
ప్రజలను ఆకట్టుకునేలా నృత్యం చేస్తున్న కళాకారులు, ఎగువకొండయూర్‌లో ప్రచారం నిర్వహిస్తున్న పూందమల్లి అసెంబ్లీ అన్నాడీఎంకే అభ్యర్థి వైద్యనాథన్
తిరువళ్లూరు: ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తిరువళ్లూరు పార్లమెంట్ స్థానంతో పాటు పూందమల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి ఏప్రిల్ 18న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. పూందమల్లి నియోజకవర్గంలోని వదట్టూరు కోయంబాక్కం ఎగువకొండయూర్ ఆరియలూరుతో పాటు పది గ్రామాల్లో అన్నాడీఎంకే అభ్యర్థి వైద్యనాథన్ ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండడంతో పాటు మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.
ఇదే విధంగా పూందమల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న డీఎంకే అభ్యర్థి కృష్ణస్వామి పూందమల్లి పట్టణంలోనూ, ఏఎంఎంకే అభ్యర్థి ఏలుమలై ఎల్లాపురం యూనియన్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. కాగా పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న అన్నాడీఎంకే అభ్యర్థి వేణుగోపాల్ గుమ్మిడిపూండిలోనూ, కాంగ్రెస్ అభ్యర్థి జయకుమార్ తిరువేళాంగాడు యూనియన్‌లోనూ, ఏఎంఎంకే అభ్యర్థి పొన్‌రాజా పొన్నేరిలోనూ ప్రచారం నిర్వహించారు. ఇదిలాఉండగా గ్రామీణ ఓటర్లును ఆకట్టుకోవడానికి ఎంజీఆర్‌తో పాటు ఇతర వేషధారణలో కళాకారులతో నృత్యాలను ఏర్పాటు చేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.