కథ క్లైమాక్స్‌కు
♦ చిన్నమ్మను సాగనంపేందుకు 12న ముహూర్తం
♦ అన్నాడీఎంకే పార్టీ సమావేశంలో కీలక నిర్ణయం
♦ న్యాయనిపుణులతో దినకరన్
అన్నాడీఎంకే కథ క్లయిమాక్స్‌కు చేరుకుంది. పార్టీకి తలవంపులు, తలనొప్పులుగా మారిన శశికళ, దినకరన్‌ల శిరోభారాన్ని దించుకునేందుకు ముహూర్తం ఖరారైంది. వచ్చేనెల 12వ తేదీన పార్టీ కార్యవర్గ, సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాలని సీఎం ఎడపాడి నిర్ణయం తీసుకున్నారు. శశికళ స్థానంలో ప్రధాన కార్యదర్శిని ఎంపిక చేసుకోవడమే ఈ సమావేశ ప్రధాన ఉద్దేశమని ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: శశికళ చలవ వల్లనే సీఎం అయిన ఎడపాడికి అదే వ్యక్తి వల్ల చిక్కులు మొదలయ్యాయి. జైలుకెళ్లే ముందు తన ప్రతినిధిగా నియమించిన ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ సీఎం ఎడపాడి పాలిట కొరకరాని కొయ్యగా మారారు. పార్టీకే పరిమితం కాకుండా ప్రభుత్వాన్ని సైతం కూల్చివేసేందుకు దినకరన్ పూనుకోవడంతో ఇక లాభం లేదనుకుని ఎడపాడి, పన్నీర్ కలిసి కొరడా ఝుళిపించారు. ప్రభుత్వాన్ని కూల్చివేసే దిశగా దినకరన్ వేగం పెంచడంతో అప్రమత్తమైన ఎడపాడి వారిని బహిష్కరిస్తూ సోమవారం జరిగిన అన్నాడీఎంకే సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే, వారి స్వాధీనంలో ఉన్న నమదు ఎంజీఆర్ దినపత్రిక, జయ టీవీని స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని తీర్మానించారు.
సీఎం ఎడపాడి అధ్యక్షతన చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నిర్వాహకులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శశికళ, దినకరన్‌లను దెబ్బతీయడమే లక్ష్యంగా నాలుగు తీర్మానాలు చేశారు. గవర్నర్‌కు లేఖ ఇచ్చిన 19 మంది ఎమ్మెల్యేలను పార్టీ పదవుల నుంచి తొలగించి శశికళ, దినకరన్‌లపై శాశ్వత వేటు వేయాలని ఎడపాడి వర్గం నిర్ణయం
తీసుకుంది.
పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకాన్నే ఎన్నికల కమిషన్ నిర్ధారించని పరిస్థితుల్లో ఆమె నియమించిన దినకరన్ ఉప ప్రధాన కార్యదర్శి కానేరడు, ఆయన నియామకాలు, తొలగింపులు చెల్లవు. కాబట్టి జయలలిత నియమించిన వారే ఆయా పదవుల్లో కొనసాగుతారని తీర్మానించారు. జయ టీవీ, నమదు ఎంజీఆర్ దినపత్రికలను చట్టపరంగా స్వాధీనం చేసుకోవాలని తీర్మానించారు. ఈనెల 12వ తేదీన పార్టీ కార్యవర్గ, సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంజీ రామచంద్రన్, పార్టీని బలోపేతం చేసిన జయలలిత బాటలో నడవాలని తీర్మానించారు.
పెరుగుతున్న దినకరన్ బలం
ఎడపాడి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్లుగా 19 మంది దినకరన్ వర్గ ఎమ్మెల్యేలు తమిళనాడు ఇన్‌చార్జ్ గవర్నర్ విద్యాసాగర్‌రావుకు లిఖితపూర్వకంగా అందజేశారు. కాగా మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా చేరడంతో సోమవారం నాటికి దినకరన్ బలం 23 కు చేరుకుంది. శశికళ, దినకరన్‌లకు వ్యతిరేకంగా మాట్లాడినవారిపై వేటు తప్పదని దినకరన్ వర్గం హెచ్చరిస్తోంది. ఇంతవరకు ఐదుగురు మంత్రులను పార్టీ పదవుల నుంచి తొలగించగా, పార్టీ కార్యదర్శి పదవి నుంచి సీఎం ఎడపాడిని తొలగిస్తున్నట్లు ఆదివారం రాత్రి దినకరన్ ప్రకటించడం కలకలం రేపింది.
