16 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అన్నాడీఎంకే
14 మంది కొత్త వారికి అవకాశం
డీఎండీకేకు ఐదు స్థానాలు కేటాయింపు
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళని స్వామి తన పార్టీ లోక్‌సభ అభ్యర్థుల జాబితాను బుధవారం ప్రకటించారు. తొలి విడతలో ప్రకటించిన 16 మంది అభ్యర్థులలో 14 మంది కొత్తవారు కావడం గమనార్హం. అలాగే మిత్రపక్షం పుదియ తమిళగం(పీటీ)కి తెన్‌కాశి (రిజర్వుడ్) సీటును, మరో మిత్రపక్షం ఎస్‌డీపీఐకు దిండుగల్ సీటును కేటాయించారు.
అన్నాడీఎంకే నేతృత్వంలో మినీ కూటమి లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమైంది. పెద్ద పార్టీలు కలిసి రాకున్నా, చిన్న పార్టీలతో ఎన్నికలలో తన సత్తా చాట్టాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణి స్వామి భావిస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను బుధవారం చైన్నెలో ఎంజీఆర్ మాళిగైలో ప్రకటించారు. 16 మందితో విడుదల చేసిన తొలి జాబితాలో 14 మంది కొత్త వారు కావడం విశేషం. వీరంతా ఎంబీబీఎస్, ఎంటెక్, ఎంఏ, బీఏ, పీజీ పట్టభద్రలే. ముందుగా మిత్ర పక్షం పుదియ తమిళగం, ఎస్‌డీపీఐలకు సీట్లను కేటాయించారు. ఇందుకు సంబంధించిన ఒప్పందాలపై పుదియ తమిళగం నేత కృష్ణస్వామి, ఎస్‌డీపీఐ నేత నైల్లె ముబారక్, అన్నాడీఎంకే ప్రధాన కార్యదరిశ పళణి స్వామి సంతకాలు చేశారు. అభ్యర్థుల ప్రకటన అనంతరం పళణి స్వామి మీడియాతో మాట్లాడుతూ తమ కూటమిలోని పార్టీల వివరాలను తెలియజేశారు.
అలాంటి రాజకీయాలు అవసరం లేదు..
ఎన్నికలలో కూటములు అవసరమని, అయితే కూటములను మాత్రమే నమ్ముకుని రాజకీయం చేయాల్సిన అవసరం అన్నాడీఎంకేకు లేదని పళణి స్వామి వ్యాఖ్యానించారు. 16 మంది అభ్యర్థులలో 14 మంది కొత్త వారు అని, వీరంతా ప్రజలు మెచ్చిన అభ్యర్థులు అవుతారని అని ధీమా వ్యక్తం చేశారు. మిత్ర పక్షంలోని పుదియ తమిళగంకు తెన్‌కాశి(రిజర్వుడ్), ఎస్‌డీపీఐకు దిండుగల్ సీటును కేటాయించామని ప్రకటించారు.
ప్రేమలత విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేకు 5 స్థానాలు కేటాయించామని, గురువారం ఈమేరకు ఒప్పందం చేసుకునే అవకాశం ఉందన్నారు. పీఎంకేతో తాము చర్చలు జరపలేదని, త్వరలో తమ ఎన్నికల మేనిఫెస్టో సరికొత్త తరహాలో ప్రజల ముందుకు వస్తుందని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అన్నాడీఎంకే సొంత బలంపైనే నిలబడే పార్టీ అని, ఎవరు వచ్చినా రాకున్నా తమ బలం తనకు ఉందన్నారు. 2.06 కోట్ల మంది సభ్యులను కలిగిన అన్నాడీఎంకేకు ప్రజలే తోడు అని, పార్లమెంట్‌లో 3వ అతి పెద్ద పార్టీగా అవతరించిన అన్నాడీఎంకే రానున్న ఎన్నికలలో తన బలాన్ని చాటుతుందని, ప్రజలు తమ వైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.
అభ్యర్థుల్లో ఎక్కువగా..
భ్యర్థుల తొలి జాబితాలో జయ వర్దన్ (దక్షిణచైన్నె), చంద్రకాసన్(చిదంబరం) గతంలో ఎన్నికలలో పోటీచేసి ఓటమి పాలయ్యారు. జయవర్దన్ అన్నాడీఎంకే సీనియర్ నేత జయకుమార్ వారసుడు. ఇక రాయపురం మనో(ఉత్తర చైన్నె) పార్టీ పరంగా ఓటర్లకు సుపరిచితుడే. మదురై అభ్యర్థి డాకర్ట్ శరవణన్ గతంలో డీఎంకే తరపున తిరుప్పర గుండ్రం నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇటీవల ఆయన అన్నాడీఎంకేలో చేరారు. తొలి జాబితాలోని అభ్యర్థులలో ఎక్కువ శాతం మంది అన్నాడీఎంకే అనుబంధ సంస్థ జయ పేరవైకు చెందిన వారే ఉండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment