Divakaran
-
శశికళ సోదరుడి సొంత పార్టీ.. ‘ఏడీకే’
మన్నార్గుడి: ఏఐఏడీఎంకే బహిష్కృత నేత వి.కె.శశికళ కుటుంబం నుంచి మరో రాజకీయ పార్టీ ఏర్పాటైంది. శశికళ సోదరుడు వి.దివాకరన్ ఆదివారం కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. ఇప్పటికే శశికళ కుటుంబానికి చెందిన ఆర్కేనగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం(ఏఎంఎంకే) పార్టీని స్థాపించారు. దినకరన్‌పై తీవ్ర విమర్శలు చేసిన దివాకరన్‌కు గత నెలలో శశికళ లీగల్ నోటీసులిచ్చారు. బహిరంగ సభల్లో తన పేరు వాడుకోరాదని అందులో హెచ్చరించారు. శశికళను ప్రస్తావించాల్సినప్పుడు సోదరిగా చెప్పుకోబోననీ, ‘తన మాజీ సోదరి’అని మాత్రమే అంటానని దివాకరన్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆయన ‘అన్న ద్రవిడార్ కళగం (ఏడీకే)’పార్టీని ఏర్పాటు చేశారు. ‘అన్నా’అని అందరూ పిలుచుకునే ద్రవిడ నేత సీఎన్ అన్నాదురై పేరుతో ఈ పార్టీని స్థాపించినట్లు ప్రకటించారు. -
తమిళనాడులో మరో కొత్త పార్టీ
చెన్నై : తమిళనాడులో కొత్త పార్టీలకు కొదవలేకుండా పోతుంది. తాజాగా శశికళ సోదరుడు దివాకరన్ కొత్త రాజకీయా పార్టీని స్థాపించారు. గతంలో అన్నాడీఎంకే నుంచి బయటికిచ్చిన శశికళ వర్గం నాయకుడు దినకరన్ పెట్టిన అమ్మ మక్కల్ మున్నెట్రా కదగజం పార్టీలో ఉన్న దివాకరన్ ఇప్పుడు ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుని ‘అమ్మ అని’ అనగా ‘అమ్మ జట్టు’ అనే కొత్త పార్టీని నెలకొల్పారు. తెలుపు, నలుపు, ఎరుపు, మధ్యలో ఆకుపచ్చ వర్ణాలతో పార్టీ జెండాను ఆదివారం చెన్నైలో ఆవిష్కరించారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం అనంతరం తమిళనాడలో ఇప్పటికే దినకరన్, ప్రముఖ సినీ నటుడు కమల్‌హాసన్‌లు కొత్త పార్టీలను స్థాపించిన సంగతి తెలిసిందే. అలాగే గతంతో జయలలిత మేనకోడలు దీప కూడా ఎంజీఆర్ అమ్మ దీప పేరవాయి పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. సుపర్‌స్టార్ రజనీకాంత్ కూడా రాజకీయ పార్టీ పడతానని ప్రకటించారు. కేవలం జయ మరణం కారణంగానే తమిళనాడులో ఇన్ని రాజకీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయని రాజకీయ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. -
ఇక.. అక్క కాదు!
సాక్షి, చెన్నై : ‘‘ఇక శశికళను అక్కా అని పిలవను.. ఆమె మాజీ సహోదరి మాత్రమే.. అమ్మ జయలలిత హత్యకు మూడుసార్లు ప్రయత్నాలు జరిగాయి. ఆమెను రక్షించింది నేనే.. ఆ ఇద్దరి వల్లే మా కుటుంబానికి మన్నార్ కుడి మాఫియా అనే పేరు వచ్చింది’’ అంటూ అమ్మ శిబిరం నేత దివాకరన్ సోమవారం తీవ్రంగా స్పందించారు. ఎవరికీ తాను భయపడను అని, రాజకీయంగా తగ్గే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. చిన్నాభిన్నంగా ఉన్న అన్నాడీఎంకేని ఒకే వేదిక మీదకు తీసుకొచ్చే దిశగా రాజకీయ పయనం సాగించబోతున్నట్టు ప్రకటించారు. దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశి కళ కుటుంబంలో బయలుదేరిన సమరం ముదిరి పాకాన పడింది. తన సోదరుడు దివాకరన్, అక్క వనితామణి కుమారుడు దినకరన్ మధ్య సాగుతున్న సమరంలో చిన్నమ్మ తీసుకున్న నిర్ణయం కుటుంబాన్ని రెండుగా చీల్చేసింది. తనకు వ్యతిరేకంగా శశికళ తీసుకున్న నిర్ణయంతో సోదరుడు దివాకరన్ షాక్‌కు గురయ్యారు. ఇక, ఆ కుటుంబం వేరు, తన కుటుంబం వేరు అని ప్రకటిస్తూ, శశికళను అక్క అని పిలవబోనని వ్యాఖ్యల తూటాల్ని పేల్చే పనిలో నిమగ్నం అయ్యారు. ఇక, తెగ తెంపులు మన్నార్‌కుడిలో తన మద్దతుదారులతో సమావేశం అనంతరం దివాకరన్ సోమవారం మీడియా ముందుకు వచ్చారు. న్యాయవాది ద్వారా నోటీసు పంపించి దినకరన్ బ్లాక్ మెయిల్ రాజకీయాల్లో నిమగ్నం అయ్యారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కుటుంబ వివాదంలోకి మూడో వ్యక్తిని పంపించి ఆట మొదలెట్టారని, ఈ ఆటను రక్తికట్టించేందుకు తాను సిద్ధంగానే ఉన్నట్టు సవాల్ విసిరారు. శశికళ, దినకరన్‌లతో ఇక, తనకు ఎలాంటి సంబంధం లేదని, వారితో తెగదెపులు చేసుకుంటున్నట్టు ప్రకటించారు. శశికళ ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని, అందుకే ఇక, ఆమెను అక్క అని పిలవకూడదని నిర్ణయించినట్టు తెలిపారు. దివంగత ఎంజీఆర్, అమ్మ జయలలితల మార్గదర్శకంలో తన రాజకీయ పయనం సాగుతుందన్నారు. దీనిని అడ్డుకునే రీతిలో ఎవరు వ్యవహరించినా.. అది శశికళ అయినా సరే, తిప్పి కొడుతానని హెచ్చరించారు. శశికళ ఫొటోలతో ఫ్లెక్సీలు వద్దని తాను ఎప్పుడో మద్దతుదారులకు తెలియజేశానని, అయితే, అత్యుత్సాహంతో కొందరుమాజీ సహోదరి ఫొటోలను వాడేశారని వ్యాఖ్యానించారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా దినకరన్ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తొలుత ఓపీఎస్‌ను(డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం), ఆ తదుపరి ఈపీఎస్(సీఎం పళని స్వామి)ని శశికళకు దూరం చేశాడని, ఇప్పుడు తనను కూడా దూరం చేయించాడని శివాలెత్తారు. రోగం ముదిరింది సీఎం కావాలన్న ఆశతో దినకరన్ పగటి కలలు కంటూ, చివరకు మానసిక రోగి అయ్యాడని ఎద్దేవాచేశారు. నోటీసు అందుకున్న తాను, ఆగ్రహం తో శశికళకు వ్యతిరేకంగా తీవ్ర పదాల్ని, తీవ్ర ఆరోపణల్ని గుప్పిస్తానని దినకరన్ అనుకుని ఉంటాడని మండిపడ్డారు. అయితే, తాను అలాం టి పదాల్ని, ఆరోపణల్ని గుప్పించదలచుకోలేదని స్పష్టంచేశారు. అయితే, ఎన్నికల సమయంలో శశికళ పార్టీకి దినకరన్ ఉప ప్రధాన కార్యదర్శిగా ఉన్న పక్షంలో తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పించి తీరుతానని తెలిపారు. తానేదో కేంద్రం ఆడిస్తున్నట్టుగా ఆడుతున్నట్టు దినకరన్ ఆరోపిస్తున్నాడని, వాస్తవానికి కేంద్రం అడుగులకు మడుగులొత్తుతున్నది అతడే అని ధ్వజమెత్తారు. ఆ పేరుతో మనోవేదన జయలలితకు దత్తపుత్రుడిగా తెరమీదకు వచ్చిన సుధాకరన్, దినకరన్ రూపంలో మన్నార్ కుడి మాఫియా అన్న పేరును తమ కుటుంబం మూటగట్టుకోవాల్సి వచ్చిందని వివరించారు. ఆ పేరును తలచుకున్నప్పుడల్లా తాను తీవ్ర మనోవేదనకు లోనయ్యే వాడినని వ్యాఖ్యానించారు. శశికళకు తమ్ముడిగా ఉన్న ఒకే ఒక కారణంతో తానే కాదు, తన సన్నిహితులూ పలుమార్లు ఐటీ దాడుల్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. 33 సంవత్సరాలుగా మన్నార్‌కుడి మాఫియాకు తానేదో నేతృత్వం వహిస్తున్నట్టుగా అపవాదును భరించాల్సి వచ్చిందని ఉద్వేగానికి లోనయ్యారు. మన్నార్‌కుడిలో తానుక్కొడే ఉన్నానని, ఇతర కుటుంబీకులు ఎవరూ లేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. సైదైతోనే విత్తనం అన్నాడీఎంకే అన్న పేరుకు విత్తనం వేసిన వ్యక్తి సైదై దురై స్వామి అని వ్యాఖ్యానించారు. సత్య స్టూడియోలో ఎంజీఆర్‌ను కలిసి ఆ పేరును విత్తింది ఆయనే అని ఈసందర్భంగా పేర్కొన్నారు. ఇంకా చెప్పాలంటే, జయలలితను హతమార్చేందుకు మూడుసార్లు ప్రయత్నాలు జరిగా యని ఆరోపించారు. ఆ ప్రయత్నాల్ని తిప్పికొట్టి జయలలితను రక్షించింది తానేనని పేర్కొన్నారు. హతమార్చేందుకు ప్రయత్నించిందెవరో ..? అని ప్రశ్నించగా, దాటవేస్తూ, శశికళ కుటుంబం నుంచి తనను దూరం పెట్టినందుకు ఆనందంగా ఉందన్నారు. ఇక, రక్త సంబంధీకులు మాత్రమే తనతో ఉన్నారని, ఉంటారని వ్యాఖ్యానించారు. శశికళకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించేశామని, ఆమె తమకు చుట్టం మాత్రమేనని, దినకరన్ అక్క కుమారుడైనా, తనకు సంబంధం లేని కుటుంబా నికి చెందిన వ్యక్తి అని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను మరణించినా, వారికి అంటు అనేది లేదని వ్యాఖ్యానించారు. తనను మానసిక రోగిగా దినకరన్ వ్యాఖ్యానించాడని, అలాంటప్పుడు తనకు ఎందుకు నోటీసు పంపినట్టు అని ప్రశ్నించారు. చిన్నాభిన్నంగా ఉన్న అన్నాడీఎంకేని, కేడర్‌ను ఒకే గొడుగు నీడలోకి తీసుకొచ్చే దిశగా రాజకీయ పయనం సాగుతుందని, ఎవరికీ తాను భయపడనని, రాజకీయ పయనం ఆగదని స్పష్టం చేశారు. భేష్ తమిళనాడు ప్రభుత్వ పనితీరు అభినందనీయమని దివాకరన్ ప్రశంసించారు. డెల్టాలో జల వనరుల పరిరక్షణకు వెయ్యి కోట్లు కేటాయించడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. కావేరి వ్యవహారం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వ కోర్టు ధిక్కార కేసు సాహసోపేత నిర్ణయంగా కొనియాడారు. జయలలిత ప్రగతి పథకాలను సీఎం పళనిస్వామి చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ భారత్‌ను తమిళనాట సక్రమంగా అమలు చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. డీఎంకే నేత స్టాలిన్ తన వ్యక్తిగత శ్రమతో ఎదిగారని కితాబు ఇవ్వడం గమనార్హం. -
4నే ‘అమ్మ’ కన్నుమూశారు!
