సాక్షి, అమరావతి: విశాఖపట్నం నుంచి పరిపాలనకు కీలక అడుగు పడింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో సమతుల అభివృద్ధిలో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై క్షేత్రస్థాయిలో సమీక్షలు, పర్యవేక్షణ చేయాల్సి ఉన్నందున ముఖ్యమంత్రి, మంత్రులు, సీనియర్ అధికారులు ఆ జిల్లాల్లో పర్యటించడంతో పాటు విశాఖపట్నంలో రాత్రి పూట బస చేయాల్సి ఉందని, ఈ నేపథ్యంలో మంత్రులు, సచివాలయాల శాఖలు, సీనియర్ అధికారులకు కార్యాలయాల వసతిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
విశాఖలో మంత్రులు, సచివాలయ, వివిధ శాఖాధిపతుల కార్యాలయాలు, క్యాంపు కార్యాలయాలకు భవనాలను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో కమిటీని నియమించింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు మంత్రులు, సచివాలయ శాఖల కార్యాలయాల వసతికి ప్రభుత్వ భవనాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రులు, సీనియర్ అధికారుల సమీక్ష సమావేశాలకు రుషికొండలోని మిలీనియం టవర్స్ ఎ, బిని క్యాంపు కార్యాలయాలుగా గుర్తించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సొంత భవనాల్లేని ప్రధాన శాఖలకు కూడా ఈ టవర్లలో వసతి కేటాయించనున్నట్లు తెలిపారు.
ఇక్కడ 1.75 లక్షల చదరపు అడుగుల స్థలంలో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మిగతా శాఖలకు నగరంలోని వివిధ ప్రభుత్వ భవనాల్లో మొత్తం 2.27 లక్షల చదరపు అడుగులు కేటాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొత్తం 35 శాఖల్లో 16 శాఖలకు మాత్రమే ప్రస్తుతానికి విశాఖలో వసతి కేటాయించారు. వీటికి ఎండాడ, హనుమంతవాక, దయాళ్ నగర్, మహారాణి పేట, కంచరపాలెం, దుర్గానగర్, రాంనగర్, ఎంవిపీ కాలనీ, పెందుర్తి, మద్దిలపాలెం, సిరిపురం సర్కిల్, భీమునిపట్నం, మర్రిపాలెం, ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంతాల్లో భవనాలు కేటాయించారు.
మిగతా 19 శాఖలకు భవనాలను గుర్తించాల్సి ఉందని తెలిపారు. ఆర్‌టీజీఎస్, సాంఘిక సంక్షేమం, ఆర్థిక, సాధారణ పరిపాలన, గ్రామ, వార్డు సచివాయాలు, ఉన్నత విద్య, గృహ నిర్మాణం, మౌలిక సదుపాయాలు ఐటీ, కార్మిక, న్యాయ, మైనారిటీ సంక్షేమం తదితర శాఖలకు వసతి గుర్తించాల్సి ఉందన్నారు. ఏ శాఖకైనా విశాఖలో సొంత భవనాలు ఉంటే వాటిలో కార్యాలయాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.
సీనియర్ అధికారుల గృహ వసతి కోసం ముందుగా సొంత భవనాలను వినియోగించుకోవాలని సూచించారు. మిలీనియం టవర్లలో వసతి కేటాయింపులపై ఐటీ శాఖ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉత్తర్వులకు అనుగుణంగా సచివాలయానికి సంబంధించిన అన్ని శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment