
సాక్షి, చైన్నె: తిరుచ్చి వేదికగా జరగనున్న మహానాడుకు శశికళ, దినకరన్‌ను ఆహ్వానించనున్నట్లు అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం తెలిపారు. అన్నాడీఎంకేలో విభేదాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ పార్టీని పూర్తిగా ప్రధాన కార్యదర్శి హోదాలో పళనిస్వామి తన గుప్పెట్లో తెచ్చుకున్నారు. అయితే న్యాయ పోరాటం ద్వారా పార్టీ మళ్లీ సత్తా చాటాలని సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరుసెల్వం ప్రయత్నిస్తున్నారు. తన బలాన్ని చాటుకునే విధంగా ఈనెల 24వ తేదీన తిరుచ్చి వేదికగా భారీ మహానాడుకు సిద్ధమయ్యారకు.
ముప్పెరుం విళాగా ఈ వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మహానాడు విజయవంతం కోసం తన శిబిరం తరపున జిల్లాల కార్యదర్శులుగా ఉన్న నేతలతో సమావేశాల్లో పన్నీరు నిమగ్న మయ్యారు. మంగళవారం జరిగిన సమావేశానంతరం మీడియాతో పన్నీరు సెల్వం మాట్లాడుతూ, ముప్పెంరు విళా అన్నది అన్నాడీఎంకే కార్యకర్తలకు దివంగత నేత ఎంజీఆర్ ఇచ్చిన హక్కులను కాపాడే విధంగా ఉంటుందని వివరించారు.
పదవీ వ్యామోహంతో నిబంధనలు ఉల్లంఘించి సర్వాధికారంతో విర్ర వీగుతున్న ముఠాకు గుణపాఠం చెప్పే వేదిక అవుతుందన్నారు. ఈ మహానాడుకు చిన్నమ్మ శశికళ, అమ్మ మక్కల్ మున్నేట్రకళగం నేత టీటీవీ దినకరన్‌ను ఆహ్వానించనున్నట్లు ప్రకటించారు. వారు తప్పకుండా ఈ మహానాడుకు వస్తారంటూ ధీమా వ్యక్తం చేశారు. కాగా, పన్నీరు వ్యాఖ్యలపై పళని శిబిరం సీనియర్‌నేత జయకుమార్ స్పందిస్తూ, ఆ మహానాడును తాము లెక్కలోకి తీసుకోవడం లేదన్నారు. అలాంటప్పుడు ఆయన ఎవరిని ఆహ్వానిస్తే తమకేంటిని ప్రశ్నించారు.