‘జయ’కేతనమే..!
* తమిళనాట అధిక స్థానాలు అన్నాడీఎంకే ఖాతాలోకే!
* రెండో స్థానం కోసం డీఎంకే, బీజేపీ హోరాహోరీ
* కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో గల్లంతే
సి. నందగోపాల్, సాక్షి ప్రతినిధి-చెన్నై: తమిళనాడులో ప్రచార హోరు మంగళవారం నాటితో ముగిసింది. తమిళనాడులోని 39, పుదుచ్చేరిలోని ఒక స్థానం కలుపుకొని, మొత్తం 40 స్థానాలకు గురువారమే పోలింగ్ జరగనుంది. తాజా అంచనాల ప్రకారం తమిళనాట ‘జయ’కేతనమే రెపరెపలాడనుంది. అత్యధిక స్థానాలు అన్నాడీఎంకే ఖాతాలోకే చేరే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. రెండో స్థానం కోసం డీఎంకే, బీజేపీ కూటముల మధ్య హోరాహోరీ పోటీ నెలకొని ఉంది.
ప్రజాబలం ఉందనే ధైర్యంతో అన్నాడీఎంకే ఒంటరిగానే బరిలోకి దిగింది. అధికార పార్టీకి ఏకైక ప్రత్యామ్నాయమనే ధీమాతో కొన్ని చిన్నా చితకా పార్టీలతో పొత్తు పెట్టుకుని డీఎంకే రంగంలోకి దిగింది. మరోవైపు ప్రధాన పార్టీలైన అన్నాడీఎంకే, డీఎంకేలు లేని బలమైన కూటమిని బీజేపీ ఏర్పాటు చేసుకోగలిగింది. ప్రాంతీయ పార్టీలను ప్రసన్నం చేసుకునేందుకు చివరిక్షణం వరకు కాంగ్రెస్ విఫలయత్నాలు చేసింది. చిన్న పార్టీలు సైతం కాంగ్రెస్‌ను కన్నెత్తి చూడకపోవడంతో గత్యంతరం లేక ఒంటరి పోరాటానికే సిద్ధపడింది.
నలభై మనవే... ‘అమ్మ’ ఆత్మవిశ్వాసం
అభ్యర్థుల జాబితా ప్రకటన మొదలుకొని, ప్రచార ప్రారంభం వరకు అన్నింటా ముందంజలో ఉన్న అన్నాడీఎంకే అధినాయకురాలు, ముఖ్యమంత్రి జయలలిత ‘నాళై నమదే... నార్పదుం నమదే’ (రేపు మనదే... నలభై స్థానాలూ మనవే) నినాదంతో కార్యకర్తలకు ఆత్మవిశ్వాసాన్ని నూరిపోశారు. ప్రధాని పీఠమే లక్ష్యంగా ప్రచారం ప్రారంభించిన ఆమె, ప్రతి ప్రచారవేదికను ఎర్రకోటను లేదా పార్లమెంటు భవనాన్ని నమూనాగా చేసుకున్నారు. తొలిరోజుల్లో అన్ని స్థానాల్లోనూ అన్నాడీఎంకే ప్రాభవమే కనిపించింది. బీజేపీ, డీఎంకే కూటములు సైతం ప్రచారం ప్రారంభించడంతో పరిస్థితులు మారాయి. అన్నాడీఎంకే అంతర్గత అంచనా 30 నుంచి 20-25 స్థానాలకు పడిపోయింది. అన్నాడీఎంకేకు జయలలిత మాత్రమే ఏకైక స్టార్ క్యాంపెయినర్ కావడం ప్రతిబంధకంగా మారింది.
డీఎంకేకు ఇంటిపోరు ప్రభావం అంతంత మాత్రమే...
