సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్రంలో ఎన్నికలు అనగానే భారతీయ జనతా పార్టీకి సూపర్‌స్టార్ రజనీకాంత్ గుర్తుకొస్తారు. అయితే ఈసారి వారితోపాటూ అన్నాడీఎంకే సైతం తలైవా..రావా అని ఆహ్వానిస్తోంది. మద్దతు లేదా మాట కోసం ప్రయత్నాలు చేస్తోంది. అన్నాడీఎంకే ఎన్నికల ప్రచారం అనగానే అందరికీ జయలలిత కళ్లముందు మెదులుతారు. అమ్మ కన్నుమూసిన తరువాత అన్నాడీఎంకే తొలిసారిగా ఎన్నికలను ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కారణం ఆ ప్రతిష్ట నిలబడాలంటే లోక్‌సభ, ఉపఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలువకతప్పదు. ఎన్నికల ప్రచార నిమిత్తం పార్టీ ప్రధాన రథసారథులు ఎడపాడి పళినిస్వామి, పన్నీర్‌సెల్వం చెరోవైపు రాష్ట్రాన్ని చుడుతున్నారు.
అయితే ప్రచార రథంలో జయలలిత లేని లోటు కొట్టొచ్చినట్లు కనపడుతోంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తిరుగులేని చరిష్మా కలిగిన నేత అన్నాడీఎంకేలో కరువయ్యారు. అయితే పార్టీకీ, ప్రభుత్వానికి పూర్వవైభవం కరువైన తరుణంలో డీఎంకే–కాంగ్రెస్ కూటమిని దీటుగా ఎదుర్కొనాలంటే ఆదనపు ఆకర్షణ తప్పదనే విషయం అన్నాడీఎంకే అదనపు బలం తప్పదని అన్నాడీఎంకేకు మొదట్లోనే అర్థమైంది.
అందుకే బీజేపీ, ఎండీఎంకే, పీఎంకే, పుదియ తమిళగం, తమాకా, ఎన్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలతో కూటమిగా ఏర్పడింది. కూటమికి నాయకత్వం వహిస్తున్న ఈపీఎస్, ఓపీఎస్‌లపై తమ పార్టీ అభ్యర్థులనే కాదు, మిత్రపక్షాల అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత పడింది. అడపాదడపా మిత్రపక్ష పార్టీల కోసం ఎడపాడి, ఓపీఎస్ సైతం గళం విప్పుతున్నారు. పీఎంకే తరపున రాందాస్, డీఎండీకే అభ్యర్థుల కోసం ఆ పార్టీ కోశాధికారి ప్రేమలత ప్రచారం చేస్తున్నారు. ఇక బీజేపీ తమకు కేటాయించిన స్థానాలకే పరిమితమై ఎవరికి వారుగా కూడా ప్రచారం చేసుకుంటున్నారు.
ప్రధాని మోదీ, అమిత్‌షాల పర్యటన ఇంకా ఖరారు కాలేదు. అమ్మ లేని లోటు కొట్టొచ్చినట్లు కనపడుతుండగా ఎన్నికలను సునాయాసంగా అధిగమిస్తామనే నమ్మకం అన్నాడీఎంకేలో లేకుండా పోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఎన్నికల్లో ఫలితాలు తారుమారు కావడం ఖాయమనే భయం అన్నాడీఎంకే నేతల్లో పట్టుకుంది. దీంతో రాష్ట్రంలోని అన్ని స్థానాలను ప్రభావితం చేయగల జనాకర్షక నేత ఎవరబ్బా అని ఆలోచనలో పడిన నేతలకు సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పురించారు. బహిరంగంగా మద్దతు ప్రకటించడం లేదా ‘వాయిస్’ ఇవ్వడం ద్వారా ప్రజలను ప్రభావితం చేయడానికో రజనీని ఒప్పించాలని పట్టుదలతో ఇక ఆలస్యం చేయకుండా తెరవెనుక ప్రయత్నాలు ప్రారంభించారు.
మొదటి నుంచి స్నేహపూరిత సత్సంబంధాలను నెరపుతున్న బీజేపీ నేతలు ముందుగా రజనీతో చర్చలు ప్రారంభించింది. అలాగే అన్నాడీఎంకే తరఫున రజనీ స్నేహితులైన కేంద్ర, రాష్ట్ర మంత్రులు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. నదుల అనుసంధానానికి ప్రాధాన్యత కల్పించే పార్టీలకు ఓటు వేయాల్సిందిగా అభిమానులకు రజనీకాంత్ గతంలో సూచించారు. ఆ నినాదానికి అనుగుణంగా అన్నాడీఎంకే ఎన్నికల మేనిఫెస్టోలో నదుల అనుసంధానం అంశాన్ని చేర్చింది. కొన్నిరోజుల తరువాత అన్నాడీఎంకే విడుదల చేసిన అదనపు మేనిఫెస్టోలో కావేరీ–గోదావరి అనుసంధానంపై వెంటనే ప్రయత్నాలు ప్రారంభిస్తామని స్పష్టం చేసింది.
రజనీ ఆశయాలకు అనుగుణంగా అన్నాడీఎంకే మేనిఫెస్టో ఉన్న అంశాలను అవకాశంగా చేసుకుని మద్దతు లేదా కనీసం వాయిస్ అయినా రజనీకాంత్ నుంచి రాబట్టాలని ఆశిస్తున్నారు. పార్టీ పక్షాన నేరుగా నిలవకున్నా..మేనిఫెస్టోలో నదుల అనుసం«ధానాన్ని స్వాగతిస్తున్నా, ప్రధాని మోదీ గురించి రెండు మంచి మాటలు చెబితే చాలు ఇక మేము చూసుకుంటామనే రీతిలో అన్నాడీఎంకే ఆశిస్తోంది.
వచ్చేనెల 10వ తేదీన రజనీకాంత్ కొత్త చిత్రం షూటింగ్ ముంబైలో ప్రారంభం కానుంది. అన్నాడీఎంకే కూటమి కోసం ఆయన ‘మాట’ సాయం చేయదలిస్తే ఈలోగానే చేయాలి. కొట్టంగా కొట్టంగా కొండరాయి కూడా కొంచెం జరుగుతుందనే తీరులో కోరంగా కోరంగా రజనీలో మార్పువస్తుందని ఆశపడుతున్నారు. రజనీకాంత్ మద్దతు కోసం కమల్‌హాసన్ బహిరంగంగానే ప్రయత్నించి భంగపడ్డారు. మరి అన్నాడీఎంకే ప్రయత్నాలు ఎంతమాత్రం ఫలిస్తాయో వేచిచూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment