విచారణకు వస్తున్న దివాకరన్
అమ్మ జయలలిత 2016 డిసెంబర్ నాలుగో తేదీనేమరణించినట్టు తనకు సమాచారం వచ్చిందని అమ్మ శిబిరం నేత, చిన్నమ్మ శశికళసోదరుడు దివాకరన్ వ్యాఖ్యానించారు. రెండుసార్లు మాత్రమే తాను అపోలోకువెళ్లానని వివరించారు. అమ్మ మరణంతదుపరి సీఎం పదవి కోసం గట్టి పోటీనే సాగిందని, చివరకు పన్నీరుకే పగ్గాలుఅప్పగించారన్నారు.
సాక్షి, చెన్నై : జయలలిత మరణం మిస్టరీని నిగ్గు తేల్చేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి కమిషన్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ కమిషన్ విచారణను వేగవంతం చేసింది. జయలలితకు సన్నిహితంగా ఉన్న ఏ ఒక్కరినీ వదలి పెట్టకుండా విచారణ సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఈ విచారణకు జయలలిత నెచ్చలి శశికళ సోదరుడు దివాకరన్ హాజరయ్యారు. న్యాయమూర్తి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తన వద్ద ఉన్న వివరాలను కమిషన్ ముందు ఉంచారు.
అప్పటికే అమ్మ లేరని సమాచారం
విచారణ అనంతరం మీడియాతో దివాకరన్ మాట్లాడారు. విచారణ కమిషన్ ముందు తాను ఉంచిన వివరాలనుపేర్కొన్నారు. జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన తర్వాత తాను రెండుసార్లు మాత్రమే అపోలోకు వెళ్లానన్నారు. ఓ సారి తాను రాత్రి 11 గంటల సమయంలో వెళ్లానని, అప్పటికే అమ్మ నిద్ర పోవడంతో చూడలేదని వ్యాఖ్యానించారు. మరో మారు డిసెంబరు నాలుగో తేదీ తనకు అందిన సమాచారంతో విమానంలో చెన్నైకి చేరుకున్నానన్నారు. ఆరోజునే అమ్మ మరణించినట్టుగా సమాచారం తనకు వచ్చిందన్నారు. అయితే, ఆస్పత్రికి వెళ్లగా అక్కడ ఎక్మో చికిత్స అంటూ పరికారాల్ని అమర్చి ఉన్నారన్నారు. ఆ రోజున తాను పది గంటలకు అపోలకు వచ్చానన్నారు. దాదాపు అమ్మ ఇక లేరన్నది ఆ రోజునే స్పష్టమైనట్టు, అనేక టీవీ చానళ్లు సైతం ఫ్లాస్ న్యూస్‌లు వేసి, ఆ తదుపరి వెనక్కు తీసుకున్నాయన్నారు.
సీఎం పదవికోసం గట్టి పోటీ
అమ్మ మరణంతో సీఎం పదవి కోసం మంత్రుల మధ్య గట్టి పోటీనే సాగిందన్నారు. తమ కంటే తమకు ఆ పదవి కావాలని పట్టుబట్టిన వాళ్లూ ఉన్నారని, చివరకు పన్నీరు సెల్వంను ఆ కుర్చీలో కూర్చోబెట్టారన్నారు. వాళ్లు ఎవరో అన్న విషయాన్ని పన్నీరునే అడగాలని, చికిత్సకు సంబం«ధించి, ఇతర వివరాలను ఆయన్నే అడగండి అంటూ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment