
కూవం ప్రక్షాళన
- రూ.3,833 కోట్లతో కార్యాచరణ సిద్ధం
- తీరవాసులతో చర్చలు
సాక్షి, చెన్నై: కూవం నది ప్రక్షాళనకు మళ్లీ కార్యాచరణ సిద్ధం అయింది. రూ.3,833 కోట్లతో అంచనా రూపొందించా రు. తీరవాసులతో చర్చలు జరిపి ఆక్రమణల తొలగిం పునకు అధికార యంత్రాంగం సిద్ధం అవుతోంది. అరక్కోణం సమీపంలోని తక్కోళం కేశవరం నుంచి మొదలయ్యే కూవం నది అనేక పాయలుగా చీలి కోయంబేడు వద్ద నగరంలోకి ప్రవేశిస్తున్న విషయం తెలిసిందే. ఈ కూవం పరివాహక ప్రాంతంలో 82 చెరువులు, 13,575,93 హెక్టార్ల ఆయకట్టు భూములు ఉండేవి. ఈ ప్రాంతాల్లో అరన్‌వెయిల్, కొరట్టూరు, కన్నన్ పాళెం, ఆయిల్‌చెడి, పర్తిపట్టుల వద్ద ఆనకట్టలు సైతం నిర్మిం చారు. తక్కోళం కేశవరం నుంచి 72 కిలోమీటర్లు ప్రవహిస్తోంది. చెన్నై మహానగరంలో మాత్రం 17.98 కిలోమీటర్ల మేరకు ప్రవహించి చివరకు నేప్పియర్ వంతెన వద్ద సముద్రంలోకి కలుస్తున్నది. వర్షాకాలంలో అయితే, ఈ నది మరీ ఉధృతంగా ప్రవహిస్తూ ఉండేది.
అన్యాక్రాంతం: కాలక్రమేణా ఈ నది పరివాహక ప్రాం తాలు అన్యాక్రాంతం కావడంతో ప్రస్తుత నది వెడల్పు సగానికి సగం తగ్గిపోరుుంది. ఈ ప్రాంతాల్లో వెలసిన ఇళ్లు, కర్మాగారాల నుంచి వెలువడుతున్న మురుగు నీరు, చెత్తా చెదారం నదిలో కలవడంతో కూవం కాస్త మురికి కూపంగా మారింది. ఈ మురుగునీరు ప్రవహిస్తుండడంతో నగరంలో అనేక ప్రాంతాలు దుర్గంధభరితంగా మారాయి. కూవం మురికి కూపం కారణంగా బకింగ్‌హామః కాల్వ, ఓట్టేరి కాల్వలు సైతం మురికి నీటి కాల్వలుగా మారాయి. స్వచ్ఛతను కోల్పోయిన ఈ నదికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు ఒకప్పుడు రాష్ర్టంలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఆ పథకాన్ని తమ భుజాన వేసుకునే పనిలో డీఎంకే పడింది. తేమ్స్ నదీ తరహాలో ఈ కూవంను తీర్చిదిద్దుతామని కార్యచరణ సిద్ధం చేశారు. సింగపూర్, లండన్‌లకు వెళ్లి మరీ అక్కడి నదుల అభివృద్ధిని పరిశీలించి వచ్చారు. పనులు ఆరంభించారు. కోట్లాది రూపాయల నిధులను వెచ్చించారు. అయితే, రాష్ట్రంలో అధికారం మారడంతో ఆ పథకాన్ని అన్నాడీఎంకే తుంగలో తొక్కింది.
మళ్లీ ప్రక్షాళనకు కార్యాచరణ: కూవం నదిని తాము సుందరంగా తీర్చిదిద్దుతామంటూ అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల అసెంబ్లీలో సీఎం జయలలిత మాట్లాడుతూ, కూవం పనుల్ని సరి కొత్త తరహాలో చేపట్టనున్నామని, గత ప్రభుత్వం సిద్ధం చేసిన వాటిని పక్కన పెడుతున్నామని ప్రకటించారు. అదే సమయంలో ఎక్స్‌ప్రెస్ వే పనులకు బ్రేక్ వేయడానికి నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం కూవం ప్రక్షాళన నినాదాన్ని అందుకుంది. కూవం నదిని అభివృద్ధి పరచబోతున్నామని, ఈ తీరంలో ఆ ఎక్స్‌ప్రెస్ వే వద్దన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరించి చివరకు కోర్టులో భంగపడాల్సి వచ్చింది. ఎలాగైనా కూవం నది ప్రక్షాళన చేపట్టాలన్న లక్ష్యానికి ప్రభుత్వం రావడంతో డీఎంకే పథకాన్ని పక్కన పెట్టి, కొత్త పథకానికి కార్యాచరణ సిద్ధం చేసే పనిలో అధికారులు పడ్డారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆ పనులను కాస్త పక్కన పెట్టారు. ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతో అధికారులు పనుల్లో బిజీగా ఉన్నారు. కూవం నది ప్రక్షాళన ఫైల్‌ను దుమ్ము దులిపేశారు. ప్రక్షాళన చేపట్టాల్సిన పనులతో కార్యాచరణ సిద్ధం చేసి ఉన్నారు.
రూ.3,833 కోట్లతో పనులు: రెండేళ్లలో ఈ నది ప్రక్షాళన లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేసినట్టు తెలిసింది. ఇందు కోసం రూ.3,833 కోట్లతో అంచనా వ్యయం సిద్ధం చేశారు. కూవం నదీ తీరంలో అక్కడక్కడ ఉద్యానవనాలను ఏర్పాటు చేయడం, మరికొన్ని చోట్ల సుందరంగా తీర్చిదిద్దడం, తీరం వెంబడి చెట్లను పెంచడం, కూవం నదీ తీరంలో పూడిక తీత, మురికి నీరు శుద్ధీకరణ తదితర పనులకు నిర్ణయించారు. అన్యాక్రాంతమైన స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టి ఉన్నారు. చెన్నై నగరంలోని తీరం వెంబడి ఉన్న గుడిసెలను తొలగించి, వారికి ప్రత్యామ్నాయ స్థలాల్ని లేదా ఇళ్లను కేటాయించే విధంగా కార్యాచరణ రూపొందించారు. ఫలితాల లెక్కింపు అనంతరం తీర వాసులతో చర్చలు, అభిప్రాయాల సేకరణకు ప్రజా పనుల శాఖ నిర్ణయించి ఉన్నది.