అమ్మ జయలలిత 2016 డిసెంబర్ నాలుగో తేదీనేమరణించినట్టు తనకు సమాచారం వచ్చిందని అమ్మ శిబిరం నేత, చిన్నమ్మ శశికళసోదరుడు దివాకరన్ వ్యాఖ్యానించారు. రెండుసార్లు మాత్రమే తాను అపోలోకువెళ్లానని వివరించారు. అమ్మ మరణంతదుపరి సీఎం పదవి కోసం గట్టి పోటీనే సాగిందని, చివరకు పన్నీరుకే పగ్గాలుఅప్పగించారన్నారు. సాక్షి, చెన్నై : జయలలిత మరణం మిస్టరీని నిగ్గు తేల్చేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి కమిషన్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ కమిషన్ విచారణను వేగవంతం చేసింది. జయలలితకు సన్నిహితంగా ఉన్న ఏ ఒక్కరినీ వదలి పెట్టకుండా విచారణ సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఈ విచారణకు జయలలిత నెచ్చలి శశికళ సోదరుడు దివాకరన్ హాజరయ్యారు. న్యాయమూర్తి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తన వద్ద ఉన్న వివరాలను కమిషన్ ముందు ఉంచారు. అప్పటికే అమ్మ లేరని సమాచారం విచారణ అనంతరం మీడియాతో దివాకరన్ మాట్లాడారు. విచారణ కమిషన్ ముందు తాను ఉంచిన వివరాలనుపేర్కొన్నారు. జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన తర్వాత తాను రెండుసార్లు మాత్రమే అపోలోకు వెళ్లానన్నారు. ఓ సారి తాను రాత్రి 11 గంటల సమయంలో వెళ్లానని, అప్పటికే అమ్మ నిద్ర పోవడంతో చూడలేదని వ్యాఖ్యానించారు. మరో మారు డిసెంబరు నాలుగో తేదీ తనకు అందిన సమాచారంతో విమానంలో చెన్నైకి చేరుకున్నానన్నారు. ఆరోజునే అమ్మ మరణించినట్టుగా సమాచారం తనకు వచ్చిందన్నారు. అయితే, ఆస్పత్రికి వెళ్లగా అక్కడ ఎక్మో చికిత్స అంటూ పరికారాల్ని అమర్చి ఉన్నారన్నారు. ఆ రోజున తాను పది గంటలకు అపోలకు వచ్చానన్నారు. దాదాపు అమ్మ ఇక లేరన్నది ఆ రోజునే స్పష్టమైనట్టు, అనేక టీవీ చానళ్లు సైతం ఫ్లాస్ న్యూస్‌లు వేసి, ఆ తదుపరి వెనక్కు తీసుకున్నాయన్నారు. సీఎం పదవికోసం గట్టి పోటీ అమ్మ మరణంతో సీఎం పదవి కోసం మంత్రుల మధ్య గట్టి పోటీనే సాగిందన్నారు. తమ కంటే తమకు ఆ పదవి కావాలని పట్టుబట్టిన వాళ్లూ ఉన్నారని, చివరకు పన్నీరు సెల్వంను ఆ కుర్చీలో కూర్చోబెట్టారన్నారు. వాళ్లు ఎవరో అన్న విషయాన్ని పన్నీరునే అడగాలని, చికిత్సకు సంబం«ధించి, ఇతర వివరాలను ఆయన్నే అడగండి అంటూ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. -
రచ్చ కెక్కిన ఫ్యామిలీ
సాక్షి, చెన్నై: మేనమామ దివాకరన్ను ఢీకొట్టే రీతిలో పరోక్షంగా మంగళవారం అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ వ్యాఖ్యలు సంధించారు. కేడర్‌కు లేఖాస్త్రం సందిస్తూ, దివాకరన్ కుట్రల్ని భగ్నం చేద్దామన్నట్టుగా పిలుపు నివ్వడం గమనార్హం. దినకరన్ పరోక్షంగా స్పందిస్తే, దివాకరన్ బహిరంగంగానే ఎదురుదాడికి దిగడంతో చిన్నమ్మ కుటుంబ విబేధాలు రచ్చకెక్కాయి. చిన్నమ్మ శశికళ ఫ్యామిలీ వార్ మరింతగా ముదురుతోంది. ఆమె సోదరుడు దివాకరన్, అక్క కుమారుడు దినకరన్‌ల మ«ధ్య ఈ సమరం మరింతగా రాజుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తన మద్దతుదారుడు వెట్రివేల్ ద్వారా దివాకరన్‌కు చెంపపెట్టు తగిలే రీతిలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన దినకరన్, తాజాగా తానే రంగంలోకి దిగి కేడర్‌కు లేఖాస్త్రం సంధించడమే కాదు, పరోక్షంగా మేనమామకు చురకలు అంటించే పనిలో పడడం గమనార్హం. ఐక్యతతో తిప్పి కొడదాం :అమ్మ జయలలిత మరణం తదుపరి పార్టీని రక్షించుకునేందుకు చిన్నమ్మ శశికళ రంగంలోకి దిగాల్సి రావడానికి గల పరిస్థితులను ఆ లేఖాస్త్రంలో గుర్తు చేశారు. చిన్నమ్మ జైలుకు వెళ్లడంతో అధికారంలో ఉన్న ద్రోహులు పార్టీని ౖకైవసం తమ గుప్పెట్లోకి తెచ్చుకున్నారని వివరించారు. ద్రోహుల వైపుగా వెళ్లకుండా అమ్మ ఆశయ సాధన నినాదంతో చిన్నమ్మకు మద్దతుగా లక్షలాదిగా కేడర్ తన వెంట కదిలిందని గుర్తు చేశారు. ప్రజా మద్దతు ఈ కళగంకు హోరెత్తుతుండడంతో నిర్వీర్యం చేయడానికి కొన్ని శక్తులు బయలు దేరాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక మధ్యమాల ద్వారా కళగంలో గందరగోళ పరిస్థితులు సృష్టించే కుట్రలు సాగుతున్నాయని పరోక్షంగా మేనమామ దివాకరన్ను ఉద్దేశించి వ్యాఖ్యల తూటాల్ని పేల్చారు. ద్రోహులతో కలిసి ఈ గందరగోళ ప్రయత్నాలకు దిగారని, ఈ కుట్రల్ని భగ్నం చేద్దామని కేడర్‌కు పిలుపునిచ్చారు. దొడ్డి దారిలో కొత్త కుట్రలకు సాగుతున్న ప్రయత్నాల్ని ఐక్యతతో తిప్పి కొడదామని కేడర్‌కు పిలుపునిచ్చారు. చిన్నమ్మే మార్గదర్శి అని పరోక్షంగా దివాకరన్ను ఎలాంటి సంబంధాలు లేదన్న వ్యాఖ్యల్ని ఆ లేఖలో దినకరన్ స్పందించడం గమనార్హం. తగ్గని మేనమామ.. దినకరన్ వ్యాఖ్యల తూటాలకు మేనమామ దివాకరన్ ఏమాత్రం తగ్గలేదు. ఢీకి సై అన్నట్టు ఎదురుదాడికి దిగారు. మన్నార్‌కుడిలో మంగళవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ దినకరన్‌పై విరుచుకుపడడంతో చిన్నమ్మ ఫ్యామిలీ వార్ రచ్చకెక్కింది. అన్నా, ద్రవిడం అన్న పదాలు లేని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంను తాను అంగీకరించబోనని స్పష్టం చేశారు. దినకరన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. ఇక దినకరన్‌తో కలిసి పయనం సాగించే ప్రసక్తే లేదని తేల్చారు. దినకరన్ వెన్నంటి ఉన్న కొం దరు ఎమ్మెల్యేలు మధ్యలో వచ్చిన వారేనని వారికి అంతా తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. జయలలితతో కలిసి అన్నాడీఎంకేకు దశాబ్దాల తరబడి తాను సేవల్ని అందించానని, ఆ సేవలు ఇక, మరింత విస్తృతం అవుతా యని వ్యాఖ్యానించడం గమనార్హం. -
