సాక్షి, చైన్నె: ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేలో నెలకొన్న వర్గ విభేదాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. న్యాయ పోరాటం ద్వారా, మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతల మద్దతుతో అన్నాడీఎంకేను మాజీ సీఎం పళని స్వామి తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు. ఇక పళణి స్వామి తనను దూరం పెట్టడంతో వేరు కుంపటి పెట్టిన మరో మాజీ సీఎం పన్నీరు సెల్వం ఆ పార్టీని ఎలాగైనా కై వసం చేసుకోవడం లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టి ఉన్నారు.
ఇందులో భాగంగా గతంలో అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చి అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంతో రాజకీయ పయనం సాగిస్తున్న టీటీవీ దినకరన్‌ను చేతులు కలిపారు. ఒకప్పుడు బద్ద శత్రువులుగా ఉన్న ఈ ఇద్దరు ప్రస్తుతం మంచి మిత్రులయ్యారు. అలాగే టీటీవీ దినకరన్ ద్వారా దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళను ప్రసన్నం చేసుకుని అన్నాడీఎంకే కై వశం లక్ష్యంగా మరింతగా వ్యూహాలకు పదును పెట్టాలనే ఆశతో ఉన్న పన్నీరుకు ప్రస్తుతం షాక్ తప్పలేదు.
పెద్ద దిక్కుగా ఉండాలని..
అన్నాడీఎంకేలో తాజా పరిణామాల వ్యవహారంలో ఎవరో ఒకరి వైపుగా నిలబడకుండా తటస్థంగా వ్యవహరించి పార్టీకి పెద్ద దిక్కుగా నిలబడాలనే వ్యూహంతో చిన్నమ్మ ఉన్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. అందుకే ఆమె పన్నీరు, టీటీవీ దినకరన్ హాజరైన ఈ వివాహ వేడుకకు దూరంగా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ వివాహ వేడుకకు చిన్నమ్మ వస్తారనే ఎదురు చూపుల్లో దక్షిణ తమిళనాడులోని కీలక సామాజిక వర్గం వేచి ఉన్నా, చివరకు ప్రయోజనం లేకుండా పోయింది.
అదే సమయంలో చిన్నమ్మ శశికళ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామితో భేటీకి ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. దక్షిణ తమిళనాడులోని బలమైన సామాజికవర్గం తన వెంట, పన్నీరు, దినకరన్ వెనుక ఉన్నా, ప్రస్తుతం పార్టీతో పాటుగా ముఖ్య నేతల బలం, మద్దతు పళణిస్వామి చేతిలో ఉండడాన్ని చిన్నమ్మ పరిగణనలోకి తీసుకుని ఉన్నారు. అందుకే పళణిస్వామితో సంప్రదింపులతో రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే ఐక్యతను చాటే విధంగా కొత్త ప్రయత్నాలకు చిన్నమ్మ సిద్ధమై తాజాగా తటస్థంగా వ్యవహరించే పనిలో పడ్డట్టు ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు.
అలాగే, పళణికి రాయబారానికి దక్షిణ తమిళనాడుకు చెందిన మాజీ మంత్రులు నలుగుర్ని చిన్నమ్మ రంగంలోకి దించినట్లు చెబుతున్నారు. ఈ నలుగురు ప్రస్తుతం పళణి స్వామి వెన్నంటే ఉన్నా, లోక్‌సభ ఎన్నికల నాటికి అందరూ ఐక్యతతో అన్నాడీఎంకేకు తిరుగులేని విజయం అందించాలన్న కాంక్షతో ఈ రాయబార ప్రయత్నాలకు సిద్ధమైనట్టు చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment