‘అమ్మ’ చెంతకు ఫిర్యాదులు
అన్నాడీఎంకే నాయకుల్లో గుబులు పట్టుకుంది. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులు నేరుగా పోయెస్ గార్డెన్‌కు వెళ్లడమే ఇందుకు కారణం. ఇది వరకు వీటిని ఫిర్యాదుల కమిటీ విచారించేది. ప్రస్తుతం అధినేత్రి జయలలిత చెంతకు వెళ్లడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని నేతలు ఆందోళన చెందుతున్నారు.
సాక్షి, చెన్నై: పార్టీలో గానీ, ప్రభుత్వంలో గానీ చిన్న తప్పు చేసినా, ఆరోపణలు వచ్చినా వారికి ఉద్వాసనలు పలికే రీతిలో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నిర్ణయాలు తీసుకోవడం సహజం. అయితే, గత ఏడాది పార్టీ పరంగా నాయకులు, కార్యకర్తల నుంచి వచ్చిన ఫిర్యాదుల్ని విచారించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. రాయపేటలోని పార్టీ కార్యాలయానికి వచ్చే ప్రతి ఫిర్యాదునూ ఈ కమిటీ పరిశీలించి నివేదిక రూపంలో జయలలితకు ఇవ్వడం జరుగుతూ వచ్చింది.
ఈ కమిటీలో మంత్రులు గోకుల ఇందిర, ఉదయకుమార్, నేతలు సెల్వరాజ్, కుమార్‌ను సభ్యులుగా నియమించారు. ఇన్నాళ్లూ ఈ కమిటీ అన్ని ఫిర్యాదుల్ని పరిశీలించి, నివేదిక రూపంలో జయలలితకు సమాచారం అందించేది. అయితే, జయలలితకు జైలు శిక్ష పడ్డ నేపథ్యంలో ఎక్కడి ఫిర్యాదులు అక్కడే అన్న చందంగా పడి ఉండడం వెలుగులోకి వచ్చింది. మంత్రులు ఇద్దరు ప్రభుత్వ కార్యక్ర మాల్లో బిజీగా ఉండడం, మిగిలిన ఇద్దరు తమ ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాల్లో బిజిబిజీగా ఉండడంతో ఫిర్యాదులు అన్నాడీఎంకే కార్యాలయంలో పేరుకు పోయినట్టు సమాచారం.
అమ్మ చెంతకు
పార్టీ కార్యాలయంలో పేరుకుపోయిన ఫిర్యాదులు పోయేస్ గార్డెన్‌కు చేరినట్టుంది. పార్టీ కార్యాలయానికి తాను వెళ్లలేని పరిస్థితి ఉన్నందున, ఆ ఫిర్యాదుల్ని పోయేస్ గార్డెన్‌కు జయలలిత తెప్పించుకునే పనిలో పడ్డట్టు వచ్చిన సంకేతాలు అన్నాడీఎంకే వర్గాల్లో గుబులు రేపుతున్నాయి. జయలలిత శిక్ష నేపథ్యంలో కొందరు నేతలు పార్టీ కార్యాక్రమాలకు దూరంగా, నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించి ఉండడంతో అట్టి వారిపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అదే సమయంలో గతంలో విధించిన కమిటీ కొన్ని చిన్న చిన్న తప్పుల్ని చూసీచూడనట్టు వ్యవహరించిన సందర్భాలు ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
తాజాగా ఫిర్యాదులు అన్నీ అమ్మ చెంతకు చేరడం, ఆమె వాటన్నింటినీ నిశితంగా పరిశీలిస్తుండడంతో మరింత ఆందోళన బయలుదేరింది. జయలలిత కారాగారంలో ఉన్న సమయంలో కొందరు నేతలు తమ రాజకీయ ఉనికి కాపాడుకునేందుకు చాప కింద నీరులా కొత్త ప్రయత్నాలు చేసినట్టు, మరి కొందరు జయలలిత నెచ్చెలి శశికళ బంధు వర్గానికి దగ్గరగా వెళ్లినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇదే విషయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు సీఎం పన్నీరు సెల్వం ద్వారా జయలలిత దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. అలాంటి ప్రయత్నాలు చేసిన నేతల్లో మరింత ఆందోళన బయలుదేరింది.