డీఎంకే 35 స్థానాల్లో అభ్యర్థులను నిలిపి, 5 స్థానాలను మిత్రపక్షాలకు ఇచ్చింది. డీఎంకే అధినేత కుమారుడు అళగిరి తొలుత ఇబ్బందులు సృష్టించినా, దాని ప్రభావం కేవలం మధురకే పరిమితమైంది. కరుణానిధి 90 ఏళ్ల వార్ధక్యాన్ని సైతం లెక్క చేయకుండా, తన వాగ్ధాటితో ఓటర్లను కొంతవరకు ఆకట్టుకోగలిగారు. కరుణానిధి చిన్న కుమారుడు స్టాలిన్, కూతురు కనిమొళి, సినీనటి ఖుష్బూ వంటి స్టార్ క్యాంపెయినర్ల బలం కూడా డీఎంకేకు తోడైంది. అయితే, ‘అవినీతి’ మరకలున్న కేంద్ర మాజీ మంత్రులు దయానిధి మారన్, రాజాలను బరిలో నిలపడం ద్వారా కరుణానిధి ప్రతిష్ట మసకబారింది. అయినా, డీఎంకే కూటమికి 6-9 స్థానాలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మూడో శక్తిగా ‘కాషాయ’కూటమి
ఎన్నికలకు రెండు మూడు నెలల కిందటి వరకు తమిళనాడులో బీజేపీ ప్రభావం నామమాత్రంగానే ఉండేది. బీజేపీ తన ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ప్రకటించడం, రాష్ట్రంలో ఆయన వరుసగా ప్రచార సభలు నిర్వహించడంతో ఆ పార్టీ పుంజుకుంది. ప్రధాన పార్టీలైన అన్నాడీఎంకే, డీఎంకే మినహా ఎండీఎంకే, పీఎంకే, ఐజేకే వంటి ప్రాంతీయ పార్టీలన్నీ వరుసగా బీజేపీ కూటమిలో చేరాయి. దీంతో బీజేపీ కూటమి రాష్ట్రంలో మూడో శక్తిగా మారింది. బీజేపీ ఎనిమిది స్థానాలకే పరిమితమై, ఎక్కువ స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించింది. మోడీ ప్రభావంతో పాటు మిత్రపక్షాల నేతలైన విజయకాంత్, వైగో, డాక్టర్ రామదాస్‌లకు స్థానికంగా గల ప్రాబల్యమూ ఈ కూటమికి కలసి వచ్చే అంశమే. మరోవైపు సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో మోడీ భేటీ కూడా ఈ కూటమికి సానుకూలత పెంచింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆరేడు స్థానాలను బీజేపీ కూటమి గెలుచుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
కాంగ్రెస్‌కు ఒక్కసీటైనా అనుమానమే...
డీఎంకేతో పొత్తు పెట్టుకుని యూపీఏ-1, యూపీఏ-2 హయాంలో రాష్ట్రంలో చక్రం తిప్పిన కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో ఒక్క సీటు దక్కడమైనా అనుమానమే. ఓటమి తథ్యమయ్యే పరిస్థితుల కారణంగా కేంద్ర మంత్రులు చిదంబరం, నాచియప్పన్, జీకే వాసన్‌లు పోటీకి దూరంగా ఉన్నారు. చిదంబరం తన కుమారుడిని బరిలోకి దించారు. యూపీఏ రెండు ప్రభుత్వాల్లో కేంద్ర మంత్రి పదవులను దక్కించుకున్న డీఎంకే అధినేత కరుణానిధి, శ్రీలంక అంశాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేశారు. దీంతో సీబీఐ కేసులను ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రులు, తమ పార్టీ అభ్యర్థులు దయానిధి మారన్, రాజాలు నిర్దోషులని, అసలు దోషి ప్రధానేనని చెప్పుకొనేందుకు కరుణానిధికి అవకాశం కలిగింది. రాజీవ్ హంతకులకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన క్షమాభిక్షను కాంగ్రెస్ అడ్డుకోవడం కూడా బెడిసికొట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప కాంగ్రెస్‌కు ఒక్కస్థానమైనా దక్కే అవకాశాలు కనిపించడం లేదు. ఆటలో అరటిపండులా వామపక్షాలు రెండూ చెరో తొమ్మిది స్థానాల నుంచి పోటీ చేస్తున్నాయి.