సీపీఐ జాబితా | CPI released list of candidates | Sakshi
Sakshi News home page

సీపీఐ జాబితా

Published Thu, Mar 20 2014 3:58 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

CPI released list of candidates

సాక్షి, చెన్నై: ఎన్నికల బరిలో నిలబడే తమ అభ్యర్థుల జాబితాను సీపీఐ బుధవారం రాత్రి ప్రకటించింది. తొమ్మిది స్థానాల బరిలో అభ్యర్థులను దించారు. ఈ నెల 24 నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టనున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి టీ పాండియన్ ప్రకటించారు. అన్నాడీఎంకేను పక్కన పెట్టి సీపీఎం, సీపీఐలు కలిసి రాష్ట్రంలో ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తమకు పట్టున్న స్థానాలను ఈ రెండు పార్టీలు ఎంపిక చేసుకున్నాయి. చెరో తొమ్మిది స్థానాల్లో పోటీకి నిర్ణయించాయి. రెండు పార్టీలు ఏకాభిప్రాయంతో సీట్ల పంపకాలను ముగించాయి. సీపీఎం జాబితా రెండు రోజుల క్రితం వెలువడగా, సీపీఐ జాబితాను తాజాగా ప్రకటించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తమ అభ్యర్థుల జాబితాను రాష్ట్ర పార్టీ కార్యదర్శి టీ పాండియన్ విడుదల చేశారు.

 అభ్యర్థులు:  తెన్‌కాశీ - లింగం, నాగపట్నం-జి పళని స్వామి, పుదుచ్చేరి - విశ్వనాథన్,  సీపీఐ జాబితా
 తిరుప్పూర్- సుబ్బరాయన్, శివగంగై - ఎస్ కృష్ణన్, తిరువళ్లూరు - ఏఎస్ కన్నన్, కడలూరు - బాలసుబ్రమణ్యన్, రామనాథపురం - ఉమామహేశ్వరి, తూత్తుకుడి - మోహన్ రాజ్‌లు ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించారు.

 24 నుంచి ప్రచారం : అభ్యర్థులను ప్రకటించిన టీ పాండియన్ ప్రచారానికి సిద్ధం అయ్యారు. ఈనెల 24 నుంచి తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేపట్టనున్నాన్నట్టు ఆయన వివరించారు. కాంగ్రెస్‌ను ఓడించడం తమ లక్ష్యంగా పేర్కొన్నారు. దేశాన్ని సర్వనాశనం చేశారని, అన్నదాతలను కన్నీటి మడుగులో ముంచారని ధ్వజమెత్తారు. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకునే స్థితికి తెచ్చిన కాంగ్రెస్‌ను తరిమి కొట్టడం లక్ష్యంగా ఎన్నికల్లో ప్రచారం ఉంటుందని వివరించారు.

కార్పొరేట్ సంస్థల ధనంతో, మీడియా బలంతో ప్రధాని అభ్యర్థిని తానే అని ప్రచారం చేసుకుంటున్న మోడీని ఓడించే విధంగా ఓటర్ల వద్దకు వెళ్లనున్నామన్నారు. మతత్వానికి వ్యతిరేకంగా ప్రజల్ని ఏకం చేసి తమ అభ్యర్థుల్ని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. వామపక్షాల తరపున పలాన వ్యక్తి పీఎం అభ్యర్థిగా పేర్కొంటూ ప్రచారం ఉండబోదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తాము ఏ ఒకర్నీ ముందుకు తీసుకొచ్చే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement