తండ్రి-కొడుకులు-అన్న- తమ్ముడు
నాగబాబుకు మంత్రి పదవా?
లోలోన రగిలిపోతున్న టీడీపీ సీనియర్లు
కూటమి సర్కారు ఫ్యామిలీ సర్కస్ మాదిరి మారింది. సర్కారులో ఉపముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును సైతం కేబినెట్‌లోకి తీసుకుంటామని చంద్రబాబు చేసిన ప్రకటన రాష్ట్రంలో రాజకీయ చర్చకు దారితీసింది. వాస్తవానికి పార్టీలో అత్యంత కీలకమైనవ్యక్తులకు నేరుగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేనివాళ్లకు మాత్రమే ఇలా ఎమ్మెల్సీగా గెలిపించి మంత్రిగా చేస్తారు.. 2014 ఎన్నికల్లో ఓడిపోయినా పొంగూరు నారాయణ, లోకేష్ వంటివాళ్లకు మంత్రిగా స్థానం కల్పించారు. మొన్నటికి మొన్న వైయస్ జగన్ కేబినెట్లోనూ ఓడిపోయినా మోపిదేవి వెంకటరమణకు ఎమ్మెల్సీగా చేసి మంత్రిగా అవకాశం వచ్చింది. అయితే ఇప్పుడొచ్చిన చిక్కంతా కూటమిలో ఫ్యామిలీ ఫ్యాక్స్ ఎక్కవైనాయి అనేది చర్చకు వచ్చింది.
కూటమి ధర్మం అంటూ చంద్రబాబు చేస్తున్న చేష్టలు దిగజారినట్లుగా ఉంటున్నాయని అంటున్నారు. వాస్తవానికి తాజాగా ఖాళీ అయిన మూడు రాజ్యసభ సీట్లలో ఒకటి నాగబాబుకు ఇస్తారని ఊహాగానాలు వచ్చాయి. పవన్ సైతం ఆ అంశాన్ని చర్చించేందుకు ఢిల్లీ వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ మూడు సీట్లలో ఒకటి బిజెపి.. రెండు తెలుగుదేశం వాళ్ళు ఎగరేసుకుపోవడంతో నాగబాబుకు రాజ్యసభ ప్రాప్తం లేకుండా పోయింది. దీంతో ఆయన్ను సంతుష్టుణ్ణి చేసేందుకు కేబినెట్లోకి తీసుకుంటున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.
నామినేటెడ్ పదవుల విషయంలో కూడా మొదటినుంచీ కష్టపడినవాళ్లకు కాకుండా పైరవీకారులకు, డబ్బులు ఇచ్చేవాళ్లకే ప్రాధాన్యం దక్కిందన్న మూతి విరుపులు ఇప్పటికే వెల్లువెత్తుతున్నాయి. జనసేన పార్టీలో నాగబాబు పాత్ర, పార్టీ నిర్వహణ .. ఆర్థికవ్యవహారాలు వంటి అంశాల్లో అయన వ్యవహారశైలి మీద తీవ్ర విమర్శలు ఉన్నాయి. టిక్కెట్ల కోసం డబ్బులు కలెక్షన్ చేశారని. కార్యకర్తలను సాంతం వాడేసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
అయినా సరే డిప్యూటీ సీఎం పవన్ సోదరుడు కావడం.. పైగా ఎలాగైనా చట్టసభకు వెళ్లాలన్న కోరిక నాగబాబుతో ఉండడంతో ఆయన్ను ఈవిధంగా సంతృప్తి పరుస్తున్నట్లు టీడీపీ క్యాడర్ చెప్పుకుంటోంది. ఇప్పటికే టీడీపీలో సీనియర్లు అయిన యనమల రామకృషుడు,, కిమిడి కళావెంకట్రావు, పత్తిపాటి పుల్లారావు వంటివాళ్లకు మంత్రిపదవుల్లేక వట్టి ఎమ్మెల్యేలుగా జనాల్లోకి వెళ్లలేక అవమానభారం మోస్తుంటే ఇప్పుడు ఏమీలేని నాగబాబును ఎలా మంత్రిని చేస్తున్నారు అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికే చంద్రబాబు.. అయన కుమారుడు లోకేష్ అధికారంలో ఉన్నారు.. ఇక శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు. అయన అన్నకొడుకు రామ్మోహన్ నాయుడు (కేంద్ర మంత్రి)గా ఉన్నారు. అలవిమాలిన హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులూ ఇప్పుడు ఆహామీల సంగతిపక్కనబెట్టి అధికారాన్ని పంచుకోవడంలో బిజీ అయ్యారని టీడీపీ నేతలే చెప్పుకుంటున్నారు.
బాబు మాటలు.. నీటి మూటలు
నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు.. అనడమే కాకుండా ప్రతి వ్యక్తికీ ఒక పథకాన్ని ప్రకటించారు. అవేం అమలుకాకపోగా గతంలో జగన్ ఇచ్చిన పథకాలన్నీ రద్దు చేసారు . పైగా ఇప్పటికే 75 వేల కోట్లు అప్పు చేసిన కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు రెండుసార్లు పెంచి జనం నడ్డివిరగ్గొట్టారు. ఆ వైఫల్యాలను జనం ప్రస్తావించకుండా ఉండేందుకు ఒక నెల తిరుమల లడ్డులో కొవ్వు అంటూ.. ఇంకో నెల సోషల్ మీడియా అరెష్టులు.. ఇంకోసారి ఇంకేదో అంశాన్ని తెరమీదకు తెచ్చి జనం దృష్టిని మళ్లిస్తూ వస్తున్నారు.
ఇదీ చదవండి: డైలాగులకూ చేతలకూ పొంతనుండొద్దా?
ఫ్రీ ఇసుక లేకపోగా దాని ధర ఆకాశాన్ని అంటింది. మంత్రులు.. ఎమ్మెల్యేలు ఎక్కడ రూపాయి ఉంటె అక్కడికి వాలిపోతున్నారు. ఇక పవన్ సైతం పలు సందర్భాల్లో మాట్లాడుతూ ఖజానా ఖాళీగా ఉంది.. ఏమి చేయలేకపోతున్నాం అని వగచారు. సంపద సృష్టిస్తాం అని చెప్పుకుని గెలిచాక ఈ చేతగాని ఏడుపులు ఎందుకు అంటూ ప్రజలనుంచి విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉండగానే నాగబాబుకు మంత్రిపదవి అంటూ చంద్రబాబు సరికొత్త కాన్సెప్ట్ ను బయటకు తీశారు. మొత్తానికి కూటమి సర్కారు జల్సా చేస్తోంది తప్ప ప్రజలకు చేస్తున్నదేం లేదని అంటున్నారు. నాగబాబు మంత్రి అయితే జబర్దస్త్ కామెడీ మొత్తం కేబినెట్లోనే ఉంటుందని అంటున్నారు
-సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment