ఆయనకు తిక్కుంది. దానికి లెక్కలేదు. ఎప్పుడు ఎవరిపైన చేయి చేసుకుంటారో.. ఎక్కడ ఎవరిని తిడతారో ఆయనకే తెలియదు. ఎంతో ప్రేమతో దండ తీసుకొచ్చిన అభిమానులు కూడా.. ఆయన మెడలో వేసేందుకు ఆచితూచి అడుగేయాల్సిన పరిస్థితి. ప్రేమతో పలకరిద్దామన్నా.. పళ్లు ఊడగొడతాడేమోననే భయం. సమస్యను చెప్పుకుందామన్నా.. బూతులు తిడతాడనే ఆందోళన. విగ్గుపైన చూపే శ్రద్ధ.. నియోజకవర్గ ప్రజలపై లేకుండా పోతోంది. మొన్న అభిమాని.. నిన్న ఛానల్ రిపోర్టర్.. తాజాగా పార్టీ కార్యకర్త.. రేపు ఎవరో..? బాలయ్య చేస్తున్న గోల హిందూపురం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.
హిందూపురం: ఎన్టీఆర్‌ను గెలిపించిన హిందూపురం.. టీడీపీకి కంచుకోట.. ఇదంతా నిన్నటి మాట. బాలయ్య బాధితుల సంఖ్య పెరిగిపోతుండటం, అభివృద్ధికి ఆమడ దూరం. సమస్యలు చెప్పుకునేందుకు కూడా భయపడే జనం ఇదీ నేటి పరిస్థితి. ఎప్పుడో చుట్టపుచూపుగా వచ్చే బాలయ్య ఎన్నికల వేళ హిందూపురంలో తిష్టవేశాడు. ప్రచారం హోరెత్తించాలనుకున్నాడు. కానీ జన స్పందన లేక ఉసూరుమంటున్నాడు. ఇంత ఎండలో నేనే వచ్చినా...సినిమా డైలాగ్ చెప్పినా జనం రాకపోవడమేమిటంటూ లోలోన రగిపోతున్నాడు..అందుకే ఎవరైనా ఎదురు ప్రశ్నిస్తే చాచి కొట్టేస్తున్నాడు.
అంతా సినిమా టైపు రాజకీయం
బాలకృష్ణ సినిమా తరహాలోనే రాజకీయం చేస్తున్నారు. ప్రజాప్రతినిధిగా ఎన్నికైనా ఫుల్‌టైం సినిమాలకే పరిమితం మవుతూ..చుట్టపుచూపుగా హిందూపురం వచ్చి వెళ్తున్నారు. ఓట్లేసిన ప్రజలకు న్యాయం చేయలేకపోయారు. అందుకే హిందూపురం నియోజకవర్గంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోయాయి. సినిమా హీరోగా తనవృత్తికి న్యాయం చేసినట్లు ప్రజాసేవకుడిగా రాణించలేక పోయాడని పురం ప్రజలు విమర్శిస్తున్నారు.
బాలయ్యకు విగ్ కష్టాలు
బాలకృష్ణ మరో రెండేళ్లలో షష్టిపూర్తి చేసుకోనున్నారు. కానీ సినిమా హీరో...ఆ ఇమేజ్ మ్యానేజ్ చేసేందుకు నిత్యం విగ్గులోనే కనిపిస్తారు. తనదగ్గరికి ఎవరైనా వచ్చినా..పూలమాల వేసేందుకు గుంపులుగా జనం వచ్చినా విగ్గు జారిపోతుందని భయపడుతుంటారు. అందుకే అనుమతిలేనిదే ఎవరినీ దగ్గరకు రానివ్వరు. ఎవరైనా దగ్గరగా వచ్చినా తాకకూడదు..కాదు కూడదని తాకితే తనదైన శైలిలో వారికి బహుమానం ఇస్తారు. ఎవరైనా సరే సినిమాలో హీరోలా అలా దూరం చేసి నమస్కారం పెట్టి పోవాలి. అదీ బాలయ్య స్టైల్. కానీ జనం ఇవేవీ తెలియక మా ఎమ్మెల్యే నంటూ దగ్గరకు వెళ్లి ఆయన హస్తముద్ర వేయించుకుంటుంటారు.
ఐదేళ్లలో 20 సార్లులోపే
హిందూపురం నుంచి 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందిన బాలకృష్ణ...ఈ ఐదేళ్ల కాలంలో 20సార్లులోపే నియోజకవర్గంలో పర్యటించారు. వచ్చినప్పుడల్లా రెండు లేదా మూడు రోజుల రూట్‌మ్యాప్‌తో మూడు మండలాల్లో వివిధ పనుల ప్రారంభోత్సవాలు, భూమిపూజలు, రోడ్డుషోలతో సరిపెట్టెశారు. ఎన్నికల సమయంలో సతీసమేతంగా హిందూపురంలో ఓ ఇంటిలో గృహప్రవేశం చేసి తాను ఇక్కడే ఉంటానని ప్రజలను నమ్మించారు. ఆయన భార్య వసుంధర కూడా గత ఎన్నికల సమయంలో ప్రజలకు కనిపించి మాయమయ్యారు. మళ్లీ ఇపుడు ప్రచారం కోసం హిందూపురం వచ్చారు.
ఈ మధ్యలో బాలయ్య పీఏలే పాలన సాగించారు. టీడీపీ సీనియర్లను పక్కనపెట్టి అందిన కాడికి దోచుకున్నారు. దీంతో కొందరు సీనియర్ నాయకులు తిరుగుబాటు చేశారు. దీంతో వ్యవహార శైలి మార్చుకోవాల్సిన బాలకృష్ణ...పీఏను మార్చేసి తన సినిమా లోకంలోకి వెళ్లిపోయారు. ఇలా ముగ్గురు పీఏలను మార్చినా...వారంతా తమ స్వార్థమే చూసుకున్నారు. ఇలా ఐదేళ్లు గడిచిపోయింది. ప్రజలకు తమ ఎమ్మెల్యేను కలిసే భాగ్యమే లేకపోయింది. అప్పుడెప్పుడో 2016లో ప్రజాదర్బార్ అంటూ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి కుప్పలు తెప్పలుగా వచ్చిన సమస్యల అర్జీలు స్వీకరించారు. ఏటా ఇలాగే నిర్వహిస్తామని ప్రకటించి అంతటితో సరిపెట్టారు. అర్జీలకు అతీగతీ లేకుండా పోయింది. దీంతో జనమే కాదు...టీడీపీ నేతలే బాలయ్యపై గుర్రుగా ఉన్నారు.
అంతర్మథనంలో బాలకృష్ణ
భారీ సినిమా డైలాగ్‌లు చెబుతున్నా...జనం నుంచి స్పందన లేదు. రోజుకో ముఖ్య నేత పార్టీ వీడుతున్నారు. దీంతో బాలకృçష్ణకు ఓటమి భయం పట్టుకుంది. వైఎస్సార్సీపీకి వస్తున్న ప్రజాదరణ చూసి లోలోన మదన పడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తన సత్తా చాటేందుకు బాలయ్య నామినేషన్ సందర్భంగాన్ని ఉపయోగించుకోవాలనుకున్నారు. పెనుగొండ, మడకశిర ప్రాంతాల నుంచి డబ్బులిచ్చి జనాలను తీసుకొచ్చి పరువు కాపాడుకోడానికి నానా తంటాలు పడ్డారు.
అయితే అదే రోజు వైఎస్సార్సీపీ అభ్యర్థి మహమ్మద్ ఇక్బాల్ నామినేషన్‌కు అంతకు రెట్టింపులో ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడంతో కంగుతిన్నారు. ఇక ఓటమి తప్పదనే భావనకు వచ్చినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ చివరి ప్రయత్నంగా గెలుపు కోసం విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేయడం, పట్టణ రహదారుల్లో హడావుడిగా మరమ్మత్తులు, రంగులు వేయించడం, గ్రామాల్లో బోర్లు వేయించడం వంటివి చేస్తూ ఓటర్లను ప్రలోభాపెట్టేందుకు నానా అగచాట్లు పడుతున్నారు.
పెరిగిన వలసలు
బాలకృష్ణ వ్యవహారశైలితో టీడీపీ బలంగా ఉన్న మండలాలైన లేపాక్షి, చిలమత్తూరుల్లో కూడా వలసలు పెరిగాయి. కీలమైన నేతలంతా వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. దీంతో నేరుగా రంగంలో దిగిన బాలకృష్ణ నేతలను బతిమాలి పార్టీలో నిలిచేటట్లు ప్రయత్నిస్తున్నారు. అయినా చిలమత్తూరు, లేపాక్షి మండలాల నుంచి ఇప్పటికే బలమైన బీసీ, మైనార్టీ నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరిపోయారు. దీంతో ఈ రెండు మండలాల్లో వైఎస్సార్‌సీపీ మెజారిటీ వైపు దూసుకుపోతోంది. బాలకృష్ణ ఐదేళ్లు బాగా పనిచేసి ఉంటే ఇంత కష్టపడాల్సిన పని ఉండేదికాదని ప్రజలే చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment