేరి నుంచి 4 లోక్‌సభ స్థానాలు అమ్మకోసం కేటాయిస్తున్నట్లుగా విజ్ఞప్తుల్లో పేర్కొన్నారు. విజ్ఞప్తుల రూపేణా పార్టీకి భారీ స్థాయిలో రూ.11.34 కోట్ల రుసుము అందడం విశేషం. తమిళనాడు నుంచి పోటీ చేసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతూ 3,343 విజ్ఞప్తులు, పుదుచ్చేరిలో అవకాశం కల్పించాలని 19 విజ్ఞప్తులు అందాయి.
నక్కలోళ్ల విజ్ఞప్తి
తమిళనాడు నుంచి లోక్‌సభ స్థానానికి పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరుతూ రాష్ట్ర నక్కలోళ్ల సంఘం అధ్యక్షుడు ఆర్ వెంకటేష్ విజ్ఞప్తి సమర్పించారు. తమజాతికి చెందిన సుమారు వంద మంది స్త్రీ, పురుషులను వెంటపెట్టుకుని నృత్యాలు చేస్తూ పార్టీ కార్యాలయానికి చేరుకుని వినతి పత్రం సమర్పించారు.
Advertisement
Advertisement