ఫ్యామిలీ ‘వార్’
చిన్నమ్మ శశికళ కుటుంబంలోఅంతర్యుద్ధం తెర మీదకు వచ్చింది.మేనమామ దివాకరన్ను ఢీకొనేందుకు మేనల్లుడు దినకరన్ సిద్ధం అయ్యారు.ఈ ఇద్దరి మధ్య చాపకింద నీరులా సాగుతూ వచ్చిన ఇంటిపోరు అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యే వెట్రివేల్ ట్వీట్ రూపంలో తాజాగా వెలుగులోకి వచ్చింది. సాక్షి, చెన్నై : దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ కుటుంబం నుంచి వార్తల్లో వ్యక్తులుగా శశికళ సోదరుడు దివాకరన్, అన్న జయరామన్ పిల్లలు వివేక్, కృష్ణప్రియ, అక్క వనితామణి కుమారుడు దినకరన్ ఉంటున్నారు. చిన్నమ్మ జైలు జీవితం తదుపరి కుటుంబానికి పెద్ద దిక్కుగా దివాకరన్, రాజకీయ ప్రతినిధిగా దినకరన్ అడుగులు వేస్తున్నారు. ఆస్తుల పంపకాల వ్యవహారం కుటుంబంలో అంతర్యుద్ధానికి దారితీసినట్టు కొంత కాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ఉప ప్రధాన కార్యదర్శిగా, చిన్నమ్మ ప్రతినిధిగా దినకరన్ రాజకీయ బలోపేతం కోసం తీవ్రంగానే శ్రమిస్తున్నారు. అదే సమయంలో కుటుంబం వ్యక్తుల నిర్వహణలో ఉన్న సంస్థల్లో దినకరన్ జోక్యం వివాదానికి మరింత ఆజ్యం పోస్తున్నట్టు సమాచారం. దీంతో ఎవరికి వారు అన్నట్టు ముందుకు సాగుతుండడం జైల్లో ఉన్న చిన్నమ్మను కుంగదీస్తున్నట్టు తెలిసింది. భర్తమరణంతో పెరోల్ మీద వచ్చిన సమయంలో ఈ విభేదాలు చిన్నమ్మను ఉక్కిరిబిక్కిరి చేయడంతోనే ముందస్తుగానే ఆమె జైలుకు వెళ్లినట్టుగా మద్దతుదారులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరెన్ని వివాదాలు సృష్టించినా, ఒత్తిడి తెచ్చినా చిన్నమ్మ మాత్రం దినకరన్‌కు అండగా నిలబడ్డట్టు చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఫేస్బుక్లో చిన్నమ్మ విశ్వాసపాత్రుడు, అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యే వెట్రివేల్ పోస్టుచేసిన ఓ ట్వీట్ ఫ్యామిలీ వార్‌ను తెర మీదకు తీసుకొచ్చింది. వెట్రివేల్ ట్వీట్ దివాకరన్ ఎవరికో వత్తాసు పలికే రీతిలో స్పందించడం మొదలెట్టినట్టుందని వెట్రివేల్ ట్విట్టర్లో విమర్శించారు. స్వలాభం కోసం పాకులాడవద్దని పరోక్షంగా దివాకరన్‌కు హెచ్చరించారు. తమలో గందరగోళ పరిస్థితుల్ని సృష్టించే ప్రయత్నాలు చేయవద్దని చురకలంటించారు. సీఎం ఎడపాడి పళనిస్వామి మద్దతుదారుడు ఛత్రపతి శివగిరి ద్వారా అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా స్పందించడం మొదలెట్టినట్టుందని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు పన్నినా చిన్నమ్మ బలాన్ని, దినకరన్ ఎదుగుదలను అడ్డుకోలేరని హెచ్చరించారు. దినకరన్ బలాన్ని నీరుగార్చేందుకు కొత్త ప్రయత్నాల్లో పడ్డట్టు స్పష్టం అవుతోందన్నారు. రాజకీయ తెరపైకి జయ ఆనందన్ దినకరన్ మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్న దివాకరన్ చిన్నమ్మ ప్రతినిధిగా తన కుమారుడు జయ ఆనందన్‌ను రాజకీయ తెరపైకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. దినకరన్‌ను దెబ్బతీయడానికి ఆయన అధికార పక్షంతో చాపకింద నీరులా ఒప్పందాలు చేసుకున్నట్టు చర్చ సాగుతోంది. అలాగే, దినకరన్ వెన్నంటి నడిచేందుకు సిద్ధంగా ఉన్న మరో ఐదుగురు ఎమ్మెల్యేల గురించి వివరాలను దివాకరన్ శిబిరం సీఎంకు లీక్ చేసినట్టు ప్రచారం ఊపందుకుంది. ఈ సమయంలో రెండు రోజుల క్రితం ఆయన సీఎం పళనిస్వామికి అనుకూలంగా ఉన్న వారితో సంప్రదింపులు సాగించినట్టు సమాచారం. చిన్నమ్మను త్వరితగతిన జైలు నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తానని, అనర్హత వేటు పడ్డ వారితో పాటు 21 మంది ఎమ్మెల్యేలు తన వెంటే ఉన్నట్టు వ్యాఖ్యానించినట్టు ప్రచారం ఊపందుకుంది. ఈ పరిస్థితుల్లో ఆ కుటుంబంలో సాగుతున్న వివాదాలను తేటతెల్లంచేస్తూ, దివాకరన్‌కు చురకలు అంటించే విధంగా వెట్రివేల్ ట్వీట్ చేయడం చర్చకు దారితీసింది. మేనమామను ఢీకొట్టేందుకు దినకరన్ రెడీ అన్నట్టుగా స్పందించడమే కాదు.. తామెప్పుడు చిన్నమ్మ మద్దతుదారులే గానీ, దివాకరన్‌కు కాదు అని స్పష్టం చేయడం గమనార్హం. మేమంతా వారివెంటే.. అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలు అందరూ ఒకే నినాదంతో చిన్నమ్మే ప్రధాన కార్యదర్శిగా, దినకరన్ ఉప ప్రధాన కార్యదర్శిగా ముందుకు సాగుతామని వెట్రివేల్ స్పష్టంచేశారు. తమ పయనం శశికళ, దినకరన్‌ల వెంటే అని, మరెవరి వెనుక నడవాల్సిన అవసరం తమకు లేదని దివాకరన్ను ఉద్దేశించి తీవ్రంగా స్పందించడం గమనార్హం. రాజకీయంగా దినకరన్ బలపడుతుండడంతోనే, తన కుమారుడి భవిష్యత్తు దృష్ట్యా, దివాకరన్ కొత్త ప్రయత్నాలకు సిద్ధపడ్డ విషయం అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాల దృష్టికి చేరినట్టు తెలిసింది. తాజా పరిస్థితులతో ఢీకి రెడీ అన్నట్టుగా వ్యూహంతో వెట్రివేల్ ద్వారా మేనమామకు దినకరన్ చెంపపెట్టు సమాధానం ఇచ్చినట్టు చర్చ ఊపందుకుంది. -
మరో బాంబు పేల్చిన శశికళ సోదరుడు
సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణించి ఏడాది పూర్తైనా అనుమానాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ‘అమ్మ’ ఎలా చనిపోయారన్నది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నగానే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా శశికళ సోదరుడు దివాకరన్ మరో బాంబు పేల్చారు. జయలలిత ఒకరోజు ముందుగానే కన్నుమూశారని వెల్లడించారు. 2016 డిసెంబర్ 4నే ‘అమ్మ’ చనిపోయిందని, అయితే 5న మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారని తెలిపారు. జయలలిత మద్దతుదారులు హింసాత్మక చర్యలకు దిగుతారన్న భయంతో ఆమె మరణవార్తను ఆలస్యంగా ప్రకటించాలని అన్నాడీఎంకే పార్టీ సూచించడంతో ఈవిధంగా చేశారని వివరించారు. ‘జయలలిత డిసెంబర్ 4న సాయంత్రం 5.15 గంటలకు మరణించారు. శాంతిభద్రతల సమస్య వస్తుందన్న కారణంతో అన్నాడీఎంకే పార్టీ ‘అమ్మ’ మరణవార్తను ఆలస్యంగా ప్రకటించింది. ఈలోపు రాష్ట్రంలోని అన్ని అపోలో ఆస్పత్రుల దగ్గర భద్రతను పెంచార’ని వెల్లడించారు. జయలలిత తీవ్ర అస్వస్థతకు గురై చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2016 డిసెంబర్ 5న అనుమానాస్పద పరిస్థితుల్లో కన్నుమూశారు. ‘అమ్మ’ మృతి వెనుక ఆమె నెచ్చెలి శశికళ హస్తముందనే ఆరోపణలు వచ్చాయి. జయ మృతిపై అపోలో ఆస్పత్రి ఇప్పటికే వివరణ ఇచ్చింది. అనుమానాలను నివృత్తి చేయడానికి న్యాయవిచారణ జరపాలని పన్నీర్ సెల్వం డిమాండ్ చేయడంతో పళనిస్వామి ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది. -
దినకరన్‌కు 40మంది ఎమ్మెల్యేల మద్దతు!
చెన్నై: ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి నేతృత్వంలోని మైనారిటీ ప్రభుత్వాన్ని కూల్చి తీరుతామని టీటీవీ దినకరన్ వర్గం శపథం చేసింది. పళనిస్వామికి వ్యతిరేకంగా తమకు 40మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆ వర్గం పేర్కొంది. జైలుపాలైన అన్నాడీఎంకే నేత వీకే శశికళ సోదరుడు దివాకరన్ బుధవారం కుంభకోణంలో మీడియాతో మాట్లాడుతూ.. తమకు 40మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించారు. పళని ప్రభుత్వాన్ని కూల్చి.. అసెంబ్లీ స్పీకర్ పీ ధనపాల్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని ఆయన తెలిపారు. అసెంబ్లీలో పళనిస్వామి మెజారిటీ నిరూపించుకోలేరని, ఆయన ప్రభుత్వం కూలడం ఖాయమని అన్నారు. పన్నీర్ సెల్వంతో ఉప ముఖ్యమంత్రిగా గవర్నర్ విద్యాసాగర్‌రావు ప్రమాణం చేయించడం తప్పుడు చర్య అని దివాకరన్ మండిపడ్డారు. తమిళనాడులో అస్థిర ప్రభుత్వం నడుస్తున్నదని విమర్శించారు. పరప్పన అగ్రహార జైలు నుంచి శశికళ బయటకు వెళ్లినట్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోపై దినకరన్ స్పందించారు. అది నకిలీ వీడియో అని, కావాలనే ఆ వీడియోను ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.