అలాగే మంత్రులు తంగమణి, వేలుమణిలను కూడా పార్టీ నుంచి దినకరన్ సోమవారం తొలగించారు. కాగా, ఎడపాడి సోమవారం నిర్వహించిన సమావేశానికి 113 మందిలో 83 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరు కావడం గమనార్హం. గైర్హాజరైన 30 మంది దినకరన్ వైపు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అలాగే ఇద్దరు ఎంపీలు కూడా రాలేదు. అన్నాడీఎంకేని బీజేపీలో నూరుశాతం విలీనం చేశారని దినకరన్ వర్గ ఎమ్మెల్యే తంగతమిళ్ సెల్వన్ వ్యాఖ్యానించారు.
దిష్టిబొమ్మల దహనం
పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశం జరుగుతుండగా ఎడపాడి వర్గీయులు దినకరన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అలాగే మదురై జిల్లా మేలూరులో సీఎం ఎడపాడి, పన్నీర్‌సెల్వం దిష్టిబొమ్మలను దహనం చేయడంతో వందమందిని అరెస్ట్ చేశారు.
నేడు ఢిల్లీకి వైరి వర్గాలు
సీఎం ఎడపాడి, దినకరన్ వర్గ ఎమ్మెల్యేల మధ్య రాజకీయ యుద్ధం సాగుతుండగా, ఇరుపక్షాలు మంగళవారం ఒకేసారి ఢిల్లీకి చేరుకుంటున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకంపై ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన లేఖను వాపస్ తీసుకునేందుకు సీఎం ఎడపాడి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం సహా ఐదుగురితో కూడిన మంత్రుల బృందం మంగళవారం ఢిల్లీకి వెళుతోంది. అలాగే రాష్ట్రపతిని కలిసి ఎడపాడి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరేందుకు దినకరన్ వర్గ ఎమ్మెల్యేలు సైతం మంగళవారం ఢిల్లీ విమానం ఎక్కనున్నారు.
శశికళను బహిష్కరిస్తే పార్టీనే ఉండదు
శశికళను బహిష్కరిస్తే పార్టీనే ఉండదు జాగ్రత్త అంటూ ఎమ్మెల్యే బోస్ ఎడపాడిని హెచ్చరించారు. దినకరన్ వర్గ ఎమ్మెల్యేలు పుదుచ్చేరిలో క్యాంప్ పెట్టి సోమవారానికి ఏడు రోజులైంది. ఏ వర్గంలో చేరాలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే కరుణాస్ తదితర ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఎడపాడి ప్రయత్నాలను చట్టపరంగా ఎదుర్కొనేందుకు దినకరన్ న్యాయనిపుణులతో సమావేశం అయ్యారు. ఎడపాడి, టీటీవీ దినకరన్ ఎవరికి వారు బహిష్కరణలు, నియామకాలు సాగించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇద్దరు జిల్లా కార్యదర్శులు, ఇద్దరు రాష్ట్ర కార్యనిర్వాహకులుగా తయారయ్యారు.
మరోసారి పేరు మార్పు
అన్నాడీఎంకే రెండుగా చీలడం వల్ల ఎన్నికల కమిషన్ నిషేధం విధించడంంతో ఎడపాడి వర్గం ‘అన్నాడీఎంకే (అమ్మ)’ అని, పన్నీర్‌సెల్వం వర్గం ‘అన్నాడీఎంకే పురట్చితలైవి అమ్మ’ అని పేరు పెట్టుకున్నారు. ఈ రెండు వర్గాలు ఇటీవల ఏకం కావడంతో అన్నాడీఎంకే (అమ్మ, పురట్చి తలైవి అమ్మ) అని పేరు మార్చుకున్నట్లుగా పార్టీ లెటర్‌హెడ్‌ల ద్వారా వెల్లడైంది.