
మన్నార్‌గుడి: ఏఐఏడీఎంకే బహిష్కృత నేత వి.కె.శశికళ కుటుంబం నుంచి మరో రాజకీయ పార్టీ ఏర్పాటైంది. శశికళ సోదరుడు వి.దివాకరన్ ఆదివారం కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. ఇప్పటికే శశికళ కుటుంబానికి చెందిన ఆర్కేనగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం(ఏఎంఎంకే) పార్టీని స్థాపించారు. దినకరన్‌పై తీవ్ర విమర్శలు చేసిన దివాకరన్‌కు గత నెలలో శశికళ లీగల్ నోటీసులిచ్చారు. బహిరంగ సభల్లో తన పేరు వాడుకోరాదని అందులో హెచ్చరించారు. శశికళను ప్రస్తావించాల్సినప్పుడు సోదరిగా చెప్పుకోబోననీ, ‘తన మాజీ సోదరి’అని మాత్రమే అంటానని దివాకరన్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆయన ‘అన్న ద్రవిడార్ కళగం (ఏడీకే)’పార్టీని ఏర్పాటు చేశారు. ‘అన్నా’అని అందరూ పిలుచుకునే ద్రవిడ నేత సీఎన్ అన్నాదురై పేరుతో ఈ పార్టీని స్థాపించినట్లు ప్రకటించారు.