దినకరన్‌కు 40మంది ఎమ్మెల్యేల మద్దతు!
చెన్నై: ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి నేతృత్వంలోని మైనారిటీ ప్రభుత్వాన్ని కూల్చి తీరుతామని టీటీవీ దినకరన్ వర్గం శపథం చేసింది. పళనిస్వామికి వ్యతిరేకంగా తమకు 40మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆ వర్గం పేర్కొంది.
జైలుపాలైన అన్నాడీఎంకే నేత వీకే శశికళ సోదరుడు దివాకరన్ బుధవారం కుంభకోణంలో మీడియాతో మాట్లాడుతూ.. తమకు 40మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించారు. పళని ప్రభుత్వాన్ని కూల్చి.. అసెంబ్లీ స్పీకర్ పీ ధనపాల్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని ఆయన తెలిపారు. అసెంబ్లీలో పళనిస్వామి మెజారిటీ నిరూపించుకోలేరని, ఆయన ప్రభుత్వం కూలడం ఖాయమని అన్నారు. పన్నీర్ సెల్వంతో ఉప ముఖ్యమంత్రిగా గవర్నర్ విద్యాసాగర్‌రావు ప్రమాణం చేయించడం తప్పుడు చర్య అని దివాకరన్ మండిపడ్డారు. తమిళనాడులో అస్థిర ప్రభుత్వం నడుస్తున్నదని విమర్శించారు. పరప్పన అగ్రహార జైలు నుంచి శశికళ బయటకు వెళ్లినట్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోపై దినకరన్ స్పందించారు. అది నకిలీ వీడియో అని, కావాలనే ఆ వీడియోను ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.