జయకు లెఫ్ట్ ఝలక్
లోక్‌సభ సీట్ల కేటాయింపులో కుదరని పొత్తు
సాక్షి, చెన్నై: తమిళనాట గురువారం నాటి రాజకీయ పరిణామాలు జాతీయ స్థాయిలో మూడో కూటమి (థర్డ్ ఫ్రంట్)కి బీటలు వారే పరిస్థితికి దారి తీస్తున్నాయి. లోక్‌సభ సీట్ల పందేరం కొలిక్కిరాక పోవడంతో అన్నాడీఎంకే కూటమి నుంచి వైదొలగాలని సీపీఎం, సీపీఐ నిర్ణయించాయి. లోక్‌సభ ఎన్నికల ద్వారా కేంద్రంలో చక్రం తిప్పాలని ఆశిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఇది పెద్ద షాకేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వామపక్షాలు, అన్నాడీఎంకే గతంలో 2009 పార్లమెంట్ ఎన్నికలలో, 2011 శాసనసభ ఎన్నికలలో కలసి పోటీ చేశాయి. ఈ నేపథ్యంలో ఇటీవల సీపీఎం, సీపీఐ జాతీయ నేతలు ప్రకాశ్ కారత్, బర్ధన్, సుధాకర్‌రెడ్డి జయలలితతో భేటీ కావడం, జాతీయ స్థాయిలో మూడో కూటమి ఏర్పాటు చేయనున్నట్టు చెన్నైలో ప్రకటించడం తెలిసిందే. వచ్చే సాధారణ ఎన్నికలలో అన్నాడీఎంకేతో సీపీఎం, సీపీఐ కలసి పనిచేస్తాయని చెప్పారు. గత నెల తన జన్మదినం సందర్భంగా పుదుచ్చేరితో పాటు తమిళనాడులోని 40 స్థానాల్లోనూ అభ్యర్థులను నిలబెడుతున్నట్లు జయలలిత ప్రకటించారు.
రెండ్రోజుల క్రితం ఎన్నికల ప్రచారానికీ శ్రీకారం చుట్టారు. మరోవైపు సీపీఎం, సీపీఐలతో సీట్ల పంపకాలు కొలిక్కివస్తే, తమ అభ్యర్థులు కొందర్ని వెనక్కు తీసుకుంటామని చెప్పారు. సీపీఎం, సీపీఐ తొలుత నాలుగేసి చొప్పున సీట్లు ఆశించినప్పటికీ జయలలిత అంగీకరించలేదు. చెరో సీటుతో సర్దుకోవాలంటూ ఆమె సూచించినట్టు తెలిసింది. పలు దఫాలుగా చర్చలు సాగినా జయలలిత మాత్రం మెట్టు దిగకపోవడంతో గురువారం సాయంత్రం చెన్నై టీ నగర్‌లోని కార్యాలయంలో వామపక్ష నేతలు సమావేశమయ్యారు. అనంతరం ఆ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు జి.రామకృష్ణన్, డి.పాండ్యన్ మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే కూటమి నుంచి వైదొలగుతున్నామని ప్రకటించారు. సీపీఎం, సీపీఐ కలసి ఎన్నికల్లో పోటీ చేస్తాయని చెప్పారు.
బీజేపీతో పొత్తుకు డీఎండీకే, పీఎంకే సై
కేంద్రంలో అధికారంపై కన్నేసిన బీజేపీకి తమిళనాడులో రెండు పార్టీలు స్నేహహస్తాన్ని అందించేందుకు ముందుకు వచ్చాయి. డీఎండీకే, పీఎంకే బీజేపీతో పొత్తు విషయమై చర్చలు నిర్వహించనున్నట్లు గురువారం ప్రకటించాయి.