సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణించి ఏడాది పూర్తైనా అనుమానాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ‘అమ్మ’ ఎలా చనిపోయారన్నది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నగానే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా శశికళ సోదరుడు దివాకరన్ మరో బాంబు పేల్చారు. జయలలిత ఒకరోజు ముందుగానే కన్నుమూశారని వెల్లడించారు. 2016 డిసెంబర్ 4నే ‘అమ్మ’ చనిపోయిందని, అయితే 5న మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారని తెలిపారు. జయలలిత మద్దతుదారులు హింసాత్మక చర్యలకు దిగుతారన్న భయంతో ఆమె మరణవార్తను ఆలస్యంగా ప్రకటించాలని అన్నాడీఎంకే పార్టీ సూచించడంతో ఈవిధంగా చేశారని వివరించారు.
‘జయలలిత డిసెంబర్ 4న సాయంత్రం 5.15 గంటలకు మరణించారు. శాంతిభద్రతల సమస్య వస్తుందన్న కారణంతో అన్నాడీఎంకే పార్టీ ‘అమ్మ’ మరణవార్తను ఆలస్యంగా ప్రకటించింది. ఈలోపు రాష్ట్రంలోని అన్ని అపోలో ఆస్పత్రుల దగ్గర భద్రతను పెంచార’ని వెల్లడించారు.
జయలలిత తీవ్ర అస్వస్థతకు గురై చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2016 డిసెంబర్ 5న అనుమానాస్పద పరిస్థితుల్లో కన్నుమూశారు. ‘అమ్మ’ మృతి వెనుక ఆమె నెచ్చెలి శశికళ హస్తముందనే ఆరోపణలు వచ్చాయి. జయ మృతిపై అపోలో ఆస్పత్రి ఇప్పటికే వివరణ ఇచ్చింది. అనుమానాలను నివృత్తి చేయడానికి న్యాయవిచారణ జరపాలని పన్నీర్ సెల్వం డిమాండ్ చేయడంతో పళనిస్వామి ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment