చెన్నై: ప్రజాస్వామ్య పద్ధతిలో అన్నాడీఎంకే పార్టీని చేజిక్కించుకుని తిరిగి అమ్మ ప్రభుత్వం ఏర్పడుతుందని శశికళ మేనల్లుడు, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ నాయకుడు దినకరన్ ప్రకటించారు. బెంగళూరులో క్వారంటైన్ పూర్తి చేసుకుని ఈనెల 7వ తేదీన తమిళనాడుకు వస్తారని తెలిపారు. ఎన్నికల తర్వాత తిరిగి 'అమ్మ' ప్రభుత్వం ఏర్పాటు విషయంలో శశికళ కీలక భూమిక పోషిస్తారని చెప్పారు. తమిళనాడులోని మధురైలో బుధవారం ఆయన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. జయలిలత నిజమైన మద్దతుదారులంతా శశికళ రాక కోసం ఎదురు చూస్తున్నట్టు పేర్కొన్నారు. శశికళ రాక సందర్భంగా కర్ణాటక-తమిళనాడు సరిహద్దుల్లోని హోసూరు నుంచి చెన్నై వరకూ భారీ స్వాగత ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
నాలుగేళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకుని ఇటీవల శశికళ విడుదలయ్యారు. అయితే కరోనా సోకడంతో ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జయిన విషయం తెలిసిందే. ఆమె రాక సందర్భంగా దినకరన్ స్పందించారు. శశికళ విడుదలైన రోజు నుంచి రాజకీయాలు మారుతాయని పేర్కొన్నారు. జయలలిత స్మారక నిర్మాణాన్ని శశికళ సందర్శించాలని ఉన్నా కూడా అయితే ఉద్దేశపూర్వకంగా అది మూసి ఉంచారని ఆరోపించారు. పార్టీ నిబంధనల ప్రకారం జనరల్ సెక్రటరీ పదవి నుంచి తొలగించే అధికారం ఎవరికీ ఉండదని, జనరల్ సెక్రటరీ మాత్రమే సర్వసభ్య సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని గుర్తుచేశారు.
జనరల్ సెక్రటరీ పదవిని రద్దు చేయడంపై శశికళ కోర్టులో సవాలు చేశారని తెలిపారు. తన పదవిని పునరుద్ధరించే విషయంలో ఆమె పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత 'అమ్మ' ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని, ప్రభుత్వంలో శశికళ కీలక పాత్ర పోషిస్తారని ధీమా వ్యక్తం చేశారు. దినకరన్ ప్రస్తుతం ఆర్కే నగర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment