ఐటీ మినహాయింపు 5 లక్షలు
జయలలిత ‘జాతీయ’స్థాయి ఎన్నికల హామీ
చెన్నై: ప్రధాని పదవిపై కన్నేసిన అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను జాతీయ స్థాయి హామీలతో తీర్చిదిద్దారు. కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వంలో తాము భాగమైతే ప్రస్తుతం రూ. 2లక్షలుగా ఉన్న ఆదా య పన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చారు.
పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయించడానికి చమురు కంపెనీలకు కట్టబెట్టిన అధికారాలను వెనక్కి తీసుకుంటామని ప్రకటించారు. అన్నాడీఎంకే మేనిఫెస్టోను జయ మంగళవారమిక్కడి పార్టీ ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు. తమిళనాడు అభివృద్ధి కోసమే కాకుండా మొత్తం దేశాభివృద్ధి కోసం చేపట్టాల్సిన పథకాలకు సంబంధించి ఎన్నో విధానాలను, వాగ్దానాలను ఇందులో పొందుపరచామన్నారు. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు.
- రాష్ట్రాల అభివృద్ధి.. కేంద్ర ఆర్థిక, విదేశీ విధానాలపై ఆధారపడి ఉంటుంది కనుక తమిళనాడు హక్కుల పునరుద్ధరణ, రాష్ట్రాలకు కేంద్ర నిధుల్లో దక్కాల్సిన వాటా, అదనపు అధికారాల కోసం కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో అన్నాడీఎంకే భాగం కావాల్సిన అవసరముంది.
- తమిళనాడులో ప్రజాదరణ పొందిన ఉచిత మిక్సీలు, గ్రైండర్లు, పేదలకు పాడి ఆవులు, మేకల పథకాలను దేశమంతా విస్తరిస్తాం.
- చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల కోసం ఉద్దేశించిన బిల్లును చట్టంగా తీసుకొస్తాం. విదేశాల్లోని భారతీయుల నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తాం.